Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలుపు ఆరంభంపై కోహ్లిసేన కన్ను
- భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు నేటి నుంచి
- మధ్యాహ్నాం 3.30 నుంచి సోనీనెట్వర్క్లో..
నవతెలంగాణ-నాటింగ్‌హామ్
సుమారు ఆరు వారాల విరామం అనంతరం కోహ్లిసేన మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం కోహ్లిసేన కొన్ని రోజుల విరామం తీసుకోగా.. రెండు వారాల ముందు నుంచి సాధన మొదలుపెట్టింది. పటౌడీ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్‌లు ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనున్నారు. నాటింగ్‌హామ్ వేదికగా తొలి టెస్టు నేటి నుంచి ఆరంభం కానుంది. పటౌడీ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్, భారత్‌లు ఒకే ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందాయి. రెండు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్, ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌లు న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. ఆతిథ్య జట్టుగా ఇంగ్లాండ్ సిరీస్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. వరల్డ్ నం.2 భారత్‌కు సైతం పటౌడీ ట్రోఫీపై సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2 ఈ సిరీస్ నుంచి షురూ కానుంది.
బ్యాటింగ్ సమస్య! : ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పరుగులు చేసేందుకు మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది కొత్త కాదు. భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పరుగుల వేటలో వెనుకంజలో ఉన్నాయి. ప్రాక్టీస్‌లో తల అదరటంతో మయాంక్ అగర్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. వార్మప్ మ్యాచ్‌లో శతకం సాధించిన కెఎల్ రాహల్ తోడుగా రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించే వీలుంది. టెస్టు నిపుణులు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ ఇద్దరి స్ట్రయిక్‌రేట్‌పై ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పుజారా, రహానెలు తొలి ఇన్నింగ్స్ నుంచే పరుగుల వేటకు సిద్ధం కానున్నారు. శతక దాహంతో ఉన్న కెప్టన్ విరాట్ కోహ్లి నాటింగ్‌హామ్‌లో ఆ లోటు పూడ్చుతాడేమో చూడాలి. రిషబ్ పంత్ సహజంగానే భారత జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్‌గా నిలువనున్నాడు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ నేడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా తుది జట్టులో నిలువనున్నాడు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రాలకు తోడు మహ్మద్ సిరాజ్ పేస్ విభాగంలో నిలిచే అవకాశం ఉంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలలో ఒకరే తుది జట్టులో నిలిచేందుకు ఆస్కారం కనిపిస్తోంది.
భారత్‌లో కోహ్లిసేన చేతిలో సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది. పదునైన పేస్, భీకర స్వింగ్ బౌలింగ్‌తో భారత్‌ను బెంబేలెత్తించేందుకు జోరూట్ సేన రంగం సిద్ధం చేసుకుంది. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు చెరో ఎండ్ నుంచి స్వింగ్ సవాల్ విసరనుండగా.. యువ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ తనదైన ముద్ర వేసేందుకు పటౌడీ సిరీస్‌ను వేదికగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. కెప్టెన్ జో రూట్, వికెట్ కీపర్ జోశ్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డామినిక్ సిబ్లే, జాక్ క్రావ్లీలు మంచి ఫామ్‌లో ఉన్నారు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కంగారూ గడ్డపై ఆస్ట్రేలియాను వరుస సిరీస్‌ల్లో మట్టికరిపించిన టీమ్ ఇండియా.. అదే స్ఫూర్తి ఇంగ్లాండ్ గడ్డపైనా చూపించాలనే తపనతో కనిపిస్తోంది.