Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదో రోజు ఆట వర్షార్పణం
- భారత్, ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ
నాటింగ్‌హామ్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలనే కోహ్లిసేన ఆశలకు వరుణుడు గండి కొట్టాడు. జశ్‌ప్రీత్ బుమ్రా (5/64) ఐదు వికెట్ల ప్రదర్శనతో నాల్గో ఇన్నింగ్స్‌లో 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 52/1తో గెలుపు దిశగా సాగుతోంది. ఐదో రోజు విజయానికి మరో 157 పరుగులు అవసరం కాగా.. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ విరామం అనంతరం సైతం పరిస్థితుల్లో ఎటువంటి పురోగతి కనిపించ లేదు. వరుణుడు శాంతించకపోవటం, ఆట పున ప్రారంభమైనా ఫలితం తేలే అవకాశం లేకపోవటంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకే కుప్పకూలగా.. జో రూట్ (109) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరవటంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 303 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (56) మెరుపులతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 278 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ (26), పుజారా (12) అజేయంగానే నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 4/46తో మెరిసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. తొలి టెస్టు డ్రాగా ముగియగా.. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు లార్డ్స్ వేదికగా ఆగస్టు 12 నుంచి ఆరంభం కానుంది.