Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో పోరాడి ఓడిన సింధు
- వరుస గేముల్లో తైజు యింగ్ విజయం
- కాంస్య పోరులో హీ బింగ్జియావ్తో ఢీ
టోక్యో ఒలింపిక్స్‌లో మన రాకెట్ తడబాటుకు గురైంది. పసిడి పతకంపై గురిపెట్టిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. వరల్డ్ నం.1 తైజు యింగ్‌తో పోరాడిన సింధు.. ఫైనల్లోకి చేరుకోలేకపోయింది. సింధు సహజసిద్ధ దూకుడు, స్మాష్‌లు, అటాకింగ్ శైలిలో సెమీఫైనల్ మ్యాచ్‌లో కనిపించలేదు. నేడు కాంస్య పతక పోరులో ఎనిమిదో సీడ్ చైనా షట్లర్ హీ బింగ్జియావ్తో పి.వి సింధు పోటీపడనుంది.
నవతెలంగాణ-టోక్యో
పి.వి సింధు పసిడి పోరుకు తెరపడింది!. పసిడి పోరుకు అర్హత సాధించటంలో భారత అగ్రశ్రేణి షట్లర్ విఫలమైంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నం.1 తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో పోరులో పూసర్ల వెంకట సింధు వరుస గేముల్లో పరాజయం చవిచూసింది. 40 నిమిషాల్లోనే ముగిసిన సెమీ సమరంలో 18-21, 12-21తో సింధు ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో ఆధిక్యంలో నిలిచిన సింధు.. ఆ దూకుడు కొనసాగించటంలో విఫలమైంది. సింధుపై విజయంతో రెండో సీడ్ తైజు యింగ్ తొలిసారి ఒలింపిక్ పసిడి పోరులో ఆడనుంది. ఇద్దరు చైనా షట్లర్లు తలపడిన మరో సెమీఫైనల్లో టాప్ సీడ్, వరల్డ్ నం.2 చెన్ యుఫెరు ఫైనల్లోకి చేరుకుంది. 21-16, 13-21, 21-12తో సహచర షట్లర్ హీ బింగ్జియావ్ (8)పై విజయం సాధించింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో ఆరో సీడ్ పి.వి సింధుతో ఎనిమిదో సీడ్ హీ బింగ్జియావ్ పోటీపడనుంది.
ఆధిపత్యం చూపించలే..! : రియో ఒలింపిక్స్ పరాజయానికి తైజు యింగ్ ప్రతీకారం తీర్చుకుంది. 2016 ఒలింపిక్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లో పి.వి సింధు చేతిలోనే తైజు యింగ్ ఓటమి పాలైంది. మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న తైజు యింగ్.. సింధుపై విజయంతోనే ఒలింపిక్ పసిడి పోరుకు సై అనేసింది. తైజు యింగ్, పి.వి సింధులు ఇద్దరూ అగ్రశ్రేణి షట్లర్లు. దీంతో సెమీ సమరం మినీ ఫైనల్‌ను తలపించే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరు పోటీపడిన మ్యాచుల్లో ఫలితం అంత తేలిగ్గా తేలలేదు. అంచనాలకు భిన్నంగా ఒలింపిక్ సెమీఫైనల్ ముగిసింది. తొలి గేమ్‌లో ఆధిక్యం సాధించిన పి.వి సింధు ముగింపులో తడబడింది. 0-2తో నెమ్మదిగా మొదలుపెట్టిన సింధు.. 5-2తో ముందంజలోకి వచ్చింది. విరామ సమయానికి 11-7తో నాలుగు పాయింట్ల విలువైన ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్థంలో తైజు యింగ్ పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. 11-11తో స్కోరు సమం చేసింది. ఇక్కడి నుంచి గేమ్ ఉత్కంఠగా సాగింది. సింధు ఓ పాయింట్ అధిక్యం సాధించగా.. తైజు యింగ్ సమం చేస్తూ వచ్చింది. 16-14తో రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన సింధుకు గేమ్‌ను ముగించే అవకాశం లభించింది. కానీ ఇక్కడ మరోసారి తైజు యింగ్ గొప్పగా పోరాడింది. 16-16తో స్కోరు సమం చేసింది. 18-18తో ఇద్దరికీ గేమ్‌పై సమాన అవకాశాలు ఉన్న సమయంలో.. వరల్డ్ నం.1 మ్యాజిక్ చేసింది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 21-18తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. 21 నిమిషాల్లో ముగిసిన తొలి గేమ్‌లో సింధు మంచి ప్రదర్శన చేసింది. ఆఖరు వరకూ గేమ్‌లో నిలిచింది.
