Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ భారత, ఆరుగురు విదేశీ కోచ్‌లు
- ఒలింపిక్ మెడలిస్ట్‌లను తీర్చిదిద్దిన గురువులు
ప్రపంచ మేటీ అథ్లెట్లతో పోటీపడి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజయం సాధించగా.. పతకం అందుకునేందుకు ఒలింపిక్ పోడియంపై అథ్లెట్‌కు మాత్రమే చోటు ఉంటుంది. ఒలింపిక్ పోడియం పైకి చేరుకునేందుకు అథ్లెట్‌ను తీర్చిదిద్దటంలో కోచ్‌ల మార్గదర్శనం అసమానం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఏడుగురు భారత అథ్లెట్లు ఒలింపిక్ పతక పోడియంపై పతకాలు ముద్దాడారు. విశ్వ క్రీడల్లో అథ్లెట్లు ఉత్తమ ప్రదర్శన చేసేందుకు కోచ్‌లు ఎంతగానో శ్రమిస్తారు. టోక్యో ఒలింపిక్ మెడలిస్ట్‌లకు ఆరుగురు విదేశీ కోచ్‌లు, ఓ భారత కోచ్ పనిచేశారు. భారత ఒలింపిక్స్ తెర వెనుక విజేతల గురించి తెలుసుకుందాం..!
దేశం : ఇటలీ
అథ్లెట్ : లవ్లీనా బొర్గొహైన్
క్రీడాంశం : బాక్సింగ్
పతకం : కాంస్యం
రఫేల్ బెర్గామాస్కో (హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్)
బెర్గామాస్కో తండ్రి ఒలింపియన్. రఫేల్ సైతం ఐదుసార్లు ఇటలీ జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కోచ్‌గా బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్‌కు వెళ్లాడు. 2001-07లో మహిళల జట్టుకు కోచింగ్ ఇచ్చిన రఫేల్‌ను సీనియర్, జూనియర్ జట్లకు కోచ్‌గా నియమించారు. బెర్గామాస్కో శిక్షణలో ఇటలీ ఆరు ఒలింపిక్ పతకాలు సాధించింది. రియోలో నిరాశాజనక ఫలితంతో.. ఇటలీ నుంచి భారత్‌కు వచ్చాడు. 2017 నవంబర్‌లో యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యాలు రాబట్టాడు. ఆ ఫలితంతో బెర్గామాస్కోను మహిళల బాక్సింగ్ హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేశారు. లవ్లీనా బొర్గొహైన్‌కు ఒలింపిక్స్‌కు ముందు ప్రత్యేక శిక్షణ సహా వ్యక్తిగతంగా ఆమె టెక్నిక్, బలం మెరుగుపర్చటంలో కృషి చేశాడు.
దేశం : జర్మనీ
అథ్లెట్ : నీరజ్ చోప్రా
క్రీడాంశం : జావెలిన్ త్రో
పతకం : స్వర్ణం
ఉవె హాన్ (హెడ్ కోచ్), డా.బార్టినిట్జ్
జావెలియన్ త్రోయర్ శరీరం విల్లులా ఉండాలి. జావెలిన్‌ను అతడు బాణంలా వదలాలి. డా. బార్టినెట్జ్ ఫిలాసఫీ ఇది. ఈ ఫిలాసఫీ యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు బాగా పని చేసింది. బయో మెకానికల్ నిపుణుడైన బార్టినెట్జ్కు జావెలియన్ త్రో అవాంతరాలపై విస్పష్టమైన అవగాహన ఉంది. నీరజ్ చోప్రా ధృడంగా, సాగే శరీర సౌష్టవం, వేగవంతమైన కదలికల వెనుక బార్టినెట్జ్ కృషి అమోఘం. జావెలిన్‌కు సంబంధించిన ప్రత్యేక కసరత్తులు చేయించటంలో ఇతడి పాత్ర కీలకం.
నీరజ్ చోప్రా హెడ్ కోచ్ ఉవె హాన్. ప్రపంచ చరిత్రలో జావెలియన్ను 100కు పైగా మీటర్ల దూరం విసిరిన ఏకైక అథ్లెట్. 104.80 మీటర్లతో ఉవె నమ్మశక్యం కాని రికార్డు సాధించాడు. నీరజ్ చోప్రా ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించినప్పుడు ఇతడే కోచ్. 2019 ఆరంభంలో బార్టినెట్జ్ను జట్టులోకి తీసుకున్నాడు. ఈ ఇద్దరూ గతంలో చైనా జాతీయ జట్టుకు పని చేశారు.
దేశం : ఆస్ట్రేలియా
జట్టు : మెన్స్ హాకీ
పతకం : కాంస్యం
గ్రాహం రెయిడ్ (హెడ్ కోచ్)
సెమీఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి అనంతరం, కాంస్య పతక పోరుకు కొత్తగా సిద్ధం కావటంలో రెయిడ్ కృషి అమోఘం. బలహీన క్షణాల్లో దారుణమైన తప్పిదాలు చేయకుండా ఉండేందుకు హాకీ జట్టును సిద్ధం చేశాడు. ఇటీవల కాలం భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా చేతిలో 1-7తో దారుణంగా ఓడినా.. జట్టుపై జట్టుకు విశ్వాసం కలిగించాడు. గ్రూప్ దశలో అగ్రజట్లతో ఆడుతున్న ఆందోళన జట్టులో లేకుండా చేశాడు. హాకీ జట్టు మానసిక వైఖరి మార్చివేశాడు. 41 ఏండ్ల విరామం అనంతరం భారత హాకీ జట్టు ఒలింపిక్ పతకం సాధించిన చరిత్రలో కోచ్‌గా గ్రాహం రెయిడ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.
