Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా
- 125 ఏండ్ల నిరీక్షణకు తెరదించిన బల్లెం వీరుడు
- టోక్యోలో తొలిసారి జనగణమన భావోద్వేగం
- నయా చరిత్ర సృష్టించిన యువ అథ్లెట్
1960 రోమ్ ఒలింపిక్స్. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌పై బోలెడన్ని ఆశలు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి పతకం సాధిస్తాడనే అంచనాలు. రేసు ఆరంభం నుంచీ పతక ఆశలు నిలిపిన మిల్కాసింగ్.. ఆఖర్లో తడబడ్డాడు. నాలుగో స్థానంలో నిలిచి భారత అథ్లెటిక్ మెడల్ కలను కలగానే మిగిల్చాడు.
1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్. ఆసియా రికార్డుతో ఒలింపిక్ పతక ఆశలు రేపింది పీటీ ఉష. 400 మీటర్ల హార్డిల్స్‌లో పతకం అందుకునేందుకు అసమాన ప్రదర్శన చేసినా.. పరుగు రాణి సైతం నాలుగో స్థానంలోనే నిలువటంతో మరోసారి భారత్ స్వప్నం చెదిరింది.
2020 టోక్యో ఒలింపిక్స్. 2016 జూనియర్ వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రాపై పతక ఆశలు. జావెలెన్ త్రో జర్మనీ దిగ్గజం అద్వితీయ ఫామ్‌తో పసిడి రేసులో ముందున్నాడు. బల్లెం అందుకుని విసిరేందుకు అందరూ ఒత్తిడికి లోనై, ఆందోళనగా కనిపించిన వేళ నీరజ్ చోప్రా నమ్మశక్యం కాని ప్రదర్శన చేశాడు. బల్లెంను 87.58 మీటర్ల దూరం విసిరి 130 కోట్ల భారతీయుల వందేండ్ల స్వప్నం సాకారం చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ పసిడి పతకం అందించాడు.
'నమ్మశక్యంగా అనిపించటం లేదు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలిసారి పసిడి పతకం వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత్‌కు ఇది రెండో బంగారు పతకం మాత్రమే. అర్హత రౌండ్లో చాలా బాగా విసిరాను. ఫైనల్లో ఇంకా మెరుగ్గా విసరగలనని నాకు తెలుసు. కానీ పసిడి ప్రదర్శనను ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఉంది. నాకు, దేశానికి ఇది ఎంతగానో గర్వించదగిన ప్రదర్శన. మిల్కాసింగ్‌కు ఈ పసిడి పతకాన్ని అంకితం ఇస్తున్నా'
- నీరజ్ చోప్రా
నవతెలంగాణ-టోక్యో
నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. భారత ప్రజల వందేండ్ల స్వప్నాన్ని సాకారం చేశాడు. అసమాన ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్ల దూరం బల్లెంను విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకం తీసుకొచ్చాడు. తొలి రెండు ప్రయత్నాల్లోనే విశ్వరూపం ప్రదర్శించిన నీరజ్ చోప్రా.. రెండోసారి విసిరిన దూరానికి బంగారు పతకం అందుకున్నాడు. దిగ్గజ అథ్లెట్లు మిల్కాసింగ్, పీటీ ఉషలు ఒలింపిక్ అథ్లెటిక్స్ మెడల్‌ను తృటిలో చేజార్చుకోగా.. 23 ఏండ్ల యువ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యంతో పసిడి పతకం ముద్దాడాడు. 1896లో ఒలింపిక్స్ ఆరంభం కాగా.. ఆంగ్లో ఇండియన్ నార్మన్ రెండు రజత పతకాలు సాధించాడు. నార్మన్ అనంతరం అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో ఒలింపిక్ మెడల్ రాలేదు. స్వాతంత్య్రం అనంతరం భారత్ సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్ సైతం ఇదే కావటం విశేషం.
చాంపియన్‌లా విసిరాడు : జావెలిన్ త్రోలో నీరజ్ చొప్రా పతక పోటీదారుగానే టోక్యోకు చేరుకున్నాడు. ఈ సీజన్లో 90 ప్లస్ మీటర్లకు పైగా బల్లెంను విసిరిన జర్మనీ అథ్లెట్ వెట్టర్ గోల్డ్ మెడల్ రేసులో ముందంజలో ఉన్నాడు. నిజానికి జర్మనీ అథ్లెట్‌కు స్వర్ణం లాంఛనం అనుకోగా.. రజత, కాంస్యం కోసం నీరజ్ చోప్రా సహా ఇతర ప్రధాన పోటీదారులు రేసులో ఉన్నారు. అర్హత రౌండ్లో తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరంతో నీరజ్ చోప్రా అదరగొట్టాడు. ఫైనల్స్‌కు చేరుకునేందుకు అవసరమైన దూరం తొలి ప్రయత్నంలోనే సాధించటంతో మరో ప్రయత్నం చేయలేదు. శనివారం నాటి జావెలిన్ త్రో ఫైనల్స్‌కు ముందు నీరజ్ చోప్రా టోక్యోలో ఒకేసారి బల్లెంను విసిరాడు. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్‌లోనూ నిలకడగా 85 మీటర్లకు పైగా విసిరాడు. దీంతో నీరజ్ చోప్రాకు పతకం ఖాయమనే విశ్వాసం పెరిగింది.
పతక పోటీకి ఆశ్చర్యకరంగా జర్మనీ అథ్లెట్ అర్హత సాధించలేదు. మెడల్ రేసుకు ఎనిమిది మందిని తీసుకోగా.. జొహనస్ వెట్టర్ తొమ్మిదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. వెట్టర్ అత్యుత్తమం 97.76 కాగా, నీరజ్ చోప్రా బెస్ట్ 88.07 మీటర్లు. తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లతో పతకం దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న నీరజ్ చోప్రా ఏమాత్రం ఒత్తిడి లేకుండా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో 87.58తో బంగారు బల్లెంను విసిరిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఒలింపిక్ చాంపియన్‌గా అవతరించాడు. మూడో ప్రయత్నంలో 76.79 మీ, ఆరో ప్రయత్నంలో 84.24 మీ విసిరిన చోప్రా.. అప్పటికే పతకం పతకం లాంఛనం చేసుకున్నాడు. చెక్ రిపబ్లిక్ అథ్లెట్లు జాకుబ్ (86.67 మీటర్లు), వెస్లీ (85.44 మీటర్లు)లు రజత, కాంస్య పతకాలు సాధించారు.
టోక్యో పతకాల పట్టిక
దేశం ప ర కా మొత్తం
1 చైనా 38 31 18 87
2 అమెరికా 36 39 33 108
3 జపాన్ 27 12 17 56
4 రష్యా 20 26 23 69
47 భారత్ 1 2 4 07
గమనిక : పసిడి, రజతం, కాంస్యం