రెండో గేమ్‌కు పూర్తి భిన్నంగా సాగింది. సింధు చావోరేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో.. అటాకింగ్ శైలితో ఆడుతుందనే అనుకున్నారు. అంచనాలను నిజం చేస్తూ సింధు ఆరంభంలోనే స్మాష్‌లు సంధించింది. ప్రథమార్థం ఆరంభంలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. 3-4తో ఓ పాయింట్ వెనుకంజలో ఉన్న తైజు యింగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 7-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక్కడే సింధు గేమ్‌పై కాస్త పట్టు కోల్పోయింది. విరామ సమయానికి 7-11తో నాలుగు పాయింట్ల వెనుకంజలో నిలిచిన సింధు.. పోరాట స్ఫూర్తిని కనబర్చటంలో విఫలమైంది. విరామ సమయం అనంతరం తైజు యింగ్ సులువుగా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సింధును కోర్టు నలుమూలలా ఆడించిన తైజు యింగ్.. భారత షట్లర్ పదునైన పవర్ఫుల్ స్మాష్‌లు ఎదుర్కొవటం నుంచి తెలివిగా తప్పించుకుంది. తైజు యింగ్ వ్యూహంలో పడిన సింధు.. రిటర్న్లపైనే దృష్టి నిలిపింది. 8-16తో పాయింట్ల అంతరం భారీగా పెరిగిపోగా.. కోర్టులో సింధు సైతం నైరాశ్యంతో కనిపించింది!. 21-12తో 19 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించిన తైజు యింగ్.. తొలిసారి ఒలింపిక్ పసిడి పోరుకు చేరుకుంది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్స్ దారిలో పి.వి సింధు ఒక్క గేమ్‌కు కూడా ఓడిపోలేదు. గ్రూప్ దశలో సెనియా, చెంగ్.. ప్రీ క్వార్టర్స్‌లో మియా, క్వార్టర్స్‌లో యమగూచిలపై వరుస గేముల్లో 2-0 విజయాలు నమోదు చేసింది. సెమీఫైనల్లో తైజు చేతిలోనే తొలి గేమ్ కోల్పోయిన సింధు.. ఆమె చేతిలోనే టోక్యోలో తొలి ఓటమి చవిచూసింది.
ఇక కాంస్య పోరు
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పరాజయం పాలైనా.. పి.వి సింధు పతక ఆశలకు ఎటువంటి బెంగ లేదు. ఫైనల్స్‌కు చేరిన షట్లర్లు పసిడి, రజత పతకాలు పంచుకోనుండగా.. సెమీఫైనల్లో ఓడిన షట్లర్లు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఆల్ చైనా సెమీస్‌లో టాప్ సీడ్ చెన్ యుఫెరు చేతిలో హీ బింగ్జియావ్ ఓడిపోయింది. కాంస్య పతక పోరులో సింధుతో ఎనిమిదో సీడ్ హీ బింగ్జియావ్ తలపడనుంది. మాజీ వరల్డ్ నం.6 హీ బింగ్జియావ్ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీ పడుతుంది. సింధుతో ముఖాముఖి గణాంకాల్లో చైనా షట్లర్ పైచేయి సాధించింది. 15 మ్యాచుల్లో చైనా అమ్మాయి ఏకంగా తొమ్మిది విజయాలు నమోదు చేసింది. ప్రత్యర్థిని తికమక పెట్టడం, అనూహ్య డ్రాప్ షాట్లు ఆడటం, ప్రత్యర్థిని తప్పుదోవ పట్టించే వ్యూహంతో కనిపించటం హీ బింగ్జియావ్ బలం. ఇద్దరు చైనా షట్లర్లు తలపడిన సెమీఫైనల్లో అమ్మాయిలకు కోచ్ సహకారం లభించలేదు. ఓ షట్లర్‌కు వ్యతిరేకంగా మరో షట్లర్‌కు సలహాలు ఇవ్వటం మంచి సంప్రదాయం కాదనే ఉద్దేశంతో చైనా కోచ్‌లు సెమీస్ పోరుకు దూరంగా ఉన్నారు. చెన్ యుఫెరు, హీ బింగ్జియావ్లు సొంత గేమ్ ప్లాన్‌తో సెమీస్‌లో తలపడ్డారు. నేడు కాంస్య పతక పోరులో హీ బింగ్జియావ్ తిరిగి జాతీయ కోచ్ సేవలు అందుకోనుంది. వరుసగా రెండో ఒలింపిక్ మెడల్ దారిలో.. సింధు బలమైన డ్రాగన్ షట్లర్‌ను ఓడించాల్సి ఉంది.