Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్
- ఒలింపిక్స్ జ్యోతి పారిస్‌కు అందజేత
- అత్యుత్తమంగా ముగించిన టీమ్ ఇండియా
కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు. విశ్వ క్రీడల ఆతిథ్యంతో స్థానికంగా కోవిడ్ వైరస్ వేగంగా ప్రబలుతుందనే ఆందోళన. ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని స్థానిక ప్రజలు నిరసన ప్రదర్శనలు. చరిత్ర ఎన్నడూ ఎరుగుని వ్యతిరేకత చవిచూసిన 2020 ఒలింపిక్స్.. ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిశాయి. కోవిడ్-19 మహమ్మారి సహా ఇతర ప్రధాన అవరోధాలను అవలీలగా అధిగమించిన టోక్యో.. విశ్వ క్రీడలకు దీటైన ఆతిథ్యం ఇచ్చింది. రెండో ప్రపంచ యుధ్దంలో సర్వం కోల్పోయినా 1964 ఒలింపిక్స్ నిర్వహణతో లేచి నిలబడిన జపాన్.. కోవిడ్ మహమ్మారి మానవాళికి సవాల్ విసిరిన వేళ 2020 ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా నిర్వహించింది. వైరస్‌పై మానవాళి మానసికంగా సాధించిన విజయంగా టోక్యో ఒలింపిక్స్‌ను అభివర్ణించవచ్చు!
నవతెలంగాణ-టోక్యో
2020 టోక్యో ఒలింపిక్స్‌కు తెర పడింది. 17 రోజుల పాటు విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన టోక్యో నగరం.. ఒలింపిక్ జ్యోతిని పారిస్‌కు అందజేసింది. 2024 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పారిస్ (ఫ్రాన్స్) నగరం ఓ ఏడాది ఆలస్యంగా ఆతిథ్య బ్యాటన్‌ను అందుకుంది. 2020 ఒలింపిక్ క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు, ఒలింపిక్ ఫెన్సింగ్ మెడలిస్ట్ థామస్ బాక్.. ఒలింపిక్ జ్యోతిని 2024 ఒలింపిక్స్ ఆతిథ్య నగరం పారిస్‌కు అందించాడు. టోక్యో నగర మేయర్ ఒలింపిక్ జ్యోతిని థామస్ బాక్కు అందించగా.. అతడు పారిస్ నగర మేయర్ చేతికి అందించాడు. జపాన్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఆరంభమయ్యాయి. ముగింపు కార్యక్రమంలో భారత జాతీయ పతాకధారిగా కాంస్య పతక విజేత, రెజ్లింగ్ సూపర్‌స్టార్ బజరంగ్ పూనియా అలరించాడు.
చిన్నదైనా సూపర్! : రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకలతో పోల్చితే టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలు తక్కువ స్థాయిలోనే జరిగాయి. అయినా, హంగు ఆర్బాటం సహా ఉత్సాహంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 'ప్రపంచం అంతా ఒక్కటై' నినాదంతో జరిగిన ముగింపు వేడుకల్లో భారత జట్టు 21వ స్థానంలో ముగింపు వేడుకులకు హాజరు కావాల్సి ఉన్నది. అయినా, ప్రపంచ అథ్లెట్లు ఓ ఆర్డర్, పద్దతి పాటించకుండా స్వేచ్ఛాయుతంగా ముగింపు వేడుకల కార్యక్రమంలోకి ప్రవేశించారు. దీంతో ఒలింపిక్ క్రీడలు 'ఒకే ప్రపంచం, ఒకే దేశం' అర్థం స్ఫురించేలా ముగిశాయి. 2020 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం జపాన్ జాతీయ గీతాలాపన అనంతరం ఒలింపిక్ జ్యోతిని 2024 ఆతిథ్య ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌కు అందించారు. పారిస్ నగర మేయర్ ఒలింపిక్ జ్యోతిని అందుకుని, కౌంట్‌డౌన్‌ను ఆరంభించగా.. అంతరిక్షంలో ఆ దేశ వ్యోమగాని థామస్ సాక్సోఫోన్ నుంచి ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని ఆలపించారు. అన్ని దేశాలకు చెందిన అథ్లెట్టు ముగింపు వేడుకల్లో తమ పతకాలను చూపిస్తూ ఉత్సాహంగా కనిపించారు. బాణాసంచా వెలుగులు, డిజిటల్ మెరుపుల్లో ఒలింపిక్ రింగులను ప్రదర్శించటం ముగింపు వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది.
