Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యోలో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
- ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి అథ్లెటిక్ పసిడి
- 125 ఏండ్ల నిరీక్షణకు తెరదించిన జావెలిన్ త్రోయర్
130 కోట్ల భారతావనీ.. 125 ఏండ్లుగా ఎదురుచూస్తున్న చారిత్రక సన్నివేశం. భారత క్రీడా రంగ దిగ్గజ అథ్లెట్లు మిల్కాసింగ్, పిటి ఉషలు సాధించలేని అద్వితీయ ఘనత. 23 ఏండ్ల యువ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అసాధ్యమనుకున్న ఒలింపిక్ అథ్లెటిక్ పసిడి కలను సుసాధ్యం చేశాడు. భారత క్రీడా రంగ చరిత్రలో నయా చరిత్ర సృష్టించాడు. బంగారు బల్లెంను (ఈటె) 87.58 మీటర్లు విసిరి భారత ఒలింపిక్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. నీరజ్ చోప్రా బంగారు ఈటె ప్రదర్శనతో యావత్ దేశం సంబరాలు జరుపుకుంది. జర్మనీ అథ్లెటిక్ దిగ్గజం జొహనాస్ వెట్టర్ను తోసిరాజని ఒలింపిక్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. స్వాతంత్య్రం అనంతరం ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్ సాధించిన తొలి పతకం ఇదే కావటం విశేషం. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినంద్ బింద్రా షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్)లో పసిడి పతకం సాధించగా.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు దక్కిన రెండో పసిడి ఇది.
రెజ్లింగ్ సూపర్‌స్టార్ బజరంగ్ పూనియా కాంస్య పట్టుతో మెరిశాడు. కజకిస్తాన్ రెజ్లర్‌పై 8-0తో ఏకపక్ష విజయం నమోదు చేసి మెన్స్ 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. గోల్ఫర్ ఆదితి అశోక్ సంచలన ఒలింపిక్ మెడల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మహిళల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించిన భారత్.. టోక్యోలో ఏడు మెడల్స్‌తో ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), రవి కుమార్ దహియా (రెజ్లింగ్), పి.వి సింధు (బ్యాడ్మింటన్), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్), బజరంగ్ పూనియా (రెజ్లింగ్), మెన్స్ హాకీ జట్టులు టోక్యోలో పతకాలు కొల్లగొట్టారు.
నజరానాల వెల్లువ
పసిడి యోధుడు నీరజ్ చోప్రాకు నగదు ప్రోత్సాహకాల వెల్లువ. హర్యానా ప్రభుత్వం రూ.6 కోట్లు, క్లాస్-1 ఉద్యోగం, ఇంటి స్థలం, పంచకుల అథ్లెటిక్స్ సెంటర్ చీఫ్ పదవి ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వం రూ. 2 కోట్లు, మణిపూర్ ప్రభుత్వం రూ.1 కోటి, బీసీసీఐ రూ.1 కోటి, చెన్నై సూపర్‌కింగ్స్ రూ.1 కోటి నగదు పురస్కారాలు ప్రకటించాయి. సిల్వర్ మెడలిస్ట్లు మీరా, రవిలకు రూ.50 లక్షలు, కాంస్య విజేతలకు రూ.25 లక్షలు, హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల పురస్కారాన్ని సైతం బీసీసీఐ ప్రకటించింది.
నీరజ్ చోప్రాది అపూర్వ విజయం. బంగారు బల్లెంతో అడ్డంకులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. భారత్‌కు తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ పసిడి పతకం తీసుకొచ్చావు. నీ విజయం యువతలో ప్రేరణ నింపుతుంది. భారత్ గర్విస్తోంది. హృదయపూర్వక శుభాకాంక్షలు'
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్