దేశం : భారత్
అథ్లెట్ : మీరాబాయి చాను
క్రీడాంశం : వెయిట్‌లిఫ్టింగ్
పతకం : రజతం
విజయ్ శర్మ (జాతీయ చీఫ్ కోచ్)
మీరాబాయి చాను 2014 నుంచి విజరు శర్మ శిక్షణలో ఉంది. మాజీ జాతీయ చాంపియన్ విజయ్ శర్మ మణికట్టు గాయంతో ప్రొఫెషనల్ కెరీర్‌కు దూరమయ్యాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు భారత మెన్స్ జట్టు బాధ్యతలు చేపట్టాడు. మీరాబాయి చాను విజయాలు, అపజయాల్లో విజయ్ శర్మ అండగా, తోడుగా నిలిచాడు. రియో ఒలింపిక్స్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మీరాబాయి చాను ఒక్క ప్రయత్నంలో కూడా బరువులు ఎత్తలేదు. ఆ చేదు అనుభవం అనంతరం వీడ్కోలు దిశగా మీరా ఆలోచన చేసింది. మానసిక వేధనకు లోనైంది. చాను తల్లి, కోచ్ విజరులు మీరాను తిరిగి సానుకూల దకృథంతో ఆలోచన చేసే స్థితికి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ జట్టును జాతీయ చాంపియన్‌గా నిలిపిన అనంతరం 2012లో విజరు శర్మ నేషనల్ క్యాంప్‌లోకి ప్రవేశించాడు.
దేశం : జార్జియా
అథ్లెట్ : బజరంగ్ పూనియా
క్రీడాంశం : రెజ్లింగ్
పతకం : కాంస్యం
షాకో బెంటినిడిస్ (వ్యక్తిగత కోచ్)
బెంటినిడిస్ వద్ద శిక్షణ అనంతరమే బజరంగ్ పూనియా మెన్స్ 65 కేజీల విభాగంలో అగ్ర రెజ్లర్‌గా రూపొందాడు. అమెరికా, రష్యాల నుంచి బజరంగ్‌కు ప్రాక్టీస్ భాగస్వామ్యులను సమకూర్చాడు. అత్యంత వేగంగా దాడి చేయగల ప్రత్యర్థుల కోసం బజరంగ్ తీవ్ర అన్వేషణ చేశాడు. లెగ్ డిఫెన్స్ మెరుగుపర్చుకునేందుకు బజరంగ్, బెంటినిడిస్ చాలా కష్టపడ్డారు. బజరంగ్ ఈ విభాగంలో ఆశించిన మెరుగుదల సాధించలేదు. అయినప్పటికీ ఒలింపిక్ మెడల్ సాధించటంలో బెంటినిడిస్ కృషి ఎంతో ఉంది. బజరంగ్ బలాన్ని గొప్పగా మెరుగుపర్చాడు.
దేశం : దక్షిణ కొరియా
అథ్లెట్ : పి.వి సింధు
క్రీడాంశం : బ్యాడ్మింటన్
పతకం : కాంస్యం
పార్క్ తే సంగ్ (వ్యక్తిగత కోచ్)
చూడచక్కని రాకెట్ వేగం, బలమైన స్మాష్‌లు, ఎదురులేని దూకుడు.. ప్రత్యర్థులపై సింధు ఆధిపత్యానికి ఇవే మూలం. నిలకడగా అగ్రశ్రేణి షట్లర్లపై విజయాలు సాధించేందుకు సింధు ఆటలో వైవిధ్యత అవసరం. సింధులో ఆ కోణాన్ని తీసుకొచ్చిన కోచ్ పార్క్ తే సంగ్. పాదాల కదలికల వేగంతో పాటు, సుదీర్ఘ సెషన్ల పాటు తిరుగులేని డిఫెన్స్ ఆడటంలో సింధును మేటీగా తీర్చిదిద్డాడు. సింధు నెట్ గేమ్ పురోగతిపైనా దృష్టి నిలిపాడు. టోక్యోలో సింధు దూకుడుతో పాటు కండ్లుచెదిరే డిఫెన్సివ్ గేమ్‌తో అలరించింది.
దేశం : రష్యా
అథ్లెట్ : రవి దహియా
క్రీడాంశం : రెజ్లింగ్
పతకం : రజతం
కమల్ మాలికోవ్ (వ్యక్తిగత కోచ్)
రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ టోక్యోకు అర్హత సాధించటంలో ఉపయుక్తంగా ఉంటాడని తొలుత ఇతడిని తీసుకున్నారు. సుశీల్‌కు ప్రాక్టీస్ పార్ట్నర్, పరిశీలకుడిగా వ్యవహరించాడు. సుశీల్ టోక్యో ఆశలు నెమ్మదిగా ఆవిరి కావటంతో రవి కుమార్ దహియాకు వ్యక్తిగత కోచ్‌గా టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కింద కేటాయించారు. రవి కుమార్‌కు నాణ్యమైన ప్రాక్టీస్ పార్ట్నర్లను అందించటంలో మాలికోవ్ ముఖ్య పాత్ర పోషించాడు. పోలాండ్ ఓపెన్‌లో ఓటమి తర్వాత.. రీయాక్షన్ సమయం మెరుగుదల, ప్రతిదాడి వేగం పెంపుదల దిశగా కఠోరంగా పని చేశారు. ఛత్రసాల్ స్టేడియం కోచ్ సత్పాల్ సింగ్ శిష్యుడు రవి కుమార్. ఒలింపిక్స్ కోసం మాలికోవ్ కోచింగ్ ఇచ్చారు.