Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 ఏండ్ల అనంతరం ఒలింపిక్స్ సెమీస్‌లో అడుగు
- క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌పై 3-1తో ఘన విజయం
- సెమీస్‌లో బెల్జియంతో అమీతుమీకి మన్‌ప్రీత్‌సేన
నవతెలంగాణ-టోక్యో
హాకీ ఇండియా టోక్యోలో చెలరేగుతోంది. 41 ఏండ్ల సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతూ 2020 ఒలింపిక్స్ హాకీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత పురుషుల జట్టు 3-1తో మెరుపు విజయం సాధించారు. గ్రేట్ బ్రిటన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనా.. గోల్‌కీపర్ శ్రీజేష్ సారథ్యంలో డిఫెన్స్ సమర్థవంతంగా నిలువరించింది. దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, హార్దిక్ సింగ్‌లు భారత్‌కు గెలుపు గోల్స్ అందించారు. మంగళవారం జరుగనున్న సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ బెల్జియంతో మన్‌ప్రీత్ సేన తలపడనుంది. గ్రూప్ దశలో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించిన భారత్.. నాకౌట్ దశలో వరల్డ్ చాంపియన్‌ను మట్టికరిపించేందుకు సిద్ధమవుతోంది.
అదరగొట్టారు : హాకీ ఇండియా అంచనాలను అందుకుంది. సమష్టి ప్రదర్శనతో ఒలింపిక్ సెమీస్‌లోకి చేరుకుంది. క్వార్టర్స్ పోరును దూకుడుగా ఆరంభించిన భారత్‌కు నీలకంఠ శర్మ, మన్దీప్ సింగ్‌లు తొలి గోల్ అవకాశం సృష్టించారు. ఆ ప్రయత్నం విఫలమైనా.. సిమ్రన్‌జిత్ అందించిన పాస్‌తో 7వ నిమిషంలో యువ ఫార్వర్డ్ దిల్‌ప్రీత్ సింగ్ గోల్ కొట్టాడు. 1-0తో భారత్ ఆధిక్యంలో నిలిచినా.. గ్రేట్ బ్రిటన్ దూకుడుగానే ఆడింది. రెండో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఇన్సైడ్ సర్కిల్లో పాస్ అందుకున్న గుర్జంత్ సింగ్ మెరుపు గోల్‌తో గర్జించాడు. అలుపెరుగని ఎదురుదాడి చేసిన గ్రేట్ బ్రిటన్ గోల్ ప్రయత్నం మూడో క్వార్టర్లో ఫలించింది. 45వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శామ్యూల్ వార్డ్ గోల్‌గా మలిచాడు. నాలుగో క్వార్టర్ ఆఖర్లో ఆట ఉత్కంఠకు దారితీసింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్‌కు ఎల్లో కార్డ్ చూపగా.. బ్రిటన్ పెనాల్టీ కార్నర్ పొందింది. గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకోవటంతో భారత్ ఊపిరీ పీల్చుకుంది. 57వ నిమిషంలో హార్దిక్ సింగ్ అదరగొట్టాడు. బ్రిటన్ గోల్‌పోస్ట్‌పై మెరుపు దాడితో భారత్ ఆధిక్యాన్ని 3-1కు తీసుకెళ్లాడు. సమష్టి ప్రదర్శనతో అభిమానుల హృదయాలను హత్తుకునే విజయం సాధించిన భారత్ ఘన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో క్వార్టర్ఫైనల్లో స్పెయిన్‌పై 3-1తో బెల్జియం విజయం సాధించింది.