Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెన్సింగ్ ఒలింపియన్ సీఏ భవాని దేవి
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో పోటీపడిన తొలి భారత ఫెన్సర్‌గా సీఏ భవాని దేవి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ తొలి రౌండ్లో గెలుపొందిన భవాని.. రెండో రౌండ్లో వరల్డ్ నం.3 చేతిలో పరాజయం చవిచూసింది. భవాని దేవీ కత్తి సాము చూసేందుకు అభిమానులు ఉదయం 5.30 గంటలకే టెలివిజన్‌కు అతుక్కుపోయారు. నిజానికి భవాని దేవీ కత్తి సాము టీవీలో ప్రసారం కావటం అదే ప్రథమం!. ఒలింపిక్స్‌లో భవానీ దేవీ మెరుపులతో భారత్‌లో ఈ క్రీడ ప్రజల్లోకి వెళ్లింది. ఫెన్సింగ్‌ను మరింత పాపులర్ చేసేందుకు మరిన్ని పాఠశాలల్లో ఈ క్రీడను ప్రవేశపెట్టాలని భవానీ దేవీ అభిప్రాయపడింది. ' ఫెన్సింగ్ ఇప్పటికే ఆదరణ పొందుతుందని నా భావన. ఉదయం 5.30 గంటలకే మ్యాచ్ అయినా.. ఎంతోమంది నా మ్యాచ్ చూశారు. భారత్‌లో ఎక్కువగా ఫెన్సింగ్ క్యాంప్‌లు నిర్వహించాలి. ఫెన్సింగ్ టోర్నీల సమాచారం తెలియజేయాలి. సులభతరం అయ్యేంతవరకు, ప్రతిదీ కష్టమే. స్కూల్స్‌లో ఫెన్సింగ్‌ను ప్రవేశపెట్టాలి. ఫెన్సింగ్ కిట్ ఖరీదైనదే, కానీ ప్రభుత్వం, ఎన్జీవోల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకు రావచ్చు' అని భవాని దేవి తెలిపింది.