Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనమ్ మాలిక్‌కు నోటీసులు
- రెజ్లింగ్ సమాఖ్య క్రమశిక్షణ చర్యలు
న్యూఢిల్లీ : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లరు పతకాల పంట పండించారు. రవి కుమార్ దహియా, బజరంగ్ పూనియాలు రజత, కాంస్య పతకాలు సాధించారు. మహిళా విభాగంలో వరల్డ్ నం.1 రెజ్లర్ వినేశ్ ఫోగట్ నుంచి పతకం ఆశించినా, ఆమె నిరాశపరిచింది. టోక్యో నుంచి సోమవారం స్వదేశానికి చేరుకున్న ఇద్దరు రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) క్రమశిక్షణ కొరడా ఝులిపించింది. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై సస్పెన్షన్ వేటు వేయగా..సోనమ్ మాలిక్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రెజ్లింగ్ ఫెడరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రెజ్లర్ వినేశ్ ఫోగట్ హంగరీ నుంచి నేరుగా టోక్యోకు చేరుకుంది. టోక్యో ఒలింపిక్ గ్రామంలో ఉండేందుకు ఆమె నిరాకరించింది. భారత రెజ్లర్లతో కలిసి సాధన చేసేందుకు విముఖత వ్యక్తం చేసింది. సీనియర్ రెజ్లర్‌గా ఆమె ప్రవర్తనపై సమాఖ్య ఆగ్రహంతో ఉంది. ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్లు భారత ఒలింపిక్ సంఘం రూపొందించిన శివ నరేశ్ జెర్సీలను మాత్రమే ధరించింది. వినేశ్ ఫోగట్ అందుకు విరుద్ధంగా నైకీ జెర్సీతో బరిలోకి దిగింది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు రెజ్లింగ్ సమాఖ్యను సంజాయిషీ కోరినట్టు తెలుస్తోంది. తీవ్ర క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన వినేశ్ ఫోగట్‌పై తాత్కాలిక నిషేధం వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరణ ఇచ్చేందుకు వినేశ్ ఫోగట్‌కు ఆగస్టు 16 వరకు గడువు ఇచ్చారు. వినేశ్ ఫోగట్ వివరణ అనంతరం రెజ్లింగ్ సమాఖ్య క్రమశిక్షణ సంఘం ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు సోనమ్ మాలిక్ ప్రవర్తన సరిగా లేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం సోనమ్ మాలిక్ లేదా ఆమె కుటుంబ సభ్యులు రెజ్లింగ్ సమాఖ్య కార్యాలయం నుంచి పాస్‌పోర్టు తీసుకోవాల్సి ఉంది. అందుకు బదులుగా సారు అధికారులను పంపించింది. దీనిపై రెజ్లింగ్ సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేశారు.