Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హద్దుమీరిన ఇంగ్లాండ్ శిబిరం ొఆవేశాన్ని ఆటలో చూపిన భారత్
' భారత్, ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్టు. ఐదో రోజు ఆట ఉదయం సెషన్. ఇంకో రెండు వికెట్లు పడితే వచ్చేది మహ్మద్ షమీనే.. పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఉత్సాహపరిస్తూ వికెట్ కీపర్ జోశ్ బట్లర్ వ్యాఖ్యలు'. మైదానంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు కోహ్లిసేనను రెచ్చగొట్టగా.. స్టాండ్స్‌లో ఇంగ్లీష్ అభిమానులు రెండు అడుగులు ముందుకేశారు. భారత ఆటగాళ్లను ఎగతాళి వేస్తూ, వెకిలి చేష్టలతో అవమాన పరిచే దుస్సహానికి పాల్పడ్డారు. గ్రౌండ్లోకి బాటిల్ మూతలు సైతం విసిరారు!'... లార్డ్స్‌లో అటు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఇటు ఇంగ్లాండ్ అభిమానులు కవ్వింపు చర్యలతో హద్దుమీరినా.. కోహ్లిసేన ఆ కసిని ఆటలోనే చూపించింది. చారిత్రక లార్డ్స్‌లో మరుపురాని విజయం అందుకుంది. తమపై విసిరిన రాళ్లనే మైలురాళ్లుగా చేసుకుని లార్డ్స్ కోటను హస్తగతం చేసుకున్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
పటౌడీ ట్రోఫీని టీమ్ ఇండియా అద్భుతంగా ఆరంభించింది. రెండో టెస్టులోనే ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ కొట్టింది. లార్డ్స్ టెస్టు సమరంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌కు షాకిచ్చి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిజానికి నాటింగ్‌హామ్‌లోనే కోహ్లిసేన 1-0 ఆధిక్యం సాధించాల్సింది!. ఆఖరు రోజు వరుణుడు అడ్డుపడకపోతే అక్కడే రూట్‌సేన గర్వాన్ని అణిచివేసేవారు!. తొలి టెస్టు ఆసాంతం కోహ్లిసేన తిరుగులేని ఆధిపత్యం చెలాయించినా.. ఇంగ్లీష్ మీడియా నాటింగ్‌హామ్‌లో ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. లార్డ్స్ టెస్టుకు ముందు భారత జట్టుకు ఎటువంటి పైచేయి లభించేందుకు మీడియా సమ్మతించలేదు. కెప్టెన్ జో రూట్ ఒక్కడి అసమాన బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి రెండు టెస్టుల్లోనూ ఆతిథ్య జట్టు గౌరవప్రద స్కోరు సాధించగలిగింది. రెండు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసిన భారత పేస్ దళం వీరత్వాన్ని గుర్తించేందుకు అక్కడి మీడియాకు మనసు రాలేదు. అయితేనేం.. లార్డ్స్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌లు ఆతిథ్య జట్టు ఇప్పట్లో మరువలేని ఓటమిని మిగిల్చారు.
