Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ అర్థ శతకాలు
- మళ్లీ విఫలమైన చతేశ్వర్ పుజారా
- భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు తొలి రోజు
ఓపెనర్లు కదం తొక్కారు. విదేశీ టెస్టులో టీమ్ ఇండియా స్వప్నించిన ఆరంభం లార్డ్స్‌లో దక్కింది!. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు దుమ్మురేపటంతో భారత్ మంచి స్కోరు దిశగా సాగుతోంది. తొలి వికెట్‌కు 126 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్, రోహిత్ తొలి రెండు సెషన్లలో భారత్‌కు పైచేయి అందించారు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (9) మరోసారి స్వల్ప స్కోరుకు వికెట్ కోల్పోయాడు.
నవతెలంగాణ-లార్డ్స్
నాటింగ్‌హామ్ జోరు లార్డ్స్‌లోనూ కొనసాగుతోంది. వర్షం కురిసి, సీమర్లకు అనుకూలంగా మారిన లార్డ్స్ టెస్టు తొలి రోజు భారత ఓపెనర్లు రెచ్చిపోయారు. జేమ్స్ అండర్సన్ సారథ్యంలోని ఇంగ్లీష్ బౌలింగ్ బృందాన్ని దంచికొట్టారు!. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (83, 145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) కదం తొక్కటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 65 ఓవర్ల ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 203/2తో కొనసాగుతోంది. కెఎల్ రాహుల్ (83 నాటౌట్, 182 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (14 నాటౌట్, 41 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నారు.
రోహిత్ దూకుడు : కీలక టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. లార్డ్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు అనుకూలమైనా.. చిరుజల్లులు, మేఘావృత వాతావరణం పేస్‌కు అనుకూల పరిస్థితులు కల్పించాయి. జేమ్స్ అండర్సన్ చేతిలో కొత్త బంతి ఉండగా ఆరంభంలో వికెట్లు కాచుకోవటం ఎంతో కష్టమైన పని. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన తొలి సెషన్లో రోహిత్ శర్మ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తొలి బౌండరీ బాదిన రోహిత్ శర్మ.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 18.4 ఓవర్లలో భారత్ 46/0తో ఉండగా వరుణుడు మళ్లీ అడ్డు తగిలాడు. దీంతో లంచ్ విరామం తీసుకున్నారు. బ్రేక్ అనంతరం బ్యాటింగ్ గేర్ మార్చిన రోహిత్ శర్మ వేగంగా పరుగులు పిండుకున్నాడు. ఎనిమిది ఫోర్లతో 83 బంతుల్లోనే లార్డ్స్ టెస్టు అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఓ ఎండ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ సాగిస్తుండగా.. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 11 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో 83 పరుగులు పిండుకున్న రోహిత్ శర్మను.. అండర్సన్ అద్భుత బంతితో అవుట్ చేశాడు. బంతిని అవుట్‌స్వింగ్ చేస్తూ రోహిత్‌ను ట్రాప్ చేసిన అండర్సన్.. ఇన్‌స్వింగర్‌తో వికెట్ పడగొట్టాడు. అప్పటికి భారత్ స్కోరు 126.
రాహుల్ మెరుపుల్ : రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత వరకు సావధానంగా ఆడిన రాహుల్.. అతడి నిష్క్రమణతో పరుగుల వేటను తనే ముందుండి నడిపించాడు. ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 137 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాహుల్.. పటౌడీ ట్రోఫీలో రెండో అర్థ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (9) నిరాశపరిచాడు. జేమ్స్ అండర్సన్‌కు వికెట్ కోల్పోయి వైఫల్య పరంపర కొనసాగించాడు. విరాట్ కోహ్లి జతగా మూడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నిర్మిస్తున్న రాహుల్.. శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లతో ఆ జట్టును ఉపశమనం కలిగించాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (బి) జేమ్స్ అండర్సన్ 83, కెఎల్ రాహుల్ నాటౌట్ 55, చతేశ్వర్ పుజారా (సి) బెయిర్‌స్టో (బి) జేమ్స్ అండర్సన్ 9, విరాట్ కోహ్లి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (52 ఓవర్లలో 2 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-126, 2-150.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 14-4-28-2, ఒలీ రాబిన్సన్ 12-4-22-0, శామ్ కరణ్ 11-1-40-0, మార్క్‌వుడ్ 8-1-38-0, మోయిన్ అలీ 7-1-20-0.