Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టుగా రాణిస్తున్న కోహ్లిసేన
- వన్ మ్యాన్ షోకు కాలం చెల్లినట్టే
కాగితంపై పులి, వన్ మ్యాన్ ఆర్మీ, పేకమేడ బ్యాటింగ్ లైనప్... ఇవీ భారత క్రికెట్ జట్టు గురించి తరచుగా వినిపించే వ్యంగ్యాస్త్రాలు. ఈ విమర్శలు వాస్తవికతకు కాస్త దగ్గరగానూ ఉన్న మాట నిజం. భారత జట్టులో దశాబ్దాలుగా కొనసాగిన వన్ మ్యాన్ ఆర్మీ ప్రదర్శనలకు తెరపడినట్టే అనిపిస్తోంది. ఇటీవల భారత జట్టు విదేశీ గడ్డపై సాధించిన రెండు చారిత్రక టెస్టు విజయాల్లో ఏ ఒక్క ఆటగాడి ఒంటరి పోరాటం లేదు. బదులుగా, జట్టులోని 11 మంది ఆటగాళ్లు గెలుపు కోసం బాధ్యత తీసుకున్నారు. భారత క్రికెట్లో నవ శకానికి ఇది నాంది అనుకోవచ్చు!.
నవతెలంగాణ క్రీడావిభాగం
సచిన్ టెండూల్కర్ అవుట్ కాగానే టీవీలు కట్టేశారు. విరాట్ కోహ్లి నిష్క్రమించగానే నిట్టూర్చారు. జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లలో ఎవరో ఒకరు మెరుపు ప్రదర్శన చేస్తేనే విజయం సాధించే రోజులు చూశారు అభిమానులు. ఇదంతా భారత క్రికెట్లో ఇక చరిత్రే కానుంది!. విరాట్ కోహ్లి అవుటైనా, రోహిత్ శర్మ విఫలమైనా.. బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. క్రీజులోకి చివరి బ్యాట్స్‌మన్ అడుగు పెట్టేవరకు గెలుపు అవకాశాలు సజీవంగానే ఉండనున్నాయి!. ఆఖరు నిమిషం వరకు విజయం కోసం భారత్ పోరాడనుంది!. ఇది అతిశయోక్తి కాదు. 2021లో భారత్ సాధించిన రెండు చారిత్రక విజయాలు ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. ఆస్ట్రేలియాపై గబ్బా టెస్టు, ఇంగ్లాండ్‌పై లార్డ్స్ టెస్టులో భారత్ అద్వితీయ విజయాలు నమోదు చేసింది. ఒంటిచేత్తో అసమాన విజయాలు సాధించిన రికార్డులు మన బ్యాట్స్‌మన్ సొంతమైనా.. ఈ రెండు అమోఘమైన విజయాల్లో జట్టులోని 11 మంది పాత్ర సుస్పష్టం. క్రికెట్ పేరుకే జట్టుగా ఆటగా మిగిలిపోతున్న తరుణంలో.. కోహ్లిసేన నిజమైన 'టీమ్ ఇండియా' ప్రేరణతో రెచ్చిపోతుంది.
ఇది కదా.. జట్టు! : స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా విజయం సాధించాలంటే జట్టులోకి కీలక ఆటగాళ్లు రాణించాలి. ప్రత్యేకించి కఠిన ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఓ టెస్టు విజయం సాధించాలంటే.. స్టార్ ఆటగాళ్లు కండ్లుచెదిరే ప్రదర్శన చేసి తీరాలి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ టెస్టులో భారత జట్టు ఇవేవీ చేయలేదు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు సాధారణ ప్రదర్శనలకే పరిమితయ్యారు. ఓ దశలో లార్డ్స్ టెస్టు భారత్ చేతుల్లోంచి జారిపోయిందనే అనిపించింది. ఏ ఒక్కరు విఫలమైనా.. జట్టు వెనుకంజ వేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శతక భాగస్వామ్యంతో కదం తొక్కినా.. మిడిల్ ఆర్డర్ మెరువలేదు. చివర్లో రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌లు జట్టుకు మంచి స్కోరు సాధించిపెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు సుమారు రెండు సెషన్ల పాటు వికెట్ కాపాడారు. లార్డ్స్ టెస్టులో భారత్ ఆశలను, తర్వాతి టెస్టులో తమ స్థానాలను సజీవంగా నిలుపుకున్నారు.
