Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్జీలో చేరుతూ మెస్సీ వ్యాఖ్యలు
పారిస్ : బార్సిలోనాతో 17 ఏండ్ల బంధానికి ముగింపు పలికిన సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీకి పారిస్ నగరం అత్యంత ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయం నుంచి పీఎస్జీ కార్యాలయం వరకు అభిమానులు బారులు తీరారు. పారిస్ సెయింట్ జర్మెన్ (పీఎస్జీ) క్లబ్‌తో రెండేండ్ల నూతన ఒప్పందం కుదుర్చుకున్న లియోనల్ మెస్సీ బుధవారం మీడియా ముందుకొచ్చారు. 'పారిస్ సెయింట్ జర్మెన్ క్లబ్ తొలి చాంపియన్స్ లీగ్ టైటిల్ సాధన కోసమే నేను ఇక్కడికి వచ్చాను. పీఎస్జీ ఆశయాలు కలిగిన క్లబ్. దేనికోసమైనా పోరాడే స్వభావం ఈ క్లబ్లో చూడవచ్చు. మరో చాంపియన్స్ లీగ్ సాధించటమే నా కల. అందుకు పీఎస్జీ సరైన వేదిక అని అనుకుంటున్నా. కోపా అమెరికా అనంతరం సెలవుల్లో ఉన్నాను. ఓ నెల రోజులుగా మైదానంలో అడుగుపెట్టలేదు. పీఎస్జీ తరఫున తొలి మ్యాచ్‌కు ముందు ప్రీ సీజన్ కసరత్తులు అవసరం. త్వరలోనే పీఎస్జీ అరంగేట్రం ఉంటుందని చెప్పగలను, కానీ స్పష్టంగా ఓ తేది చెప్పలేను. ఆ విషయాన్ని కోచ్‌లు తేల్చుతారు' అని లియోనల్ మెస్సీ తెలిపాడు. బార్సిలోనా క్లబ్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. ఓ పిల్లాడిగా అక్కడికి వెళ్లాను. మంచి, చెడు రెండూ చూశాను. మరో మంచి క్లబ్‌కు ఆడతానని బార్సిలోనా అభిమానులకు తెలుసు. నేను విజయాలను ఇష్టపడతాను, నేను ఓ విజేతను, ఆ పరంపర కొనసాగించాలని అనుకుంటున్నానని మెస్సీ అన్నాడు.