Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి ఒలింపిక్ సెమీఫైనల్లో హాకీ అమ్మాయిలు
- క్వార్టర్ఫైనల్లో ఆస్ట్రేలియాపై 1-0తో ఘన విజయం
- టోక్యోలో చరిత్ర సృష్టించిన రాణి రాంపాల్ సేన
గ్రూప్ దశలో తొలి మూడు మ్యాచుల్లోనూ పరాజయం. హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన భారత మహిళల హాకీ జట్టు గ్రూప్ దశ దాటుతుందనే నమ్మకం పెద్దగా కనిపించలేదు. చివరి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన అమ్మాయిలు నాకౌట్ బెర్త్ దక్కించుకున్నారు.
కీలక క్వార్టర్ఫైనల్లో ప్రత్యర్థి బలమైన ఆస్ట్రేలియా. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్, వరల్డ్ నం.2 ఆస్ట్రేలియాను ఎదుర్కొవటం అంత సులువు కాదనే విషయం భారత్‌కు తెలుసు. అయినా, అమ్మాయిలు పోరాటం చాలించలేదు. సమిష్ట కృషిపై విశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఫలితమే.. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి భారత హాకీ మహిళల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
భారత హాకీ చరిత్రలో ఇది మరుపురాని మజిలి. తొలిసారి ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పూర్వ వైభవం దిశగా నిర్మాణాత్మక అడుగులు వేస్తోన్న హాకీ ఇండియా.. ఆ దిశగా టోక్యోలో విజయవంతమైనట్టే!!.
నవతెలంగాణ-టోక్యో
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఒలింపిక్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ప్రపంచ నం.2, మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత జట్టు 1-0తో ఘన విజయం సాధించింది. బలమైన కంగారూ జట్టును కంగుతినిపించి టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పోరు దిశగా అడుగులు వేస్తోంది. భారత్ కంటే ఎంతో మెరుగైన ఆస్ట్రేలియాతో క్వార్టర్స్ సమరంలో దూకుడు, డిఫెన్స్ మేళవింపుతో కూడిన వ్యూహంతో ఆడిన రాణి రాంపాల్ సేన.. స్వదేశం సంబురాలకు తెరతీసింది. బుధవారం జరుగనున్న సెమీఫైనల్లో వరల్డ్ నం.5 అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. మరో క్వార్టర్ఫైనల్లో జర్మనీపై అర్జెంటీనా 3-0తో విజయం సాధించి సెమీఫైనల్లోకి చేరుకుంది. భారత యువ డిఫెండర్ గుర్జిత్ కౌర్ ఆసీస్‌పై గెలుపు గోల్ అందించింది.
ఆహా.. ఏం ఆడారు!! : ఉప్పెనలా విరుచుకు పడలేదు. మెరుపులా విజృంభించలేదు. సునామీ ఏమీ సృష్టించలేదు. అయినా, భారత అమ్మాయిలు దేశం గర్వించదగిన చరిత్ర సృష్టించారు. బలమైన, మెరుగైన, ప్రమాదకర ఆస్ట్రేలియాను అమ్మాయిలు ఓడించిన తీరు అమోఘం. సహజంగానే బంతిని కంగారూ అమ్మాయిలు నియంత్రణలో నిలుపుకున్నారు. తొలి క్వార్టర్ ఆరంభంలోనే గోల్ ప్రయత్నం చేశారు. గోల్ కీపర్ సవిత ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది. కొద్దిసేపటికే భారత్ సైతం గోల్ కొట్టే అవకాశం ముంగిట నిలిచింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. 9వ నిమిషంలో వందన కటారియ అందించిన సూపర్ పాస్‌ను రాణి రాంపాల్ సర్కిల్ లోపల అందుకున్నప్పటికీ.. బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించలేకపోయింది. క్వార్టర్ చివర్లో ఆస్ట్రేలియా భారత సర్కిల్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సిద్ధమైంది. భారత డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు.
రెండో క్వార్టర్ ఆరంభంలో భారత్, ఆస్ట్రేలియాలు అమీతుమీ అన్నట్టు ఆడాయి. 21వ నిమిషంలో సర్కిల్‌లోకి చొచ్చుకొచ్చిన ఆస్ట్రేలియా.. పెనాల్టీ కార్నర్ అందుకుంది. ఆస్ట్రేలియా పెనాల్టీ ప్రయత్నాన్ని భారత డిఫెన్స్ విభాగం అద్భుతంగా నిలువరించింది. కొద్దిసేపటికే సర్కిల్‌లోకి చొచ్చుకెళ్లిన భారత్.. పెనాల్టీ కార్నర్‌ను గెల్చుకుంది. 22వ నిమిషంలో డిఫెండర్ గుర్జీత్ కౌర్ పెనాల్టీ కార్నర్‌ను చాకచక్యంగా ఆస్ట్రేలియా గోల్ పోస్ట్‌లోకి పంపించింది. భారత్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. గుర్జీత్ కౌర్ గోల్‌తో భారత డగౌట్ ఆనందంలో మునిగిపోయింది. 0-1 వెనుకంజలో నిలిచిన ఆస్ట్రేలియా అమ్మాయిలు.. ఆ తర్వాత మరింత దూకుడుగా భారత గోల్‌పోస్ట్‌పై దాడి చేశారు. ఆస్ట్రేలియన్ల ప్రతి గోల్ ప్రయత్నాన్ని గోల్ కీపర్ సవిత సారథ్యంలోని డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా అడ్డుకుంది. ఆట ప్రథమార్థం ముగిసే సమయానికి భారత్ 1-0తో ముందంజలో నిలిచింది.