రిషబ్ పంత్ నిష్క్రమణతో డ్రెస్సింగ్‌రూమ్ సమీకరణాలు ఆధిక్యం 170-180 మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. టెయిలెండర్ల నుంచి ఏ మాత్రం పోరాటం ఆశించలేదు. ఒకవేళ మెరిసినా 200 పరుగులను ఆశించారు. అంచనాలకు భిన్నంగా షమి, బుమ్రాలు రెచ్చిపోయారు. భారత్ ఆధిక్యాన్ని 250 పరుగులు దాటించి లంచ్ విరామానికి వచ్చిన షమి, బుమ్రాలకు భారత జట్టు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం ఇచ్చింది. ఆ ఉత్సాహంలో షమి, బుమ్రాలు బంతితోనూ ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ కొట్టారు. ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసేందుకు 60 ఓవర్లు అవసరమని జట్టు భావించింది. పేసర్లు 51.5 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. లార్డ్స్ చరిత్రలోనే ఆఖరు గంటలో అద్భుత విజయాన్ని అందుకున్నారు. షమి, బుమ్రా, ఇషాంత్‌లకు తోడు మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసం సిరాజ్ దెబ్బతీశాడు. పదునైన పేస్, క్రమశిక్షణ, కచ్చితత్వం, నిలకడకు తోడు సమయస్ఫూర్తితో బంతులేసి వికెట్లు నేలకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన సిరాజ్..రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే రెండు చారిత్రక విదేశీ టెస్టు విజయాల్లో సిరాజ్ ముఖ్య భూమిక వహించటం విశేషం. మహ్మద్ సిరాజ్ ప్రదర్శనకు పెవిలియన్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ ముగ్ధుడై.. అభినందించటం గమనార్హం.
గబ్బా కోటనూ ఇలాగే : ఆస్ట్రేలియాను గబ్బాలోనూ భారత్ ఇదే రీతిలో ఓడించింది. ఆ విజయంలోనూ జట్టులోని 11 మంది పాత్రధారులు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (44) మినహా టాప్ ఆర్డర్లో ఎవరూ రాణించలేదు. వాషింగ్టన్ సుందర్ (62), శార్దుల్ ఠాకూర్ (67)లు అర్థ సెంచరీలతో జట్టుకు 336 పరుగుల భారీ స్కోరు అందించారు. సుందర్, ఠాకూర్ పోషించిన పాత్రనే లార్డ్స్‌లో షమి, బుమ్రా పునరావృతం చేశారు. ఛేదనలో శుభ్‌మన్ గిల్ (91) కదం తొక్కగా.. చతేశ్వర్ పుజారా (56) ఓ ఎండ్‌లో నిలబడగా మరో ఎండ్‌లో రిషబ్ పంత్ (89 నాటౌట్) పని పూర్తి చేశాడు. వాషింగ్టన్ సుందర్ (22) ఛేదనలో బాధ్యత తీసుకున్నాడు.
ఆస్ట్రేలియాపై గబ్బా, ఇంగ్లాండ్‌పై లార్డ్స్ విజయాల్లో ప్రత్యేకించి ఏ ఒక్క ఆటగాడి మెరుపులు లేవు. జట్టులోని అందరూ బాధ్యత తీసుకున్నారు. విజయం కోసం తమ వంతు కృషి చేశారు. అందుకే ఈ రెండు విజయాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలిపోతాయి.
' టెస్టు మ్యాచులు నెగ్గేందుకు పోరాట గుణం కావాలి. లార్డ్స్‌లో అందరూ అదే చూపించారు. ఒకరిద్దరు కాదు, 11 మంది భిన్న దశల్లో సమష్టిగా రాణించారు. బాధ్యత తీసుకునేందుకు అందరూ ముందుకు రావటం గొప్ప సంకేతం'
- రోహిత్ శర్మ
'పిచ్‌పై పేస్ లేదు, బౌన్స్ తక్కువగా ఉంది. కానీ మేమంతా (ఇషాంత్, బుమ్రా, సిరాజ్) వికెట్ లక్ష్యంగా బంతులేశాం. స్టంప్స్‌పై దాడి చేసి బ్యాట్స్‌మెన్ షాట్లు ఆడేలా చేయటం మా వ్యూహం. ఎందుకంటే, మా దగ్గర ఎక్కువ ఓవర్లు లేవు. సిరీస్‌లో ఆధిక్యం సాధించటం అతి పెద్ద ఆనందం. నమ్మశక్యంగా లేదు'
- మహ్మద్ షమి
'చిన్ననాటి నుంచి లార్డ్స్ టెస్టులు చూసేవాడిని. కానీ ఇప్పుడు ఇక్కడ ఆడటమే కాదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించటం మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఈ విజయాన్ని ఎప్పటికీ ఆస్వాదిస్తాను'
- మహ్మద్ సిరాజ్