Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపియన్లతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనను 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల ప్రసంగంలో ఎర్రకోట మీదుగా కీర్తించిన ప్రధాని నరెంద్ర మోడీ..సోమవారం తన నివాసంలో ఒలింపియన్లతో సమావేశం అయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన 127 మంది క్రీడాకారులు ప్రధాని నివాసంలో అల్పాహార భేటీకి హాజరయ్యారు. పసిడి పతకం నీరజ్ చోప్రా, రజత పతక విజేతలు మీరాబాయి చాను, రవి కుమార్ దహియా సహా కాంస్య పతక విజేతలు మెన్స్ హాకీ జట్టు, పి.వి సింధు, లవ్లీనా బొర్గొహైన్, బజరంగ్ పూనియాలను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. టోక్యో ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ నియామవళి ఉల్లంఘించి సస్పెన్షన్‌కు గురైన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ సైతం ఈ కార్యక్రమానికి హాజరైంది. ఒలింపిక్స్ సన్నద్ధత కోసం ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను తినటం లేదని గతంలో ప్రధాని మోడీతో సింధు గుర్తు చేసింది. టోక్యో నుంచి తిరిగొచ్చిన అనంతరం కలిసి ఐస్‌క్రీమ్ తిందామని మోడీ అన్నారు. రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ మెడల్స్‌తో ప్రధాని నివాసానికి వచ్చిన సింధుతో కలిసి మోడీ ఐస్‌క్రీమ్ ఆరగించారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా పి.వి సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు ఫైనల్స్‌కు చేరుకుని రజత పతకం సాధించగా, టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్లో పరాజయం పాలైనా, కాంస్య పతక పోరులో మెరిసి పతకం పట్టుకొచ్చింది.