Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారా జట్టుకు ఆత్మీయ వీడ్కోలు
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల బృందం ఏడు పతకాలతో 130 కోట్ల భారతీయులు ఉప్పొంగిపోయారు. టోక్యోలో మువ్వెన్నల జెండా రెపరెపలాడించేందుకు ఇప్పుడు పారా అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. టోక్యో వేదికగా 2020 పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి ఆరంభం కానున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు పోటీపడుతున్నారు. రియో ఒలింపిక్స్‌తో పోల్చితే ప్రాతినిథ్య సంఖ్య మూడింతలు పెరిగింది. టోక్యోకు బయల్దేరడానికి ముందు భారత పారా అథ్లెట్లకు న్యూఢిల్లీలోని అశోక హౌటల్లో భారత పారాలింపిక్ సంఘం ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. కఠిన బయో సెక్యూర్ బబుల్ నిబంధనల నేపథ్యంలో క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పారా అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ' పారా అథ్లెట్ల ఆశయాలు, సంకల్పం 130 కోట్ల భారతీయులకు స్ఫూర్తినిస్తుంది. పారా అథ్లెట్ల ధైర్యానికి ఎంతటి సవాలైనా సలాం కొట్టాల్సిందే. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం.. రియో పారా బృందం కంటే మూడింతలు ఎక్కువ. పతక ప్రదర్శన సైతం అదే రీతిలో ఉంటుందని ఆశిస్తున్నాను. పతకాల పట్టికలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలబెట్టేందుకు పారా అథ్లెట్లు టోక్యో బరిలోకి దిగనున్నారు' అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ నుంచి స్టార్ పారా అథ్లెట్లు బరిలో ఉన్నారు. రెండుసార్లు పారాలింపిక్ పసిడి విజేత దేవేంద్ర జఝారియ (2004, 2016), రియో ఒలింపిక్స్ పసిడి విజేత మరియప్పన్ తంగవేలు, ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరీలు పసిడి ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. దేవేంద్ర ఎఫ్-46 జావెలిన్ త్రో, సందీప్ చౌదరీ ఎఫ్-64 జావెలిన్ త్రో, మరియప్పన్ తంగవేలు టీ-63 లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతక రేసులో ముందున్నారు.
అవార్డుల వేడుక వాయిదా! : పారా ఒలింపియన్ల కోసం ఈ ఏడాది జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందించే జాతీయ క్రీడా అవార్డుల వేడుకను వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లతో పాటు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు సైతం అవార్డుల వేడుకకు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. క్రీడా దిగ్గజం, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి ఆగస్టు 29న భారత్త జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.