అద్వితీయ విజయం! : ' క్రీడలు సమైక్య శక్తిగా నిలిచేందుకు మీరు ప్రేరణగా నిలిచారు. కరోనా మహమ్మారితో ఎన్నో సవాళ్లను ముందుంచిన ఈ క్రీడలు ఎంతో చెప్పుకోదగినవి. 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలు.. ఒలింపిక్ క్రీడలకు ఆశావహ దృక్పథం, సౌభ్రాతృత్వం, శాంతిని అందించాయి' అని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) థామస్ బాక్ తెలిపారు. ఆరంభ వేడుకల్లో ఫ్రాన్స్ అద్భుత కట్టడం ఈఫిల్ టవర్‌పై ఒలింపిక్ పతాక ఆవిష్కరణను షెడ్యూల్ చేసినా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూల్‌ను రద్దు చేశారు. కరోనా మహమ్మారి ప్రమాద కోరల్లో ఒలింపిక్ క్రీడలు దిగ్విజయంగా ముగిసేందుకు అహర్నిశలు శ్రమించిన సుమారు 80,000 మంది వాలంటీర్లకు ఈ సందర్భంగా థామస్ బాక్ ధన్యవాదాలు తెలిపారు. వాలంటీర్లు అందరికీ ప్రత్యేక బహమతులు అందజేశారు.
భారత అథ్లెట్ల సందడి : టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్ల బృందానికి రెజ్లింగ్ సూపర్‌స్టార్ బజరంగ్ పూనియా నాయకత్వం వహించారు. ఆరంభ వేడుకల్లో హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత పతాకధారులుగా వ్యవహరించగా.. ముగింపు వేడుకల్లో ఆ గౌరవం బజరంగ్ పూనియాకు దక్కింది. సహచర అథ్లెట్లతో కలిసి జపాన్ జాతీయ స్టేడియంలోకి అడుగుపెట్టిన బజరంగ్ పూనియా.. కాంస్య పతక ఆనందంలో అథ్లెట్లతో కలిసి సరదాగా సెల్ఫీలు దిగాడు.
అత్యుత్తమ భారత్ : 125 ఏండ్ల ఒలింపిక్ చరిత్రలో భారత్‌కు తొట్టతొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ పసిడి పతకం. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి రజత పతకం. వరుస ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు రికార్డు. లండన్ ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌లో తిరిగి ఒలింపిక్ మెడల్ వశం. ఇలా.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనే చేసింది. ఓ అంతర్జాతీయ సంస్థ అంచనాల ప్రకారం, భారత్ 20కి పైగా పతకాలు సాధిస్తుందని ఆశించారు. షూటర్లు, ఆర్చర్లు తీవ్ర నిరాశకు గురి చేసినా.. రెజ్లర్లు, బాక్సర్, షట్లర్, జావెలియన్ త్రోయర్, వెయిట్ లిఫ్టర్, హీకీ జట్టు భారత్ ఉర్రూతలూగే ప్రదర్శన చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా ఆరు పతకాలు సాధించి భారత్.. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ మార్క్‌ను దాటేసింది. ఏడు పతకాలతో ఒలింపిక్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. భారత్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు, 2016 రియో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించింది.
అగ్రస్థానం అమెరికాదే : టోక్యో ఒలింపిక్స్ ఆరంభ రోజు నుంచీ పతకాల పట్టికలో చైనా ముందంజలో కొనసాగింది. అత్యధిక స్వర్ణ పతకాలే లక్ష్యంగా ఒలింపిక్స్‌కు వచ్చిన డ్రాగన్ ఆ దిశగా 16 రోజులు విజయవంతమైంది. చివరి రోజు డ్రాగన్ దేశాన్ని అగ్రరాజ్యం అధిగమించింది. 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్య పతకాలు సహా 113 మెడల్స్‌తో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 38 పసిడి పతకాలతో చైనా ద్వితీయ స్థానానికి పరిమితమైంది. జపాన్ (27 స్వర్ణాలు), గ్రేట్ బ్రిటన్ (22 స్వర్ణాలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగ కాంస్య పతకాలతో భారత్ 48వ స్థానం సాధించింది.