Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో పోరాడి ఓడిన హాకీ ఇండియా
- 5-2తో వరల్డ్ చాంప్ బెల్జియం గెలుపు
- కాంస్య పతక మ్యాచ్‌పై మన్‌ప్రీత్ సేన గురి
41 ఏండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన హాకీ ఇండియా మెన్స్ జట్టు.. పసిడి పోరుకు చేరుకోలేకపోయింది. సెమీఫైనల్లో వరల్డ్ చాంపియన్, అగ్ర జట్టు బెల్జియంతో అమీతుమీ పోరాడిన భారత్ 2-5తో పరాజయం పాలైంది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచిన బెల్జియం పసిడి పోరుకు చేరుకుంది. సెమీఫైనల్లో పరాజయం ఎదురైనా.. కాంస్య పతక పోరుతో మెడల్ వేటలో హాకీ ఇండియాకు మరో అవకాశం లభించనుంది.
నవతెలంగాణ-టోక్యో
2020 ఒలింపిక్స్‌లో భారత మెన్స్ హాకీ జట్టు ఇక కాంస్య పోరుకు సన్నద్ధం కానుంది. సోమవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ పోరులో వరల్డ్ చాంపియన్ బెల్జియం చేతిలో భారత్ పరాజయం పొందింది. 5-2తో గెలుపొందిన బెల్జియం వరుసగా రెండోసారి ఒలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి క్వార్టర్‌లోనే మన్దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు గోల్ కొట్టడంతో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్.. చివరి పది నిమిషాల వరకు బెల్జియంతో సమవుజ్జీగా నిలిచింది. బెల్జియం ఒలింపిక్స్ అరంగేట్ర ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ హ్యాట్రిక్ గోల్స్‌తో ఆ జట్టును ముందంజలో నిలిపాడు. సెమీఫైనల్లో ఆఖరు వరకూ పోరాట పటిమ చూపించిన భారత్ గురువారం జరుగున్న కాంస్య పతక పోరులో ఒలింపిక్ మెడల్ కోసం పోటీపడనుంది.
ఆరంభంలోనే బ్యాంగ్ : సెమీఫైనల్ సమరం. ప్రత్యర్థి వరల్డ్ చాంపియన్ బెల్జియం. అగ్రజట్టుతో ఇటీవల ముఖాముఖిలో మెరుగైన రికార్డు కలిగినా.. ఒలింపిక్ సెమీస్‌లో బెల్జియం అత్యంత ప్రమాదకారి. ఆ విషయం బెల్జియం ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే నిరూపించుకుంది. పెనాల్టీ కార్నర్‌ను డ్రాగ్‌ఫ్లికర్ లూపెర్టా గోల్‌గా మలిచాడు. 2వ నిమిషంలోనే బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బెల్జియం గోల్ కొట్టిన ఐదు నిమిషాల్లోనే భారత్ గోల్ ఖాతా తెరిచింది. 7వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను బెల్జియం డిఫెన్స్ కాచుకున్నా.. రెండో పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకోలేకపోయింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను బెల్జియం గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. స్కోరు 1-1తో సమం చేశాడు. బెల్జియంతో సమవుజ్జీగా నిలిచిన నిమిషంలోనే.. భారత్ ఏకంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెల్జియం సర్కిల్లో కాచుకున్న మన్దీప్ సింగ్ కండ్లుచెదిరే బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో మెరుపు గోల్ చేశాడు. సెమీఫైనల్లో నమోదైన తొలి ఫీల్డ్ గోల్ ఇదే. మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే క్వార్టర్లో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ సద్వినియోగం చేసుకోలేదు. బెల్జియం గోల్‌కీపర్‌కు నేరుగా కొట్టిన మన్‌ప్రీత్.. అవకాశాన్ని వృథా చేశాడు. అమిత్, నీలకంఠ శర్మలు గోల్‌పోస్ట్ దగ్గరకు చేరుకుని మరో ప్రయత్నం చేయబోయినా.. ఫలితం దక్కలేదు. తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 2-1తో బెల్జియంపై పైచేయి సాధించింది.
