Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీపై 5-4తో భారత్ ఘన విజయం
- ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం
- ముగిసిన 41 ఏండ్ల పతక నిరీక్షణ
హాకీ ఇండియాకు పునరుజ్జీవం. ఎక్కడైతే ఉనికి కోల్పోయారో.. అక్కడే పతకంతో మళ్లీ ప్రపంచ హాకీలో భారత్ పునరాగమనం చేసింది. టోక్యో ఒలింపిక్స్ హాకీ కాంస్య పతక పోరులో జర్మనీపై 5-4తో విజయం సాధించిన హాకీ ఇండియా.. స్వదేశంలో సంబురాలకు తెరలేపింది. ఒలింపిక్స్‌లో హాకీ ఇండియాకు పతకం కొత్త కాదు. ఒలింపిక్ హాకీని రారాజుగా ఏలిన చరిత్ర భారత్ సొంతం. పాలకు నిర్లక్ష్యం, నిధుల కొరత, వసతుల కల్పనలో అలసత్వం వెరసి ఒలింపిక్స్‌లో భారత్ గత 41 ఏండ్లలో ఒక్క హాకీ మెడల్ సాధించలేదు. హాకీ ఆటను పూర్వ వైభవం దిశగా నడిపించేందుకు ఇక ఎవరూ రారు, ఎవరూ లేరు అనుకున్న తరుణంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. హాకీ ఇండియా స్వర్ణ యుగం వైపు తిరిగి అడుగులు వేయడానికి అండదండలు అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఆటగాళ్ల కఠోర శ్రమ ఫలితమే టోక్యోలో హాకీ ఇండియా మెడలో కాంస్య హారం.
నవతెలంగాణ-టోక్యో
130 కోట్ల భారతీయుల పులకించిన వేళ. క్రీడాభిమానుల హృదయాల తడిసిన సమయం. హాకీ ఆటగాళ్లు ఎదురుచూసిన విజయం. ఇదే కదా, జాతీయ క్రీడ ఇన్నాండ్లూ వేచిచూసిన చారిత్రక ఘట్టం. చివరి క్షణాల్లో జర్మనీ పెనాల్టీ కార్నర్‌ను భారత్ డిఫెన్స్ అడ్డుకోవటంతో భావోద్వేగం బద్దలైంది. 41 ఏండ్ల విషాద విరామానానికి తెరదించుతూ హాకీ ఇండియా ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో పతకం ఒడిసిపట్టుకుంది. కాంస్య పతక పోరులో జర్మనీని 5-4తో ఓడించి టోక్యో ఒలింపిక్స్‌లో గెలుపు గర్జన చేసింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించటంతో స్వదేశంలో ప్రజలు, క్రీడాకారులు సంబరాల్లో మునిగిపోయారు. సిమ్రన్ జిత్ సింగ్ (17, 34వ నిమిషాలు), హార్దిక్ సింగ్ (27వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ నిమిషం), రూపిందర్ పాల్ సింగ్ (31వ నిమిషం)లు భారత్‌కు గోల్స్ కొట్టారు. తొలి రెండు క్వార్టర్లలో వెనుకంజ లేదా సమవుజ్జీగా నిలిచిన భారత్.. చివరి రెండు క్వార్టర్లలో స్పష్టమైన ఆధిక్యంతో దుమ్మురేపింది.
ఆరంభం జర్మనీదే! : కాంస్య పతక పోరులో జర్మనీ తొలి నిమిషం నుంచే దూకుడు ప్రదర్శించింది. గోల్స్ కొట్టడంలో జర్మనీ ఉద్దేశం స్పష్టమైంది. భారత ఇన్సైడ్ సర్కిల్లో వ్యూహాత్మకంగా ఆడిన జర్మనీ.. రెండో నిమిషంలోనే రెచ్చిపోయింది. టిమ్ నుంచి పాస్ అందుకున్న ఫ్లోరియన్ గోల్‌గా మలిచాడు. జర్మనీ 1-0తో ఆధిక్యం సాధించింది. స్కోరు సమం చేసే అవకాశం భారత్‌కు 7వ నిమిషంలోనే లభించింది. పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గురి తప్పాడు. పదో నిమిషంలో జర్మనీ డ్రాగ్‌ఫ్లికర్ మాట్స్ గోల్ ప్రయత్నాన్ని భారత గోల్‌కీపర్ శ్రీజేష్ గొప్పగా అడ్డుకున్నాడు. తొలి క్వార్టర్ (ప్రతి క్వార్టర్ 15 నిమిషాలు. మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్లు ఉంటాయి)ను జర్మనీ 1-0 ఆధిక్యంతో ముగించింది. 12, 15వ నిమిషాల్లో సైతం జర్మనీ గోల్ కోసం గట్టి ప్రయత్నమే చేసి విఫలమైంది.
