Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసిడి పోరులో గొప్ప పోరాటం
- రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా రికార్డు
- రష్యా రెజ్లర్‌కు పసిడి పతకం
యువ రెజ్లర రవి కుమార్ దహియా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెండో రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. సుశీల్ కుమార్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించగా.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ పసిడి పోరులో గొప్పగా పోరాడి రజతం పట్టుకొచ్చాడు.
నవతెలంగాణ-టోక్యో
సినిమాను తలపించినా సెమీఫైనల్లో మరుపురాని విజయం సాధించి పసిడి పోరుకు చేరుకున్న రెజ్లర్ రవి కుమార్ దహియా.. బంగారు పతకం వేటలో గొప్ప పోరాట స్ఫూర్తి చూపించాడు. వరల్డ్ చాంపియన్ రష్యా రెజ్లర్ జాయూర్ యుగేవ్‌తో పసిడి పోరులో వెనుకంజ వేశాడు. 4-7తో బంగారు పతకాన్ని రష్యా రెజ్లర్‌కు కోల్పోయాడు. 2019 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లోనూ రవి కుమార్ దహియా.. రష్యా రెజ్లర్ చేతిలోనే పరాజయం పొందాడు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో చారిత్రక విజయం ముంగిట సైతం.. అతడు చేతిలో ఓటమి చెందాడు. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రెండో భారత రెజ్లర్‌గా రవి కుమార్ దహియా చరిత్ర సృష్టించాడు. సుశీల్ కుమార్ ఒక్కడే ఒలింపిక్స్‌లో భారత్‌కు గతంలో రెజ్లింగ్ రజత పతకం అందించాడు.
పట్టు పట్టినా..! : సమవుజ్జీల పసిడి పోరు ఆసక్తి రేపటంతో పాటు తీవ్ర ఉత్కంఠగా సాగింది. తొలి రౌండ్లో రష్యా రెజ్లర్ ఆరంభంలోనే ఆధిక్యం సాధించాడు. రెండు సార్లు రవి కుమార్ దహియాను మ్యాట్ బయటకు తోసేసిన జాయూర్ విలువైన రెండు పాయింట్లు సాధించాడు. 2-0తో ముందంజ వేశాడు. రష్యా రెజ్లర్‌ను ఎడమవైపు నుంచి పట్టుకున్న రవి కుమార్.. అతడిని పడేశాడు. ఈ ఒక్క పట్టుతో రెండు పాయింట్లు సాధించి 2-2తో సమవుజ్జీగా నిలిచాడు. రష్యా రెజ్లర్ ఆధిక్యంలోకి దూసుకెళ్లేందుకు ఎంతో సమయం తీసుకోలేదు. రెండో రౌండ్లోకి వెళ్లడానికి ముందే 4-2తో ముందంజ వేశాడు. రెండో రౌండ్లో సైతం భారత రెజ్లర్‌ను ఆశ్చర్యపరిచిన జాయూర్ 5-2తో ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. జాయూర్ యుగేవ్ డిఫెన్స్‌ను ఛేదించేందుకు రవి కుమార్ దహియా ఆఖరు క్షణం వరకు అలుపెరుగని ప్రయత్నం చేశాడు. 7-4తో పసిడి పోరులో వెనక్కి తగ్గిన రవి కుమార్ దహియా రజతం అందుకున్నాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అరుదైన ఘనత రష్యా రెజ్లర్ సొంతం చేసుకున్నాడు.
వినేశ్‌కు భంగపాటు : టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా ఓ మెడల్ ఆశించిన వినేశ్ ఫోగట్‌కు భంగపాటే ఎదురైంది. వరల్డ్ నం.1, టాప్ సీడ్‌గా మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ క్వార్టర్ఫైనల్లో ఓటమి చెందింది. బెలారస్ రెజ్లర్ 9-3 ఆధిక్యంతో పాటు వినేశ్ ఫోగట్‌ను ఫాల్ చేసేసింది. ఈమె సెమీఫైనల్లో ఓటమి చెందటంతో వినేశ్ ఫోగల్ రెపిచేజ్ ఆశలు సైతం ఆవిరయ్యాయి. పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్లో దీపక్ పూనియా నిష్క్రమించాడు. కాంస్య పతక పోరులో సాన్ మారినో రెజ్లర్ మైల్స్ ఆమినో చేతిలో 2-4తో పరాజయం పాలయ్యాడు.