Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: కెప్టెన్ జో రూట్ భారీ శతకంతో చెలరేగడంతో రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత దిశగా పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులతో శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో రూట్(132), మొయిన్ అలీ(22) ఉన్నారు. రూట్-బెయిర్‌స్టో కలిసి నాల్గో వికెట్‌కు 121 పరుగులు జత చేసిన అనంతరం మహ్మద్ సిరాజ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత జోస్ బట్లర్‌ను ఇషాంత్ శర్మ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టు 283 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.
తొలి సెషన్ ఇంగ్లండ్‌దే!
శనివారం తొలిసెషన్లో ఇంగ్లండ్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టును కెప్టెన్ రూట్, బెయిర్‌స్టో కలిసి ఆదుకున్నారు. లంచ్ సమయానికి రూట్(81), బెయిర్‌స్టో(51) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరోవైపు భారత బౌలర్లు తొలి సెషన్లో 30 ఓవర్లు వేసిన ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
గ్రాహం గూచ్ను దాటేసిన రూట్..
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ను వెనక్కి నెట్టేశాడు. గూచ్ తన టెస్టు కెెరీర్‌లో 8,900 పరుగులు చేశాడు. ఈ రికార్డును చేరుకోవడానికి నాలుగు పరుగులు మాత్రమే అవసరం కాగా, శుక్రవారం ఇషాంత్ శర్మ వేసిన 28వ ఓవర్లో ఫోర్ కొట్టిన రూట్ ఆ ఘనత సాధించాడు. ఈ జాబితాలో రూట్ కంటే ముందు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ టెస్టుల్లో 12,472 పరుగులు చేశాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టులో రూట్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ తన టెస్ట్ కెరీర్లో 21 సెంచరీలు, 50అర్ధ సెంచరీలు చేశాడు.
స్కోర్‌బోర్డు.. (టీ విరామ సమయానికి)
భారత్ తొలి ఇన్నింగ్స్ 364ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బి) షమీ 49, సిబ్లే (సి)రాహుల్ (బి)సిరాజ్ 11, హమీద్ (బి)సిరాజ్ 0, రూట్ (బ్యాటింగ్) 135, బెయిర్‌స్టో (సి)కోహ్లి (బి)సిరాజ్ 57, బట్లర్ (బి)ఇషాంత్ 20, మొయిన్ అలీ (బ్యాటింగ్) 20, అదనం 22. (98.4 ఓవర్లలో) 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/23, 3/108, 4/229, 5/283
బౌలింగ్: ఇషాంత్ 20-2-60-1, బుమ్రా 21-6-65-0, షమీ 21-3-87-1, సిరాజ్ 23-4-71-3, జడేజా 14-1-27-0.