Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లవ్లీనా ప్రస్థానం ఇదే!
టోక్యో : 23 ఏళ్ల భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్.. ఒలింపిక్స్ ముందు ఈ పేరు అంతగా ప్రాచుర్యంలో లేదు. అయితే, ఎలాంటి అంచనాలూ లేకుండా టోక్యో ఒలింపిక్స్ బరిలో దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన లవ్లీనా కాంస్య పతకం సాధించడంతో దేశం మొత్తం ఆమె పేరు మారుమోగుతోంది. కారణం.. విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్‌కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్ర సృష్టించడం ఒకటైతే.. అరంగేట్ర పోటీల్లోనే కాంస్య పతకాన్ని ముద్దాడిన బాక్సర్‌గా చరిత్రకెక్కడం మరొకటి. అంతేకాదు, 9 ఏండ్ల తర్వాత బాక్సింగ్‌లో భారత్‌కు పతకాన్ని అందించింది. ఇక, లవ్లీనా అసోంలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన క్రీడాకారిణి. కనీసం అక్కడ రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఆమె సెమీఫైనల్ చేరిన తర్వాతే.. ఆగమేఘాల మీద అక్కడ అధికారులు రోడ్డేశారు. గోలాఘాట్ జిల్లాలో అధికారులు చకచకా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు.
లవ్లీనా ఒలింపిక్స్‌లో ఆడటం ఇదే తొలిసారి. అయినా భయపడలేదు. అదిరిపోయే పంచులతో క్వార్టర్స్ వరకుచేరింది. క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్, చైనీస్ తైపీ బాక్సర్ నిన్-చిన్తో తలపడింది. దూకుడు ప్రదర్శించకుండా తెలివిగా పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థిని కట్టడి చేసింది. 4-1 స్కోరుతో ఘన విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే, సెమీస్‌లో స్వర్ణ పతక ఫేవరెట్ సుర్మనెలి (టర్కీ)తో పోరాడి ఓడింది. 0-5తో ఓటమి పాలైంది. అయినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెప్పించింది.
కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్‌కు..
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ!
1997 అక్టోబరు 2న గోలాఘాట్ జిల్లా బారో ముఖియా గ్రామంలో లవ్లీనా జన్మించింది. తండ్రి చిరు వ్యాపారి. ఆమె కంటే పెద్దవారైన ఇద్దరు కవల సోదరీమణులు కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అక్కలను చూసి తను కూడా కిక్ బాక్సింగ్‌ను ఎంచుకుంది. జిల్లా స్థాయిలో పలు పోటీల్లో పాల్గొంది. ఒకరోజు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శారు) ఆమె చదువుతున్న హైస్కూల్లో పోటీలు నిర్వహించింది. అందులో లవ్లీనా ప్రతిభను గుర్తించిన కోచ్ పదుమ్ బోరో ఆమెను కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్ వైపు తీసుకెళ్లారు. అలా 2012 నుంచి ఆమె బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. 2017లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో అరంగేట్రం చేసిన లవ్లీనా.. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్యం పతకాలు.. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది.
కరోనాను జయించి.. పతకాన్ని ముద్దాడి..!
2020 మార్చిలో జరిగిన ఆసియా అండ్ ఓషినియా బాక్సింగ్ ఒలింపిక్ అర్హత టోర్నమెంట్లో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బెర్తు ఖరారు చేసుకుంది. అదే సమయంలో లవ్లీనా తల్లి మమోనీ బొర్గోహెన్‌కు కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతో తల్లిని చూసేందుకు స్వస్థలానికి వెళ్లిన లవ్లీనాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒలింపిక్స్‌లో అర్హత సాధించిన 16 బాక్సర్లకు సారు కేటాయించిన 56 రోజుల యూరప్ శిక్షణ టూర్‌కు ఆమె వెళ్లలేకపోయింది. కరోనా సోకిన సమయంలో లవ్లీనా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. 'కొవిడ్ బారిన పడిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డా. సాధన చేసేందుకు కూడా నా ఆరోగ్యం సహకరించలేదు. అయినా నేను కుంగిపోలేదు. సానుకూల దక్పథంతో ఉన్నా. మెడిటేషన్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకున్నా. భవిష్యత్ అవకాశాలపై దష్టిపెట్టా' అంటూ ఒకానొక సమయంలో లవ్లీనా చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వేగంగా శిక్షణ మొదలుపెట్టింది.
ప్రముఖుల ప్రశంసలు
ఈమె స్ఫూర్తిదాయక పోరాటంపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'లవ్లీనా బొర్గొహెయిన్కు అభినందనలు. మీ కృషి, దృఢ సంకల్పంతో దేశం గర్వపడేలా చేశారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. కలల్ని సాకారం చేసుకోవాలనే ఆడపిల్లలకు మీ విజయం ప్రేరణనిస్తుంది... '
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
'ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనాకు నా అభినందనలు. ఆమె దేశం మొత్తం గర్వపడేలా చేశారు...'
- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'లవ్లీనా బొర్గొహెయిన్ అద్భుతంగా పోరాడావు. నీ విజయం ఎంతోమంది భారతీయులకు స్ఫూర్తినిస్తుంది. దేశానికి కాంస్య పతకం అందించినందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో దూసుకెళ్లాలి..'
- ప్రధాని నరేంద్ర మోదీ
'ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన అసోం బిడ్డకు నా అభినందనలు. అసోం చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. నీ అద్భుత విజయానికి దేశం మొత్తం గర్వపడుతున్నది...'
- అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