సమం చేశారు : రెండో క్వార్టర్లో గోల్స్ వర్షం కురిసింది. ఇరు జట్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై విరుచుకుపడ్డాయి. నీలకంఠ శర్మ ఎదురుదాడి ముందుండి నడిపించగా.. 17వ నిమిషంలో అందిన పాస్‌ను సిమ్రన్‌జిత్ సింగ్ గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 1-1తో భారత్ స్కోరు సమం చేసింది. 24వ నిమిషంలో జర్మనీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. నీలకంఠ శర్మ మిడ్‌ఫీల్డ్‌లో బంతిని జర్మనీకి కోల్పోగా.. ప్రత్యర్థి మెరుపు దాడి చేసింది. క్రిస్టోఫర్ నుంచి పాస్ అందుకున్న నిక్లాస్ బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. ఇన్సైడ్ సర్కిల్లో భారత డిఫెండర్ సురేందర్ కుమార్ బంతిని జర్మనీకి కోల్పోయాడు. భారత్ తన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకుంది. బెనెడిక్ట్ గోల్ కొట్టి జర్మనీని 3-1తో ముందుకు తీసుకెళ్లాడు. 27వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ అందుకున్న భారత్.. గొప్పగా పుంజుకుంది. అనుభవజ్ఞుడైన రూపిందర్ పాల్ సింగ్ ఫ్లిక్ చేయగా.. సిమ్రన్‌జిత్ సింగ్ గోల్‌గా మలిచాడు. జర్మనీ ఆధిక్యం 3-2కు తగ్గటంతో భారత శిబిరంలో ఉత్సాహం వచ్చింది. 29వ నిమిషంలో మరో విలువైన పెనాల్టీ కార్నర్‌ను దక్కించుకున్న భారత్.. స్కోరు సమం చేసింది. హర్మన్‌ప్రీత్ సింగ్ బంతిని జర్మనీ గోల్‌పోస్ట్‌లోకి పంపించి భారత్‌ను 3-3తో రేసులోకి తీసుకొచ్చాడు.
దుమ్మురేపారు : పది నిమిషాల విరామం అనంతరం మన్‌ప్రీత్ సింగ్సేన మనోధైర్యంతో మైదానంలోకి వచ్చింది. వచ్చీ రాగానే 31వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌తో గోల్ కొట్టింది. మ్యాచ్‌లో తొలిసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జర్మనీ రిఫరల్ కోల్పోవటంతో, పెనాల్టీ స్ట్రోక్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచాడు. భారత్ 4-3తో ముందంజ వేసింది. 34వ నిమిషంలో భారత్ మరో గోల్ కొట్టింది. కౌంటర్ ఎటాక్‌తో దూసుకెళ్లిన హర్మన్‌ప్రీత్ సింగ్.. సుదీర్ఘ స్కూప్ పాస్‌ను గుర్జంత్ సింగ్‌కు అందించాడు. జర్మనీ ఇన్సైడ్ సర్కిల్లో పాస్‌ను సిమ్రన్‌జిత్‌కు అందించగా.. అతడు గోల్‌గా మలిచాడు. ఈ గోల్ 2016 భారత జూనియర్ వరల్డ్‌కప్‌ను గుర్తు చేసింది. ఆ వరల్డ్‌కప్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, సిమ్రన్‌జిత్ సింగ్ త్రయం భారత్‌కు అద్భుతాలు చేసింది. మూడో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్లతో ఆధిక్యం కోసం జర్మనీ ప్రయత్నించినా.. బలమైన డిఫెన్స్‌తో భారత్ 5-3తో ఆధిక్యం కొనసాగించింది.
ఆఖర్లో అదుర్స్ : చివరి క్వార్టర్లో పదిహేను నిమిషాల ఆట ఉత్కంఠగా సాగింది. 48వ నిమిషంలో జర్మనీ పెనాల్టీ కార్నర్‌తో గోల్ కొట్టింది. వైండ్ఫెడర్ జర్మనీకి గోల్ అందించి అంతరాన్ని 4-5కు తగ్గించాడు. ఆఖరు ఐదు నిమిషాల్లో జర్మనీ గోల్ కోసం విశ్వ ప్రయత్నం చేసింది. చివరి పది సెకండ్ల ఆట మిగిలి ఉండగా జర్మనీకి పెనాల్టీ కార్నర్ దక్కటంతో ఉత్కంఠ నెలకొంది. గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, అమిత్‌లు చాకచక్యంగా పెనాల్టీ కార్నర్‌ను నిలువరించారు. 5-4తో జర్మనీని జయించిన భారత్ 2020 ఒలింపిక్స్ కాంస్య పతకం సాధించింది.
గోడ కట్టారు : జర్మనీతో మ్యాచ్‌లో భారత డిఫెన్స్ గొప్ప ప్రదర్శన చేసింది. ఆరంభంలో గోల్స్ కోల్పోయినా.. చివరి రెండు క్వార్టర్లలో అద్వితీయంగా రాణించింది. జర్మనీ దూకుడు ప్రమాదకరంగా మారినా.. గోల్‌కీపర్ శ్రీజేష్ గోడ కట్టాడు. ఆ జట్టు 24 సార్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. 13సార్లు పెనాల్టీ కార్నర్లు గెల్చుకున్న జర్మనీని 12 సార్లు శ్రీజేష్ అడ్డుకున్నాడు. 11 ఫీల్డ్ గోల్స్ ప్రయత్నాల్లో 9 విఫలమయ్యాయి. ఇదే సమయంలో భారత్ 11 సార్లు మాత్రమే గోల్ ప్రయత్నాలు చేసింది. అందులో ఏకంగా ఐదుసార్లు విజయవంతమైంది. ఆరు పెనాల్టీ కార్నర్లలో రెండు మాత్రమే గోల్స్ నమోదు కాగా.. ఓ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా కొట్టారు. నాలుగు ఫీల్డ్ గోల్ ప్రయత్నాల్లో రెండుసార్లు విజయవంతం అయ్యారు.