Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 ఏండ్ల తర్వాత పూర్వ వైభవం
- టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియాకు కాంస్యం
- రెజ్లర్ రవి కుమార్‌కు రజతం
- హాకీ విజయంతో దేశవ్యాప్తంగా సంబురాలు
130 కోట్ల భారతావనీ ఎదురుచూసిన క్షణం. 41 ఏండ్లుగా ఎప్పుడెప్పుడా అని నిరీక్షించిన సన్నివేశం. జాతీయ క్రీడకు గత వైభవం దిశగా అడుగు పడే సందర్భం రానే వచ్చింది. భారత హాకీి టోక్యో ఒలింపిక్స్‌లో తిరిగి ప్రాణం పోసుకుంది. కాంస్య పతక పోరులో జర్మనీని 5-4తో జయించిన భారత మెన్స్ హాకీజట్టు 2020 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో చివరగా స్వర్ణం సాధించిన హాకీ ఇండియా.. మరో మెడల్ కోసం 41ఏండ్లు నిరీక్షించింది. కాంస్య పోరు చివరి పదిసెకండ్లలో జర్మనీకి పెనాల్టీకార్నర్ లభించగా ఉత్కంఠ రేగింది. భారత డిఫెన్స్ అడ్డుగోడలా నిలిచి జాతీయ క్రీడకు కాంస్యతో పునరుజ్జీవం తీసుకొచ్చింది. టోక్యోలో గురువారం రెండు పతకాలు సాధించింది. హాకీ ఇండియా కాంస్య పతకం సాధించగా.. యువ రెజ్లర్ రవికుమార్ దహియా రజత పట్టుతో మెరిశాడు. దిగ్గజం సుశీల్ కుమార్ అనంతరం ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రెండో రెజ్లర్‌గా రవి కుమార్ చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు రెండు పతకాలు రావటంతో భారత్‌లో క్రీడాభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. హాకీలో కాంస్య విజయం దక్కగానే ప్రధాని నరెంద్ర మోడీ మన్‌ప్రీత్ సేనకు ఫోన్ చేసి అభినందించారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన హాకీ జట్టుకు, రజతం సాధించిన రవి కుమార్ దహియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. 'ఒలింపిక్ హాకీలో అత్యధిక పతకాలు సాధించిన (8 స్వర్ణాలు, ఓ రజతం, మూడు కాంస్యాలు) జట్టుగా భారత్ నిలిచింది. విలువైన వారసత్వాన్ని కొనసాగిస్తున్న భారత మెన్స్, ఉమెన్స్ హాకీ జట్లకు వందనం. భారత్‌కు మరో రజతం సాధించిన రవి కుమార్‌కు శుభాకాంక్షలు' అని సీపీఐ(ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.