Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నాం 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
- లార్డ్స్ ఫేవరేట్‌గా కోహ్లిసేన
- ఇంగ్లీష్ జట్టుకు బ్యాటింగ్ సమస్యలు
- నేటి నుంచే భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు
పటౌడీ ట్రోఫీ ఆరంభ టెస్టు ఆఖరు రోజు ఆటను వరుణుడు అడ్డుకోవటంతో నాటింగ్‌హామ్‌లో ఆధిక్యం ఎటూ మొగ్గలేదు. ఆఖరు రోజు ఆటలో తొమ్మిది వికెట్లు తీసేందుకు ఇంగ్లాండ్‌కు, 157 పరుగులతో మెరుపు విజయం అందుకునేందుకు భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయి. నాలుగు రోజుల ఆటలో కోహ్లిసేన ఆధిపత్యం కనిపించినా.. ఫలితం తేలని టెస్టులో ఆత్మవిశ్వాసం ఒక్కటే తర్వాతి మ్యాచ్‌కు ముందు పనికొస్తుంది!. ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమస్యలతో ఉండగానే, లార్డ్స్‌లో విజయం సాధించాలని కోహ్లిసేన కోరుకుంటుంది. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-లార్డ్స్
ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో 1-0 విజయమే లక్ష్యంగా టీమ్ ఇండియా బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన నైరాశ్యంలో ఉన్న ఇంగ్లాండ్‌ను నాటింగ్‌హామ్‌లో దెబ్బకొట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నా.. ఆఖరు రోజు వరుణుడు ఆతిథ్య జట్టును రక్షించాడు!. తొలి టెస్టులో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన భారత్ నేడు లార్డ్స్ టెస్టులోనూ అదే ఉత్సాహంతో ఆడాలని చూస్తుంది. బ్యాటింగ్ లైనప్‌లో కెఎల్ రాహుల్, బౌలింగ్ లైనప్‌లో జశ్‌ప్రీత్ బుమ్రా ఫామ్ లార్డ్స్ టెస్టులో భారత్‌ను ఫేవరేట్‌గా బరిలో నిలుపుతోంది. కెప్టెన్ జో రూట్ శతక విన్యాసంతో నాటింగ్‌హామ్‌లో బతికిపోయిన ఇంగ్లాండ్.. నేడు సమిష్టిగా మెరిస్తేనే కోహ్లిసేన ముందు నిలబడగలరు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సోనీ నెట్‌వర్క్‌లో టెస్టు మ్యాచ్ ప్రసారం అవనుంది.
ఆ ముగ్గురు మెరుస్తారా? : తొలి టెస్టులో భారత్ ఆకట్టుకున్నా.. మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. సీనియర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానెలు రెండెంకల స్కోరు అందు కోవటంలో విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 12 పరుగులతో అజే యంగా నిలిచినా.. తొలి ఇన్నిం గ్స్‌లో 4 పరుగులకే వికెట్ కోల్పోయాడు. విరాట్ కోహ్లి (0), అజింక్య రహానె (5) తేలిపోయారు. రాహుల్‌కు తోడు రవీంద్ర జడేజా అర్థ సెంచరీ చేయకుంటే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం సంగతి అటుంచి.. ఇంగ్లాండ్ కంటే వెనుకంజలో కొనసాగేది!. లార్డ్స్ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలం. ఇంగ్లాండ్ ప్రధాన పేసర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ అందుబాటులో లేరు. దీంతో ఈ ముగ్గురు బ్యాటింగ్ బాధ్యత తీసుకుని భారీ స్కోరు దిశగా నడిపించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫిట్నెస్తో తుది జట్టు ఎంపికకు అందుబాటులో వచ్చిన మయాంక్ అగర్వాల్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్ తొలి టెస్టు ప్రదర్శనతో తుది జట్టులో స్థానం ఖాయం చేసుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో పుజారా, రహానెలలో ఒకరిపై వేటు పడితేనే రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్ స్థానంలో ఆడగలరు. బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాకూర్ గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ ఇషాంత్ శర్మలలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. బుమ్రా, షమి, సిరాజ్ త్రయం లార్డ్స్‌లోనూ కొనసాగనుంది.
పుంజుకోగలరా? : 2014 అనంతరం సొంతగడ్డపై మూడు టెస్టుల్లో ఒక్క విజయం సాధించలేదు ఇంగ్లాండ్. 2014లో ఐదో మ్యాచ్‌లో గానీ విజయం దక్కలేదు. భారత్ జోరుమీదుండగా జో రూట్ సేన సైతం విజయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ రాణించటం లేదు. బెన్ స్టోక్స్ లేని వేళ పూర్తి బాధ్యత రూట్‌పై పడింది. జాక్ క్రావ్లీ, డామినిక్ సిబ్లీ, జోశ్ బట్లర్, జానీ బెయిర్‌స్టోలు ఆశించిన మేరకు పరుగులు చేయటం లేదు. ప్రధాన సీమర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు ఇద్దరూ గాయంతో లార్డ్స్ టెస్టులో ఆడటం లేదు. ఇది ఇంగ్లాండ్‌కు ప్రతికూలంగా మారనుంది. లార్డ్స్‌లో భారత్‌పై మంచి రికార్డున్న స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ తుది జట్టులోకి రానున్నాడు. బ్యాట్‌తో, బంతితో అతడు కోహ్లిసేనకు ప్రమా దకరంగా మారే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం : ఇంగ్లీష్ వేసవి మరోసారి టెస్టు క్రికెట్ ఫలితం తేలకుండా చేసింది. తొలి టెస్టుకు వర్షం ఆటంకం గట్టి దెబ్బ కొట్టింది. లార్డ్స్‌లో వాతావరణం భిన్నంగా ఉండనుంది. ఐదు రోజుల పాటు మంచి ఎండకాయనుందని అంచనా. అయినా ఆట 2, 3వ రోజులలో మేఘావృతమైన వాతావరణం, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. లార్డ్స్ పిచ్‌పై టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ : రోరీ బర్న్స్, డామినిక్ సిబ్లే, జాక్ క్రావ్లీ/హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోశ్ బట్లర్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, శామ్ కరణ్, ఒలీ రాబిన్సన్, మార్క్‌వుడ్, క్రెయిగ్ ఓవర్టన్/షకిబ్ మహ్మద్.