చారిత్రక క్షణాలు! : ఓ గోల్‌తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఆ తర్వాత ప్రధానంగా డిఫెన్స్‌పైనే దృష్టి సారించింది. బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న ఆస్ట్రేలియా పదేపదే భారత సర్కిల్‌లోకి ప్రవేశించి గోల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆస్ట్రేలియాపై తిరిగి ఎదురుదాడి చేయడానికి బదులు.. సొంత కోటను రక్షించుకోవటంపైనే రాణి రాంపాల్ సేన ప్రాధాన్యత ఇచ్చింది. ఆ వ్యూహం గొప్ప విజయాన్ని కట్టబెట్టింది. పదే పదే పెనాల్టీ కార్నర్లు సాధించిన ఆస్ట్రేలియాకు ప్రతిసారీ గోల్‌పోస్ట్ ముందు నిరాశే ఎదురైంది. భారత డిఫెండర్లు గొప్ప ప్రదర్శనతో ఆసీస్ దూకుడు కళ్లెం వేశారు. ఆట ఆఖరు నిమిషాల్లో బంతిని నియంత్రణలోకి తీసుకున్న భారత అమ్మాయిలు.. సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నారు. మ్యాచ్ చివరి విజిల్ వినిపించగానే భారత శిబిరం సంబరాల్లో మునిగింది. చారిత్రక సెమీఫైనల్లోకి ప్రవేశించిన సందర్భాన్ని అమ్మాయిలు భావోద్వేగంతో సంబురాలు చేసుకున్నారు.
ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు పోటీపడటం ఇది మూడోసారి మాత్రమే. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో తొలిసారి భారత మహిళల జట్టు పోటీపడింది. గ్రూప్ దశలో ప్రదర్శన ఆధారంగా ఆ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సుదీర్ఘ విరామం అనంతరం 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. అక్కడ 12వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అమ్మాయిలు.. ఈసారి టోక్యోలో చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం అర్జెంటీనాను దాటేస్తే.. 'స్వర్ణ' యుగం అడుగు దూరంలోనే ఉండనుంది.
సవిత 'ది వాల్'
ఆస్ట్రేలియాతో క్వార్టర్‌ఫైనల్ పోరులో భారత మ్యాచ్ విన్నర్ గోల్‌కీపర్ సవిత. ఆస్ట్రేలియాపై గోల్స్ కొట్టడం ఎంత కష్టమో.. ఆసీస్ గోల్ ప్రయత్నాలను అడ్డుకోవటం రెట్టింపు కష్టం. తొలుత ఆధిక్యంలోకి వెళ్లిన భారత్.. ఇక ప్రధానంగా డిఫెన్స్‌పైనే దృష్టి నిలిపింది. భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా. ఆస్ట్రేలియాకు ఏకంగా 9 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఏకంగా 14 సార్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడి చేసిన ఆస్ట్రేలియాను సవిత నిలువరించింది. పెనాల్టీ కార్నర్లతో గోల్ ఆశించిన కంగారూలకు సవిత అడ్డుగోడగా నిలిచింది. డిఫెన్స్‌లో వంద శాతం సఫలీకృతమైన సవిత.. ఒంటిచేత్తో భారత్‌ను చారిత్రక సెమీఫైనల్లోకి తీసుకెళ్లింది.
శ్రమకు తగ్గ ఫలితం
పేరుకు జాతీయ క్రీడ. చరిత్ర ఎంతో ఘనం. ఒలింపిక్స్ హాకీలో ఎదురులేని రారాజు. అయితేనేం.. దశాబ్దాలుగా ఆ ప్రభ మసకబారింది. మెగా ఈవెంట్లలో కనీసం కాంస్యం దక్కినా సంతోషమే అనుకునే స్థితి నుంచి.. అగ్ర జట్లకు కనీస పోటీ ఇస్తే చాలనే దుస్థితికి చేరుకుంది. విజయాలతో పాటు అభిమానులకు క్రమంగా హాకీకి దూరమయ్యాయి. ఇక్కడే విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన హాకీ ఇండియా నవ శకానికి నాంది పలికింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలువగా.. గత నాలుగేండ్లలో భారత్ ప్రదర్శనలో గణనీయమైన మార్పు మొదలైంది. ఆ కృషి ఫలితమే తాజాగా టోక్యోలో ప్రతిబింబిస్తోంది. భారత ప్రజల హృదయాలను ఇప్పటికే గెల్చుకున్న అమ్మాయిలు.. ఇక స్వర్ణం కోసమే పోరాడాలి.
- మహిళల డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ కౌర్ ఆరో స్థానంలో నిలిచింది. ఫైనల్లో 63.70 మీటర్లతో భారత అథ్లెట్ మెరుగైన ప్రదర్శన చేసింది.
- మహిళల 200 మీ రేసులో ద్యుతీచంద్ హీట్స్ దశ దాటలేదు. 23.85 సెకండ్లతో ద్యుతీ హీట్4లో ఆఖరు స్థానంలో నిలిచింది.
- మెన్స్ 50మీ రైఫిల్ 3పొజిషన్ అర్హత రౌండ్లో ప్రతాప్ సింగ్ (1167) 21వ స్థానంలో, సంజీవ్ రాజ్‌పుత్ (1157) 32వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు.
టోక్యో పతకాల పట్టిక
దేశం ప ర కా మొత్తం
1 చైనా 29 17 16 62
2 అమెరికా 22 25 17 64
3 జపాన్ 17 6 10 33
4 ఆస్ట్రేలియా 14 4 15 33
62 భారత్ 0 1 1 02
గమనిక : పసిడి, రజతం, కాంస్యం