ఇంగ్లాండ్ ఎక్కడ నీ క్రీడా స్ఫూర్తి? : లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఐదు వికెట్ల పతనంతో ఇంగ్లాండ్ విజయంపై నమ్మకంతో విపరీతంగా ప్రవర్తించింది. రిషబ్ పంత్, ఇషాంత్ శర్మలు క్రీజులో ఉండగానే.. రాబోయేది మహ్మద్ షమి అంటూ రెచ్చగొట్టారు. బ్యాటింగ్ లైనప్ పూర్తిగా పెవిలియన్‌కు చేరుకున్న అనంతరం.. ఇంగ్లాండ్ క్రీడా స్ఫూర్తి అంధపాతాళానికి దిగజారింది. మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రాలను అవుట్ చేసేందుకు జో రూట్ వద్ద ప్రణాళికలు కరువయ్యాయి. టెయిలెండర్లకు, ప్రత్యేక బ్యాటింగ్ నైపుణ్యం లేని బ్యాటర్లకు భీకర బౌన్సర్లు సంధించకూడదని ఐసీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా.. ఇంగ్లాండ్ పేసర్లు బౌన్సర్లతో రెచ్చిపోయారు. మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్‌లు విసిరిన బౌన్సర్లు మహ్మద్ షమి హెల్మెట్‌కు పలుమార్లు తగిలినా.. ఆతిథ్య జట్టు వెనక్కి తగ్గలేదు. మాటలతో, భీకర బౌన్సర్లతో షమి, బుమ్రాలపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. కానీ బౌండరీ లైన్‌కు క్రమం తప్పకుండా బంతులు పంపే పనిలో పడిన ఈ ద్వయం.. ఇంగ్లాండ్‌కు గర్వభంగం చేసింది. మోయిన్ అలీపై వరుసగా ఫోర్, సిక్సర్‌తో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న మహ్మద్ షమి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. భారత టెయిలెండర్లు అలా వచ్చి ఇలా వెళతారనే భ్రమలో ఉన్న ఇంగ్లాండ్.. షమి, బుమ్రా భాగస్వామ్యాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేదు. పేస్ ద్వయం అసమాన బ్యాటింగ్ ప్రదర్శన ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడా స్ఫూర్తి అసలు రంగును బయటపెట్టింది. బ్యాట్స్‌మన్‌గా మంచి ఇన్నింగ్స్ ఆడిన జో రూట్.. కెప్టెన్‌గా కెరీర్లో అత్యంత పేలవ నిర్ణయాలు తీసుకున్నాడు.
షమితో మొదలు : ఏ మహ్మద్ షమి వస్తే ఇక మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుందని భావించారో.. అదే మహ్మద్ షమి రాకతో లార్డ్స్ ఇంగ్లాండ్ గుప్పిట్లోంచి నెమ్మదిగా జారుకుంది. ప్రతికూల పరిస్థితుల్లో అత్యద్భుతంగా రాణించడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్ ఇండియా.. లార్డ్స్‌లో మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది. మహ్మద్ షమితో ప్రతిఘటన, గెలుపు కాంక్ష మొదలవ్వగా... ఆ జ్వాల ఆఖరు వికెట్ పడేంత వరకు చల్లారలేదు. 89 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కదం తొక్కిన బుమ్రా, షమి జోడీ.. ఇంగ్లాండ్ ఛేదనలో బంతితోనూ దెబ్బకొట్టారు. ఇద్దరు ఓపెనర్లను సున్నా పరుగులకే వెనక్కి పంపారు. ఆఖరు సెషన్ ఆరంభ ఓవర్లోనే జో రూట్‌ను అవుట్ చేసిన బుమ్రా.. గెలుపు దారి చూపించాడు. ఆ తర్వాతి సంగతి మియాభారు మహ్మద్ సిరాజ్ చూసుకున్నాడు. ఓకే ఓవర్లో మోయిన్ అలీ, శామ్ కరణ్‌లను అవుట్ చేసి.. అదే ప్రదర్శన మరోసారి పునరావృతం చేశాడు. జోశ్ బట్లర్, జేమ్స్ అండర్సరన్ వికెట్లతో లార్డ్స్ లాంఛనం ముగించాడు. విదేశీ గడ్డపై టెస్టు విజయాలు భారత్‌కు ఇప్పుడు కొత్త కాదు!. వరుసగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లు సాధించిన జట్టు ఇది. కానీ మైదానంలో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో అభిమానుల నుంచి కవ్వింపు చర్యలకు తప్పిదాలకు పాల్పడకుండా.. కసిని ఆటలో చూపించి ఎదురులేని సమాధానం చెప్పటం అభినందనీయం. లార్డ్స్‌లో భారత్ క్రికెట్లో పోటీపడగా.. ఇంగ్లాండ్ తప్పుడు సమరాన్ని ఎంచుకుంది. రెండో టెస్టులో ఇరు జట్లకు అదే వ్యత్యాసం!.
' జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. తొలి రోజు నుంచి మా ప్రణాళికలకు కట్టుబడి రాణించాం. తొలి మూడు రోజుల్లో బౌలర్లకు పెద్ద సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసేందుకు 60 ఓవర్లు అవసరమని భావించాం. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్ల ప్రదర్శన అమోఘం. మైదానంలో రేగిన ఉత్కంఠ మమ్మల్ని విజయం దిశగా మరింత ప్రేరేపించింది'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్