Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోల్ఫర్ ఆదితి అశోక్
న్యూఢిల్లీ : 18 ఏండ్ల వయసులో ఒలింపిక్స్ అరంగేట్రం చేసిన ఆదితి అశోక్.. 23 ఏండ్లకే రెండోసారి ఒలింపిక్స్లో పోటీపడింది. రియో ఒలింపిక్స్లో 291 స్కోరుతో 41వ స్థానంలో నిలిచిన ఆదితి.. టోక్యోలో పతకం రేసులో చివరి వరకూ నిలిచింది. ఓవరాల్గా 269 స్కోరు చేసిన ఆదితి నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. నిలకడగా రెండో స్థానంలో కొనసాగిన ఆదితి అశోక్.. ఆఖర్లో పతకం కోల్పోయింది. రియో ఒలింపిక్స్లో జిమ్నాస్ట్ దీప కర్మాకర్ తృటిలో పతకం చేజార్చుకోగా.. టోక్యోలో ఆదితి వంతు అయ్యింది!. ఆదితి పతకం కోసం భారత క్రీడాభిమానులు శనివారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. టోక్యోలో పతకం చేజారినందుకు ఎటువంటి బాధ లేదని ఆదితి తెలిపింది. ' రియోలో నాకు అంత అనుభవం లేదు. ఎల్పీజీఏలో ఆడటం నా ఆటలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వరల్డ్ నం.1, ఒలింపిక్ చాంపియన్, వరల్డ్ చాంపియన్లు రేసులో ఉండగా.. నేను మెడల్ పోటీదారుగా ఉన్నాను. అది సాధారణ విషయం కాదు. ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలువటం కలిచివేసేదే. కానీ నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. పతకం కోసం నేను అన్ని ప్రయత్నాలు చేశాను. నా శక్తి మేరకు ప్రయత్నించాను. నా ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆటను మరింత మెరుగుపర్చుకుని.. మరో మెడల్ కోసం పోరాడే అవకాశం ఉంటుందేమో చూడాలి' అని ఆదితి తెలిపింది.