Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కజకిస్థాన్ రెజ్లర్‌పై ఏకపక్ష విజయం
నవతెలంగాణ-టోక్యో : రెజ్లింగ్ సూపర్‌స్టార్ బజరంగ్ పూనియా ఒలింపిక్స్ పతకం పట్టేశాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం కాంస్య పతక పోరులో టాప్ సీడ్ బజరంగ్ పూనియా ఉడుంపట్టుతో అదరగొట్టాడు. 8-0తో కజకిస్థాన్ రెజ్లర్‌పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా రజతం సాధించగా, బజరంగ్ కాంస్యంతో మెరిశాడు. 2012 ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు రెజ్లింగ్‌లో రెండు పతకాలు సాధించగా.. టోక్యోలో ఆ ఘనతను రవి దహియా, బజరంగ్ పూనియాలు పునరావృతం చేశారు.
కాంస్య పతక పోరులో వరల్డ్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ డాలెట్ నియబెకోవ్ (కజకిస్థాన్)పై ఆరంభం నుంచీ ఆధిపత్యం కనబరిచాడు. తొలి నిమిషంలో పూనియాపై ఎటాకింగ్ చేయలేకపోయాడు. దీంతో ఓ పాయింట్‌ను కోల్పోయాడు. డాలెట్ను మ్యాట్ పైనుంచి తోసేసిన పూనియా మరో పాయింట్ సాధించాడు. తొలి రౌండ్‌ను 2-0తో ముగించాడు. రెండో రౌండ్లో పూనియా ప్రతాపం చూపించాడు. ఏకంగా మూడుసార్లు ప్రత్యర్థిని టేక్‌డౌన్ చేశాడు. 8-0తో కాంస్య పతక పోరును ముగించాడు. కజకిస్థాన్ రెజ్లర్ ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాడు. ఇదిలా ఉండగా గోల్ఫర్ ఆదితి అశోక్ తృటిలో పతకం చేజార్చుకుంది. నిలకడగా టాప్-3లో కొనసాగిన ఆదితి.. శనివారం నాటి ఫైనల్ రౌండ్లో నాలుగో స్థానానికి పరిమితమైంది. అమెరికా, జపాన్, న్యూజిలాండ్ రెజ్లర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. రియోలో జిమ్నాస్ట్ దీప అద్భుత ప్రదర్శనతో నాలుగోస్థానంలో నిలువగా.. టోక్యోలో ఆదితి అదే తరహాలో పతకం చేజార్చుకుంది.