Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంతి, బ్యాట్‌తో చెలరేగిన పేస్ ద్వయం
- గెలుపు ముంగిట టీమ్ ఇండియా
నవతెలంగాణ-లార్డ్స్
పటౌడీ ట్రోఫీలో ఆధిక్యం దిశగా భారత్ దూసుకెళ్తోంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ నడ్డి విరిచిన టీమ్ ఇండియా.. విజయానికి అత్యంత చేరువలో నిలిచింది. టెయిలెండర్లు మహ్మద్ షమి (56 నాటౌట్, 70 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), జశ్‌ప్రీత్ బుమ్రా (34 నాటౌట్, 64 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా 89 పరుగులు జోడించారు. షమి అజేయ అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌తో మెరవటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బుమ్రా, షమి, సిరాజ్, ఇషాంత్‌లు సమిష్టిగా నిప్పులు చెరగటంతో ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మూడో సెషన్ డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 45 ఓవర్లలో 112/7తో కొట్టుమిట్టాడుతోంది. జోశ్ బట్లర్, ఓలీ రాబిన్సన్లు డ్రా కోసం పోరాడుతున్నారు!.
నిప్పులు చెరిగారు! : 272 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్ ఇచ్చారు పేసర్లు. ఓపెనర్లు బర్న్స్ (0), సిబ్లే (0)లను బుమ్రా, షమిలు డకౌట్ చేశారు. హమీద్ (9), బెయిర్‌స్టో (2)లను సైతం అవుట్ చేయటంతో 67/4తో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. టీ విరామం అనంతరం తొలి ఓవర్లోనే బుమ్రా రూట్ (33) పని పట్టాడు. మెరుపు బంతితో స్లిప్స్‌లో క్యాచౌట్ చేశాడు. 67/5 ఉన్న ఇంగ్లాండ్‌కు సిరాజ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో అలీ (13), కరణ్ (0)లను అవుట్ చేశాడు. 90/7తో ఇంగ్లాండ్ ఓటమి కోరల్లో చిక్కుకోగా.. భారత్ గెలుపు గర్జన వైపు నడుస్తోంది!.
షమి, బుమ్రా దంచికొట్టారు : ఓవర్‌నైట్ స్కోరు 181/6తో ఐదో రోజు ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. రిషబ్ పంత్‌పైనే ప్రధానంగా ఆధారపడింది. పంత్ (22) నిష్క్రమణ అనంతరం తోక ప్రతాపం మొదలైంది. మహ్మద్ షమి (56 నాటౌట్, 70 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (34 నాటౌట్, 64 బంతుల్లో 3 ఫోర్లు) దుర్బేద్యమైన తొమ్మిదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. చెలరేగిన షమి 57 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. బుమ్రా సైతం బూమ్‌బూమ్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. షమి, బుమ్రా ద్వయం ఇంగ్లాండ్ పేసర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఈ జోడీని విడదీసేందుకు రూట్ వద్ద ప్రణాళికలు కరువయ్యాయి. ఇంగ్లాండ్ పేసర్లు అనైతికంగా ప్రమాదకర బౌన్సర్లు సంధించినా.. ఈ జోడీ మెరుపులు ఆగలేదు. టెయిలెండర్లు అద్భుత ఆటతీరుతో మెరవటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298 వద్ద డిక్లరేషన్ ఇచ్చింది. ఇంగ్లాండ్ ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంచ్ అనంతరం తొమ్మిది బంతులకే భారత్ ఇన్నింగ్స్ డిక్లరేషన్ ఇచ్చింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 364/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 391/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5, రోహిత్ (సి) అలీ (బి) వుడ్ 21, పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45, రహానె (సి) బట్లర్ (బి) అలీ 61, పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 22, జడేజా (బి) అలీ 3, ఇషాంత్ (ఎల్బీ) రాబిన్సన్ 16, షమి నాటౌట్ 56, బుమ్రా నాటౌట్ 34, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (109.3 ఓవర్లలో 8 వికెట్లకు) 298 డిక్లేర్డ్.
బౌలింగ్ : అండర్సన్ 25.3-6-53-0, రాబిన్సన్ 17-6-45-2, వుడ్ 18-4-51-3, కరణ్ 18-3-42-1, అలీ 26-1-84-2, రూట్ 5-0-9-0.