Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ కాంస్య పతక పోరులో భారత్ ఓటమి
- చివరి క్షణం వరకూ పోరాడిన అమ్మాయిలు
- 4-3తో కాంస్య పతకం గ్రేట్ బ్రిటన్ వశం
కల చెదిరింది. పతక స్వప్నం ఛిద్రమైంది. కాంస్య పతక పోరులో హాకీ ఇండియా అమ్మాయిలు పోరాడి ఓడారు. రియో ఒలింపిక్స్ పసిడి విజేత గ్రేట్ బ్రిటన్‌తో ఆఖరు క్షణం వరకూ పోరాడిన అమ్మాయిలు 3-4తో కాంస్య పతకం కోల్పోయారు. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్స్‌కు చేరుకున్న అమ్మాయిలు.. 1980 తర్వాత తొలిసారి నాలుగో స్థానం సాధించారు.
వెలకట్టలేని త్యాగాలు, కొలమానం లేని కఠోర శ్రమ, అలుపెరుగని ప్రయత్నం.. భారత మహిళల హాకీ జట్టును అభిమానుల హృదయాల్లో విజేతగా నిలిపాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గలేకపోయినా.. జాతీయ క్రీడకు తిరిగి వన్నె తీసుకురావటంలో రాణి రాంపాల్ సేన గొప్ప విజయమే సాధించింది. కాంస్య పతక పోరులో అమ్మాయిలు ఓడినా.. టోక్యోలో ఆట నిజంగా బంగారమే!
నవతెలంగాణ-టోక్యో
కాంస్య పతక పోరాటంలో అమ్మాయిలు వీరోచిత పరాక్రమ పటిమ చూపించారు. రియో ఒలింపిక్స్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్ ఆరంభంలోనే ఆధిక్యంతో మ్యాచ్ పట్టు బిగించినా.. నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా మూడు గోల్స్‌తో విశ్వరూపం ప్రదర్శించారు. ప్రథమార్థం ముగిసేసరికి ఆధిక్యంలో నిలిచిన రాణిరాంపాల్ సేన.. చివరి రెండు క్వార్టర్లలో రెండు గోల్స్‌తో పాటు కాంస్య పతకం కోల్పోయారు. ఫలితంగా, శుక్రవారం ఓఐ హాకీ స్టేడియంలో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 3-4తో గ్రేట్ బ్రిటన్ చేతిలో పరాజయం పొందింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో లీగ్ దశ ప్రదర్శన ఆధారంగా నాలుగో స్థానంలో నిలిచిన భారత్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుని నయా చరిత్ర సృష్టించింది. కాంస్య పతక పోరులో పోరాడి ఓడి.. ఒలింపిక్స్‌లో నాలుగో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (25, 26వ నిమిషాలు), వందన కతరియ (29వ నిమిషం) గోల్స్ కొట్టారు. పసిడి పోరులో అర్జెంటీనాపై 3-1తో గెలుపొందిన నెదర్లాండ్స్ హాకీ స్వర్ణం సొంతం చేసుకుంది. అర్జెంటీనా రజతం సాధించగా.. గ్రేట్ బ్రిటన్ కాంస్యం సొంతం చేసుకుంది.
