Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంతో జావెలిన్త్రోకు ఎనలేని ప్రాచుర్యం లభించింది. నీరజ్ చోప్రా కంటే ముందు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్ సర్నామ్ సింగ్ జావెలిన్‌త్రో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అనేక బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించిన సర్నామ్ సింగ్ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు ఆగ్రా పరిధిలోని ధోల్పూర్లో కొంత భూమి ఉంది. ఆ భూమిని పొరుగువారు లాక్కున్నారు. బోరుబావిని కూల్చేసి ఇబ్బందిపాలు చేస్తున్నారని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఆ ఆర్మీ జవాన్. దేశానికి ఆర్మీ జవానుగా సేవ చేయడమేకాదు, క్రీడాకారుడిగా దేశ విదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సర్నామ్ సింగ్ ఇప్పుడు ధోల్పూర్లోనే ఒక కిరాయి ఇంట్లో భార్య, పిల్లలతో జీవిస్తున్నారు. ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించినా.. అప్పటి ప్రభుత్వం తనకు ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదని, ఒక గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన భూమి తనకు ఇప్పించాలని కోరుతున్నారు.
1970లో భారత ఆర్మీలో చేరిన సర్నాం సింగ్.. జావెలిన్‌త్రో క్రీడలో అద్భుత ప్రదర్శన చేశారు. 1982 ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పాల్గొన్న సర్నామ్ సింగ్ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచారు. 1984లో కాట్మండులో జరిగిన ఆసియా క్రీడల్లో 78.58 మీటర్ల దూరం జావెలిన్‌ను త్రో చేసి పసిడి పతకాన్ని పట్టేశారు. ఇండోనేషియా, జర్మనీ, పాకిస్తాన్లలో జరిగిన క్రీడల్లో పాల్గొని పలు పతకాలను సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో సర్నామ్ సింగ్ ఏడు పసిడి పతకాలను సాధించారు. ఆర్మీలో పదోన్నతి పొంది చివరకు 2001 అక్టోబర్ 1న రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఈ క్రీడాకారుడికి కష్టాలు మొదలయ్యాయి.