Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర క్రీడా రంగాన్ని బతికించండి
- 28 ఏండ్లుగా కాంట్రాక్టు కోచ్‌లుగానే ఉన్నాం
- సీఎం కేసీఆర్‌కు శాట్స్ కాంట్రాక్టు కోచ్‌ల వినతి
క్రీడా రంగానికి వెన్నెముక కోచ్‌లు. స్టేడియాలు, సదుపాయాలు, వసతులు ఎన్ని కల్పించినా.. లక్ష్య సాధనలో మార్గ నిర్దేశనం చేసేందుకు గురువు లేకపోతే చాంపియన్లు తయారు కాలేరు. అటువంటి కోచ్‌లను క్రమబద్దీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) కాలయాపన చేస్తున్నాయి. ఆటలపై అమితమైన ప్రేమతో కోచింగ్‌లో కొనసాగుతున్న శాట్స్ శిక్షకులు గత 28 ఏండ్లుగా క్రమబద్దీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్
జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29లోగా 28 ఏండ్లుగా అపరిష్కతంగా ఉన్న కాంట్రాక్టు కోచ్‌ల ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) కాంట్రాక్టు కోచ్‌ల సంఘం విన్నవించింది. ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ఏండ్లుగా శాట్స్, క్రీడా శాఖ అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఉపయోగం లేదు. అంతిమ ప్రయత్నంగా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ రోజు మీడియా ముందుకొచ్చాం. కాంట్రాక్టు కోచ్‌ల వెతలు వినేందుకు ముఖ్యమంత్రి పది నిమిషాల సమయం కేటాయించాలని శాట్స్ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం అధ్యక్షురాలు టీవీఎల్ సత్యవాణి, కార్యదర్శి ఎఎన్కే గోకుల్ కోరారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని కాంట్రాక్టు కోచ్‌లను క్రమబద్ధీకరించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో పాటు ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు.
1993లో నియామకం
1993, 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కోచ్‌లను నియమించారు. సహజంగా ఒప్పంద కోచ్‌లు మూడేండ్ల సర్వీస్ అనంతరం ఉద్యోగ క్రమబద్ధీకరణ పొందేవారు. 1993లో నియమితులైన పది మంది కోచ్‌లు, 1999లో ఐదుగురు కోచ్‌ల విషయంలో అది జరుగలేదు. నోటిఫికేషన్ లేకుండా, దినసరి వేతనంతో శాట్స్‌లో పనిచేస్తున్న పరిపాలన విభాగ ఉద్యోగులు 40 మందిని 1994లో క్రమబద్ధ్దీకరించారు. సారు కోచ్‌లకు ఉండాల్సిన అన్ని అర్హతలతో, ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా నియమితులైన కోచ్‌లను క్రమబద్ధీకరించటంలో మాత్రం అధికారులు ఎక్కడ లేని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. న్యాయపరమైన లొసుగులతో క్రమబద్ధీకరణ దస్త్రాన్ని తయారు చేస్తుండటంతో ఉన్నతాధికారులు ప్రతిసారి ఫైల్‌ను తిప్పి పంపుతున్నారు. ఈ తంతు ఏండ్లుగా కొనసాగుతోంది.
వర్తించని యాక్ట్-2 అడ్డంకి
1993, 1999 బ్యాచ్ శాట్స్ కోచ్‌లను క్రమబద్ధీకరించేందుకు 1994 యాక్ట్-2 అడ్డుగా ఉందని అధికారులు కారణాలు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉద్యోగులను క్రమబద్ధ్దీకరించినప్పుడు అడ్డురాని యాక్ట్-2, కోచ్‌ల విషయంలోనే ఎందుకు ముందుకు తెస్తున్నారని శాట్స్ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి నంద కిశోర్ గోకుల్ ప్రశ్నిస్తున్నారు. 1993, 1999 బ్యాచ్ కోచ్‌లు జి.ఓ 25 ప్రకారం అన్ని అర్హతలు కలిగి ఉన్నారు, జి.ఓ 16 సెక్షన్ 10(ఏ) ప్రకారం క్రమబద్ధ్దీకరణకు అర్హులు. ఇదే విషయాన్ని క్యాబినెట్ ఉపసంఘానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖల ద్వారా విన్నవించారు. సెక్షన్ 10(ఏ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సాంఘీక సంక్షేమ గురుకులాలు, పంచాయతిరాజ్ శాఖలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధ్దీకరించారు. అదే విధంగా శాట్స్ ఒప్పంద కోచ్‌లను సైతం క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, శాట్స్ అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలు అమలు చేయరా?
1993, 1999 బ్యాచ్ ఒప్పంద కోచ్‌లను క్రమబద్ధీకరించాలని 2008లో ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయకుండా మూల వేతనం, ఇతర అలవెన్సులతో శాట్స్ అధికారులు సరిపెట్టారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కాంట్రాక్టు కోచ్‌లకు పీఆర్సీ వర్తింపజేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రకారం వేతనాలు అందినా.. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ ఎలా అమలు చేస్తారని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, పీఆర్సీ అమలు చేస్తామని న్యాయస్థానానికి ఏ విధంగా అఫిడవిట్ దాఖలు చేస్తారనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయనందున కోర్టు ధిక్కారణ కేసు సైతం హైకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.