ఆరంభం బ్రిటన్‌దే! : రియో చాంపియన్ గ్రేట్ బ్రిటన్ సహజంగానే కాంస్య పతక పోరును దూకుడుగా ఆరంభించింది. ఆట మొదలైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను దక్కించుకున్న బ్రిటన్.. గోల్ పోస్ట్‌పై దాడి చేసింది. భారత గోల్‌కీపర్ సవిత ఆ ప్రయత్నాన్ని గొప్పగా నిలువరించింది. ఆరో నిమిషంలో గోల్ చేసే అవకాశం దక్కినా.. కార్యరూపం దాల్చలేదు. నవనీత్ కౌర్ బంతిని రాణి రాంపాల్‌కు పాస్ చేయగా.. గోల్ పోస్ట్‌లోకి పంపేందుకు ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. బ్రిటన్ అమ్మాయిలు ప్రమాదకరంగా గోల్ ప్రయత్నాలు చేస్తున్నా, భారత డిఫెన్స్ ధైర్యంగా నిలబడింది. పదో నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ పొందిన బ్రిటన్ మరోసారి సవిత ముందు తలొగ్గింది. తొలి క్వార్టర్ ఆఖర్లో రెండుసార్లు గోల్ ప్రయత్నం చేసిన బ్రిటన్.. సవిత అడ్డుగోడతో నిష్క్రమించారు. రెండో క్వార్టర్ తొలి నిమిషంలోనే బ్రిటన్ గోల్ కొట్టింది. ఎలెనా సియాన్ రేయర్ 16వ నిమిషంలో సర్కిల్‌లోకి ప్రవేశించి క్రాస్ షాట్ కొట్టింది. గోల్ పోస్ట్ ముందున్న దీప్ గ్రేస్ బంతిని బయటకు పంపబోయి.. పొరపాటున గోల్‌పోస్ట్‌లోకి నెట్టింది. దీంతో భారత్ తొలి గోల్‌ను కోల్పోయింది. లాల్రెమ్సియామి 20వ నిమిషంలో రివర్స్ షాట్‌తో గోల్ కొట్టబోయినా..బ్రిటన్ డిఫెండర్ అడ్డుకుంది. 24వ నిమిషంలో బంతిని ఇన్సైడ్ సర్కిల్లో అందుకున్న సారా రాబర్ట్సన్ మెరుపు షాట్‌తో గోల్ కొట్టింది. దీంతో గ్రేట్ బ్రిటన్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ బ్యాంగ్ బ్యాంగ్ : రెండో క్వార్టర్ ఆఖర్లో భారత్ రెచ్చిపోయింది. రెండు గోల్స్ వెనుకంజలో నిలిచిన ఒత్తిడిలో మూడు గోల్స్ కొట్టి దుమ్మురేపింది. 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జిత్ కౌర్ డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌గా మలిచింది. తరావ్తఇ నిమిషంలోనే మరో డ్రాగ్ ఫ్లిక్‌తో గుర్జిత్ కౌర్ రెండో గోల్ కొట్టి స్కోరు సమం చేసింది. 29వ నిమిషంలో భారత స్టార్ ఫార్వర్డ్ వందన కతరియ సూపర్ గోల్‌తో భారత్‌ను 3-2తో ఆధిక్యంలో నిలిపింది. ఆట ప్రథమార్థం ముగిసే సరికి భారత్ ముందంజలో కొనసాగింది.
ఒత్తిడికి తలొగ్గారు! : ద్వితీయార్థంలో అమ్మాయిలు ఒత్తిడికి తలొగ్గారు. మూడో క్వార్టర్లో మూడో నిమిషంలోనే బ్రిటన్ పెనాల్టీ కార్నర్ పొందినా.. భారత్ నిలువరించింది. 35వ నిమిషంలో క్రాస్ పాస్ అందుకున్న బ్రిటన్ కెప్టెన్ హౌలీ వెబ్ స్కోరు 3-3తో సమం చేసింది. షర్మిలా దేవి పెనాల్టీ కార్నర్ పొందగా. గుర్జిత్ కౌర్ మరో మెరుపు డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌పై గురిపెట్టింది. కానీ బ్రిటన్ గోల్‌కీపర్ అడ్డుకుంది. చివరి క్వార్టర్లో బ్రిటన్ గోల్ కోసం అన్ని శక్తులు ప్రయోగించింది. వరుసగా మూడు పెనాల్టీ కార్నర్లు సాధించిన బ్రిటన్.. అందులో ఓసారి గోల్ కొట్టారు. దీంతో 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బ్రిటన్.. భారత్ దాడిని కాచుకుంది. ఆట ఆఖరు నిమిషాల్లో బ్రిటన్ ఇన్సైడ్ సర్కిల్లో గోల్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరి వరకు గొప్పగా పోరాడిన అమ్మాయిలు 3-4తో కాంస్య పతకం కోల్పోయారు.
కాంస్య పతక పోరులో భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేశారనే చెప్పాలి. ఆరంభంలో వెనుకంజలో నిలిచినా.. గొప్పగా పుంజుకున్నారు. చివర్లోనూ స్కోరు సమం చేసేందుకు పట్టుదలగా ప్రయత్నించారు. పటిష్ట బ్రిటన్ ఎటాకింగ్‌ను సమర్థవంతంగా ఎదురించారు. బ్రిటన్ అమ్మాయిలు 19 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా.. నాలుగుసార్లు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక్కటే గోల్‌గా మలిచారు. మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టి ముందంజ వేశారు. మరోవైపు భారత్ 11 సార్లు గోల్ ప్రయత్నాలు చేసింది. వందన ఫీల్డ్ గోల్‌తో మెరువగా.. గుర్జిత్ సింగ్ పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. భారత గోల్‌కీపర్ సవిత డిఫెన్స్‌లో మరుపురాని ప్రదర్శన చేసింది.