Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు ఒలింపిక్ మెడల్ సింధు వశం
- కాంస్య పోరులో చైనా షట్లర్‌పై విజయం
- నయా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం
ఒలింపిక్స్‌లో పతకం ప్రతి అథ్లెట్ చిరకాల స్వప్నం. కెరీర్లో ఒక్కసారైనా విశ్వ క్రీడల వేదికపై పతకం అందుకోవటం కోసం అథ్లెట్లు అహర్నిశలు చెమటోడ్చుతారు. అద్భుత ఆటకు తోడు ఒత్తిడిని జయించగలిగే సత్తా ఉంటే ఒలింపిక్స్‌లో పతక పోటీ ఇవ్వగలరు. అటువంటిది, ఒలింపిక్ వేదికపై వరుసగా రెండోసారి పతకం అందుకోవటం అసమాన ప్రదర్శనే అవుతుంది. భారత బ్యాడ్మింటన్ అగ్ర షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ఆ ఘనత సాధించింది. ఒలింపిక్స్‌లో రెండో పతకం సాధించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
చైనా షట్లర్ హీ బింగ్జియావ్తో కాంస్య పతక మ్యాచ్‌లో తెలుగు తేజం గర్జించింది. సెమీఫైనల్లో తైజు యింగ్ చేతిలో పరాజయం నుంచి గొప్పగా పుంజుకుంది. అగ్రశ్రేణి డ్రాగన్ షట్లర్‌ను వరుస గేముల్లోనే ఓడించింది. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ కాంస్యం ముద్దాడింది. రియో ఒలింపిక్స్‌లో సింధు సిల్వర్ మెడల్ సాధించింది. 'పతకం రంగు మారుస్తాననే' నమ్మకంతో టోక్యోలో అడుగుపెట్టిన సింధు కంచు స్మాష్‌తో భారతావనిని పులకింపజేసింది.
నవతెలంగాణ-టోక్యో
పి.వి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించగా.. తెలుగు తేజం 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో ఈ ఘనత సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో ఎనిమిదో సీడ్, చైనా క్రీడాకారిణి హీ బింగ్జియావ్పై ఆరో సీడ్ పి.వి సింధు ఘన విజయం సాధించింది. డ్రాగన్ షట్లర్‌ను వరుసగా రెండు గేముల్లో చిత్తు చేసిన సింధు.. భారత ఒలింపిక్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఏకపక్షంగా సాగిన కాంస్య పోరులో 21-13, 21-15తో పి.వి సింధు మెరుపు విజయం సాధించింది.
ఆద్యంతం దూకుడు : పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగి.. సెమీఫైనల్లో చేదు ఓటమిని జీర్జించుకుని కాంస్య పతక పోరుకు సింధు గొప్పగా సన్నద్దమైంది. ఎనిమిదో సీడ్ చైనా అమ్మాయి 9-6 ముఖాముఖి రికార్డుతో మానసికంగా కాస్త పైచేయి సాధించింది. గత రికార్డులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. సింధు కాంస్య పతక పోరులో భిన్నమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి గేమ్ నుంచే దూకుడుగా ఆడుతూ పాయింట్లు కొల్లగొట్టింది. చైనా షట్లర్‌కు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. లైన్ జడ్జిమెంట్‌లో మరింత తెలివిగా వ్యవహరించిన సింధు తొలి గేమ్ ఆరంభంలోనే 5-2తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. పాయింట్ల అంతరాన్ని హీ బింగ్జియావ్ వేగంగా పూడ్చుకుంది. సింధు లెఫ్ట్ సైడ్ ర్యాలీలతో ఆడిన హీ బింగ్జియావ్ వరుసగా నాలుగు పాయింట్లతో 6-5తో ముందంజ వేసింది. 8-6తో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన సింధు.. అటాకింగ్ ర్యాలీలతో చైనా షట్లర్‌పై పైచేయి సాధించింది. స్ట్రయిట్ స్మాష్‌తో 11-8తో విరామ సమయానికి మూడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలోనూ సింధు దూకుడు తగ్గలేదు. గేమ్‌ను పూర్తిగా తన నియంత్రణలోనే నిలుపుకుంది.
16-11తో దూసుకెళ్లిన సింధు..21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ద్వితీయార్థంలో హీ బింగ్జియావ్ పోరాట పటిమ చూపించినా.. సింధు విజృంభణ ముందు ఆమె ఆటలు సాగలేదు. రెండో గేమ్‌లోనూ సింధు ఏమాత్రం అలక్ష్యం చేయలేదు. ఆధిక్యం వదులుకునేందుకు ఎంత మాత్రం సిద్దంగా కనిపించలేదు. 5-2తో దూకుడు కొనసాగించిన సింధు.. చైనా షట్లర్‌పై ఒత్తిడి పెంచింది. సింధుతో నెట్ప్లేతో రేసులోకి వచ్చేందుకు హీ బింగ్జియావ్ గట్టి ప్రయత్నమే చేసింది. విరామ సమయానికి 11-8తో సింధు మరోసారి మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలో బింగ్జియావ్ వరుసగా మూడు పాయింట్లు సాధించింది. చురుకైన ర్యాలీలు, తెలివైన ప్లేస్‌మెంట్‌తో సింధు 15-11తో ముందంజలో నిలిచింది. లాంఛనాన్ని వేగంగా, దూకుడుగా ముగించిన సింధు 21-15తో రెండో గేమ్‌ను కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
చైనాకు స్వర్ణం : ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో చైనా హవా కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్‌లో పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్న డ్రాగన్.. మహిళల సింగిల్స్‌లోనూ స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ నం.1 తైజు యింగ్ (చైనీస్ తైపీ)పై వరల్డ్ నం.2 చెన్ యుఫెరు (చైనా) విజయం సాధించింది. మూడు గేముల ఉత్కంఠ పసిడి పోరులో 21-18, 19-21, 21-18తో చెన్ యుఫెరు స్వర్ణం గెలుచుకుంది. తైజు యింగ్ రజతంతో సరిపెట్టుకుంది. చెన్ యుఫెరు, తైజు యింగ్‌లకు ఇదే తొలి ఒలింపిక్ పతకం కావటం విశేషం.
అసమాన విజయం
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో పి.వి సింధు అసమాన విజయం సొంతం చేసుకుంది. అత్యున్నత స్థాయిలో సింధు పతకాలు సాధించటంలో చూపించిన నిలకడ.. అద్వితీయం. ఒలింపిక్స్‌లో రెండో పతకంతో చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌లోనే కాదు భారత క్రీడా రంగంలో దిగ్గజ అథ్లెట్‌గా నిలిచిపోనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్‌లో.. ఇలా ఆడిన ప్రతి మెగా ఈవెంట్లోనూ సింధు తనదైన ముద్ర వేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఓ పసిడి సహా ఐదు పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో వరుసగా రెండు పతకాలు సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు పతకాలు గెల్చుకుంది. విశ్వ క్రీడల్లో వరుసగా రజత, కాంస్య పతకాలను ముద్దాడింది.
అమ్మాయిల హవా
ఒలింపిక్స్‌లో భారత మహిళల జోరు కొనసాగుతోంది. విశ్వ క్రీడల్లో భారత్ సాధించిన చివరి ఐదు పతకాలు మహిళా అథ్లెట్లు సాధించటం విశేషం. రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సాక్షి మాలిక్, షట్లర్ పి.వి సింధులు భారత్‌కు పతకాలు అందించారు. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, షట్లర్ పి.వి సింధు, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ (పతకం ఖాయం. పసిడి, రజతం, కాంస్యంలో ఏదనేది తేలాల్సి ఉంది)లు భారత్‌కు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో వరుస ప్రభంజనాలతో అమ్మాయిలు భారత క్రీడా రంగ ముఖచిత్రంగా మారనున్నారు.
' ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచిన సింధుకు అభినందనలు. అద్వితీయ ప్రదర్శనకు సింధు ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. భారత్‌కు కీర్తి గడించిన సింధుకు శుభాకాంక్షలు'
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
'టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధుకు అభినందనలు. వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు.. భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆక్షాంక్షిస్తున్నాను'
- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
' సింధు నీ ప్రదర్శన పట్ల మేము గర్వంతో ఉప్పొంగిపోయాం. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించినందుకు అభినందనలు. సింధు దేశానికి గర్వకారణం. అత్యుత్తమ ఒలింపియన్'
- ప్రధాని నరెంద్ర మోడీ