Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ చరిత్రలోనే తొట్టతొలి ఒలింపిక్ అథ్లెటిక్ పసిడి పతకాన్ని అందించి రికార్డు నెలకొల్పిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా క్రీడా ప్రస్థానం అత్యంత ఆశ్చర్యకరం. పానిపట్‌కు సమీపంలోని కంద్రా గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నీరజ్ చోప్రా.. అత్యంత గారాబంగా పెరిగాడు. ఉమ్మడి కుటుంబంలో తొలి సంతానం కావటంతో ఇంటి పని, పొలం పని ఏదీ చెప్పేవారు కాదు. భోజన ప్రియుడైన నీరజ్ చోప్రా చిన్నత నంలో భారీకాయుడు. ఓ రోజు పాఠశాలలో తోటి స్నేహితులు 'సర్పంచ్ ఆగయా' అని తెల్ల పైజామా వేసుకున్న నీరజ్ చోప్రాను చూసి అన్నారు. కన్నీంటి పర్యంతమవుతూ ఇంటికి చేరుకున్న నీరజ్ చోప్రాను ఆయన తండ్రి జిమ్‌లో చేర్పించారు. అధిక బరువు తగ్గించుకునేందుకు జిమ్‌లోకి ప్రవేశించిన నీరజ్ చోప్రా నెమ్మదిగా జావెలిన్ త్రోపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా ఫిట్నెస్ కోసం మైదానం ఒంక చూసిన చోప్రా.. నేడు భారత దేశం గర్వించదగిన అథ్లెట్‌గా రూపుదిద్దుకున్నాడు.
అంత సులువుగా రాలేదు : నీరజ్ చోప్రా క్రీడా ప్రయాణం పూల పాన్పు కాదు. 2016 జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన చోప్రా.. వరల్డ్ రికార్డుతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. భుజం గాయంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. 2017 ప్రపంచ చాంపి యన్షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించటంలో విఫలమయ్యాడు. 2019లో భుజం గాయానికి శస్త్రచికిత్స అనంతరం ఆ ఏడాది దోహా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు.
గాయం నుంచి కోలుకుని సాధన వైపు దృష్టి మళ్లించిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్ మెడల్ లక్ష్యంగా సాగాడు. టోక్యోకు ముందు విదేశాల్లో కఠోర సాధన చేశాడు. బరిలో తనకంటే మెరుగైన, జర్మనీ దిగ్గజం నిలిచినా ఏమాత్రం ఒత్తిడి కనిపించకుండా అసమాన ప్రదర్శన చేశాడు. అర్హత రౌండ్ నుంచి అంతిమ రౌండ్ వరకు అగ్రస్థానంలోనే కొనసాగాడు. స్వతంత్య్ర భారతావనీ ఒలింపిక్స్‌లో ఎటువంటి చాంపియన్‌ను చూడాలని తపించిందో అటువంటి ప్రదర్శనతోనే జావెలిన్ త్రో పసిడి పతకం పట్టుకొచ్చాడు. భారత క్రీడా రంగ చరిత్రలో చిరస్మరణీయ దిగ్గజంగా నిలిచిపోనున్నాడు.