Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిస్ క్లబ్‌తో సాకర్ స్టార్ జోడీ
న్యూఢిల్లీ : బార్సిలోనాతో 17 ఏండ్ల సుదీర్ఘ అనుబంధానికి అనూహ్య పరిణామాల నడుమ తెరపడటంతో.. సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ కెరీర్లో తొలిసారి మరో క్లబ్‌కు ఆడనున్నాడు. ' బార్సిలోనాలో కొనసాగేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. 50 శాతం వేతన కోతకు సిద్ధపడ్డాను. క్లబ్లో ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఉండాలని క్లబ్ కోరుకుంది. ఇతర కారణాల రీత్యా క్లబ్‌ను వీడాల్సి వస్తుంది. నిరుడు బార్సిలోనానను వీడాలని అనుకున్నాను. కానీ వెళ్లిపోలేదు. ఈ ఏడాది బార్సిలోనాలోనే ఉండాలనుకున్నాను. ఇలా జరిగింది' అని బార్సిలోనా వీడ్కోలు సమావేశంలో లియోనల్ మెస్సీ భావోద్వేగ ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో బార్సిలోనా తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుంది. సంస్థ ఆదాయం, సంస్థ ఖర్చులకు పొంతన లేదు. బార్సిలోనా ఆదాయంలో 70 శాతమే జీతాలు ఇవ్వాలని లాలిగా నిబంధనలు ప్రవేశపెట్టగా.. లియోనల్ మెస్సీ క్లబ్లో ఉంటే అది 130 శాతానికి చేరుతుంది. మెస్సి 50 శాతం వేతన కోతకు సిద్ధపడినా.. బార్సిలోనా వేతనాల శాతం ఆదాయంలో 90 శాతానికి ఉండటంతో సాంకేతికంగా అర్జెంటీనా దిగ్గజంతో ఒప్పందం పొడగింపునకు సాధ్యపడలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో లియోనల్ మెస్సీని తీసుకునే ఆర్థిక శక్తి పారిస్ క్లబ్ పారిస్ సెయింట్ జర్మెన్ (పీఎస్జీ) సహా మరో రెండు మూడు క్లబ్‌లకు మాత్రమే ఉంది. బార్సిలోనాతో మెస్సీ బంధానికి తెర పడగానే పీఎస్జీ అతడిని సంప్రదించింది. బార్సిలోనాతో మెస్సీ ఒప్పందం జూన్ 30తో ముగియగా.. నూతన ఒప్పందం కోసం క్లబ్, మెస్సీ ఎదురుచూశారు. పీఎస్జీతో ఒప్పందం కోసం లియోనల్ మెస్సీ పారిస్‌కు చేరుకున్నాడు. బార్సిలోనా తరఫున 778 మ్యాచులు ఆడిన మెస్సీ 672 గోల్స్ చేశాడు. పీఎస్జీ క్లబ్ పెట్టుబడుల మూలాలు ఖతార్‌లో ఉండటం, 2022 ఫిఫా ప్రపంచకప్ (ఖతార్)కు ముందు అక్కడే సాకర్ బూమ్ తీసుకొచ్చేందుకు మెస్సీతో ఒప్పందం ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.