పుంజుకున్న బెల్జియం : రెండో క్వార్టర్లో బెల్జియం ప్రమాదకరంగా కనిపించింది. 17వ నిమిషంలో ఆ జట్టుకు ఏకంగా హ్యాట్రిక్ పెనాల్టీ కార్నర్లు లభించాయి. వరుస పెనాల్టీ కార్నర్లను భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, డిఫెండర్ అమిత్‌లు అడ్డుగోడలా నిలిచి అడ్డుకున్నారు. వరుసగా మూడు పెనాల్టీలను కాపాడుకుని భారత డిఫెన్స్ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. 19వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను బెల్జియం వృథా చేసుకోలేదు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఆ జట్టు ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ ఈసారి గోల్ కొట్టాడు. సురెందర్ కుమార్ కాలుకు బంతి తాకటంతో మరో పెనాల్టీ కార్నర్ పొందిన బెల్జియం.. గోల్ ప్రయత్నం చేసినా శ్రీజేష్ నిలువరించాడు. 29వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ సాధించిన భారత్ గోల్ కొట్టలేదు. హర్మన్‌ప్రీత్ సింగ్ మంచి ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఆట ప్రథమార్థం ముగిసే సమయానికి భారత్, బెల్జియం 2-2తో సమవుజ్జీలుగా నిలిచాయి.
భారత్ తడబాటు : మూడో క్వార్టర్లో సుమిత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా.. అది గోల్ కాలేదు. ఈ క్వార్టర్లో ఇరు జట్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీంతో మూడో క్వార్టర్ సైతం 2-2తో ముగిసింది. నిర్ణయాత్మక, ఉత్కంఠభరిత నాలుగో క్వార్టర్లో బెల్జియం దూకుడు ప్రదర్శించింది. బెల్జియం డ్రాగ్‌ఫ్లికర్ అలెగ్జాండర్ హెండ్రిక్స్ మరోసారి విజృంభిం చాడు. వరుసగా లభించిన మూడు పెనాల్టీ కార్నర్లలో రెండు విఫలమైనా.. మూడోసారి సఫలీకృతమయ్యాడు. 49వ నిమిషంలో అలెగ్జాండర్‌ను రెండు సార్లు పెనాల్టీ కార్నర్లో అడ్డుకున్న శ్రీజేష్, అమిత్‌లు.. మూడోసారి విఫలమయ్యారు. దీంతో సెమీస్‌లో రెండో గోల్ కొట్టిన అలెగ్జాండర్ బెల్జియంను 3-2తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 53వ నిమిషంలో అలెగ్జాండర్ చేసిన ఫీల్డ్ గోల్ ప్రయత్నాన్ని పసిగట్టిన శ్రీజేష్ లెఫ్ట్ గ్లోవ్తో అడ్డుకున్నాడు. 53వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను అలెగ్జాండర్ హెండ్రిక్స్ బ్యాంగ్‌బ్యాంగ్ చేశాడు. హెండ్రిక్స్ హిట్‌ను కుడి వైపు అంచనా వేసి డైవ్ చేసిన శ్రీజేష్ బంతిని నిలువరించలేకపోయాడు. దంతో అలెగ్జాండర్ సెమీఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట ఆఖరు నిమిషంలో జాన్ జాన్ డొహమెన్ మరో గోల్‌తో బెల్జియంను 5-2తో తిరుగులేని స్థానంలో నిలబెట్టాడు. చివరి పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ కోల్పోయిన భారత్ ఫైనల్లోకి చేరుకునే అవకాశం చేజార్చుకుంది.
- రెజ్లింగ్‌ను భారత్ నిరాశజనక ఫలితంతో ఆరంభించింది. మహిళల 62 కేజీల విభాగంలో సోనమ్ మాలిక్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మంగోలియా రెజ్లర్‌తో 2-2తో సమవుజ్జీగా నిలిచినా.. స్ప్లిట్ డిసిషన్ ఆడ్వాంటేజ్తో మంగోలియా అమ్మాయి ముందుకెళ్లింది. రెండు రౌండ్లలో సోనమ్ మాలిక్ 1, 1 పాయింట్లు సాధించగా.. రెండో రౌండ్ ఆఖరు క్షణాల్లో సోనమ్‌ను పిన్ చేసిన మంగోలియన్ క్వార్టర్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఆమె సైతం ఓటమిచెందగా రిపిచేజ్ ఆశలు సైతం ఆవిరయ్యాయి.
- మహిళల జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ అన్నూ రాణి ఫైనల్స్‌కు చేరుకోలేదు. అర్హత రౌండ్లో బల్లెంను 54.04 మీ విసిరిన రాణి 14వ స్థానంలో నిలిచింది.
- పురుషుల షాట్‌పుట్ అర్హత రౌండ్లో తజిందర్‌పాల్ తూర్ నిరాశపరిచాడు. అర్హత రౌండ్లో గుండును 19.99 మీ విసిరి 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.