Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మెరిసేనా?
- మొదలైన ఐసీసీ కార్యాచరణ
ఒలింపిక్స్‌లో అడుగుపెట్టేందుకు వందేండ్లకు పైగా ఎదురుచూస్తోంది వరల్డ్ క్రికెట్. 1900 ఒలింపిక్స్‌లో తళుక్కుమన్న క్రికెట్.. ఆ తర్వాత ఎన్నడూ విశ్వ క్రీడల్లో భాగంగా లేదు. క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ తీసుకొచ్చేందుకు, ఎక్కువ దేశాలకు ఆటను విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దశలో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ పావులు కదుపుతోంది. ఐసీసీ 'మిషన్ 2028' సాధ్యాసాధ్యాలు చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
టోక్యో ఒలింపిక్స్ జ్యోతి ఆర్పేసిన తర్వాతి రోజునే.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగస్వామి చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ' ఒలింపిక్స్‌ను క్రికెట్ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా చూస్తున్నామని' ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్కే ప్రకటించాడు. ఐసీసీ ప్రకటనతో విశ్వ క్రీడల్లో క్రికెట్ సాధ్యాసాధ్యాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సచిన్ టెండూల్కర్ తళుక్కున మెరిసినప్పుడు, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత మహిళల జట్టు చేరుకున్నప్పుడు.. సైతం ఒలింపిక్స్‌లో క్రికెట్ చర్చను చూశాం. ఈసారి ఐసీసీ ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణిస్తోంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసే దిశగా ఐదుగురు సభ్యుల వర్కింగ్ కమిటీని ఐసీసీ ఏర్పాటు చేసింది. ఐసీసీ బలమైన సభ్య దేశం బీసీసీఐ సైతం ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు సై అంటోంది. 'ఒలింపిక్స్‌లో క్రికెట్‌పై ఐసీసీ, బీసీసీఐ ఒకే మాటపై ఉన్నాయి' అని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. అంతర్జాతీయ మెగా స్పోర్ట్స్ ఈవెంట్లలో క్రికెట్ భాగస్వామ్యంపై బీసీసీఐకి మిశ్రమ ఆలోచనలు ఉన్నాయి. అయినా, ఒలింపిక్స్ విషయంలో ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు వైఖరిలో మార్పు కనిపిస్తోంది.
అసలు సాధ్యమేనా? : ఒలింపిక్స్‌లో క్రికెట్ చర్చ ఎప్పుడు మొదలైనా.. అది అసాధ్యమనే వాదన సైతం బలంగానే వినిపిస్తోంది. ఎందుకంటే క్రికెట్ నిజానికి గ్లోబల్ స్పోర్ట్ కాదు. క్రికెట్‌కు ప్రపంచకప్‌లు చాలు, కొత్తగా మరో మెగా ఈవెంట్ అక్కర్లేదనే భావన ఉంది. ఒలింపిక్స్ క్రికెట్లో ఎన్ని దేశాలు పోటీపడాలి? ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ తరహాలో ఎనిమిది జట్లా? ఒలింపిక్స్‌కు ఏ విధంగా అర్హత సాధించాలి? టెస్టు, వన్డే జట్టు హౌదా అర్హతకు ప్రామాణికమా? అదే అయితే ఒలింపిక్స్ నియమాలకే విరుద్ధం అవుతుంది. ఏ ఫార్మాట్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతారు. నాలుగు గంటల టీ20 ఫార్మాట్ లేదా ది హండ్రెడ్? గతంలో టీ20 ఫార్మాట్‌ను ప్రత్యామ్నాయంగా చూపించారు. దీనికి తోడు లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్ మ్యాచులకు పిచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు పిచ్‌లు ఉన్నాయా?. ఇక్కడి డాడ్గర్ స్టేడియంను గతంలో క్రికెట్ మ్యాచ్‌లకు వినియోగించేవారు. ఇప్పుడు బేస్‌బాల్‌కు వాడుతున్నారు. స్టేడియం సమస్య లేకపోయినా.. ప్రాక్టీస్ పిచ్‌లను ఏర్పాటు సవాల్‌గా నిలువనుంది.
భిన్నమైన అనుభూతి! : ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విలాసవంతమైన హొటళ్లు, ప్రయివేటు స్విమ్మింగ్‌పూల్స్, వ్యాయామశాలలు క్రికెటర్లకు అందుబాటులో ఉంటాయి. ఒలింపిక్స్‌లో అటువంటి ప్రత్యేక గుర్తింపు ఉండదు. పొడవాటి క్యూ లైన్లలో భోజనం కోసం నిల్చోవాలి. ఎవరి కిట్లు, బ్యాగులు వారే మోయాలి. ఇద్దరు, ముగ్గురుతో గదిని పంచుకోవాలి. ఎటువంటి రూమ్ సర్వీస్ సదుపాయం ఉండదు. సూపర్‌స్టార్ స్టేటస్ అనుభవించే క్రికెటర్లు.. ఒలింపిక్స్‌లో క్రీడా సముద్రంలో కలిసిపోవాలి. భారత జాతీయ జెండాతో ఆరంభ వేడుకలకు హాజరు కావటం, మన దేశానికి చెందిన క్రీడాకారులతో అందరీతో మమేకం కావటం, ఇతర క్రీడలకు చెందిన ప్రపంచ అథ్లెట్లతో ప్రత్యక్షంగా మాట్లాడటం వంటివి భిన్నమైన అనుభూతిని మిగుల్చుతాయని 1998 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వీవీఎస్ లక్ష్మణ్, హర్బజన్ సింగ్‌లు అన్నారు.
ఆదాయానికి రెక్కలు: క్రికెట్‌కు ఎక్కువ దేశాల్లో ఆదరణ లేకపోయినా ఆదాయ పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒలింపిక్స్, ఫిఫా తర్వాత ఐసీసీ అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. 2020-2032 ఒలింపిక్స్‌కు ఐఓసీ గ్లోబల్ మీడియా హక్కులను అమెరికా ప్రసారదారు ఎన్బీసీ సుమారు రూ.53 వేల కోట్లకు సొంతం చేసుకుంది. ఫిఫా 2018-2022 ప్రపంచకప్ మీడియా హక్కులు సుమారు రూ.13 వేల కోట్లకు అమ్మేసింది. ఇదే సమయంలో 2007-15 సమయంలో ఐసీసీ గ్లోబల్ టోర్నీల మీడియా హక్కులను సుమారు రూ.12 వేల కోట్లకు కట్టబెట్టింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరికతో దక్షిణాసియా, ప్రత్యేకించి భారత్‌లో మీడియా హక్కులకు రెక్కలు రానున్నాయి. క్రికెట్ రాకతో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఆదాయం సైతం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గొడుగు కింద ఐసీసీ వస్తే ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ ఆదాయం సైతం మెరుగుపడనుంది. ఐఓసీ ప్రణాళిక కింద ఇతర దేశాలకు నిధులు లభిస్తాయి. జాతీయ ఒలింపిక్ సంఘం నుంచి చిన్న దేశాల్లో క్రికెట్ అభివృద్దికి నిధులు సమకూరుతాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో ఇటు ఐసీసీ, అటు ఐఓసీ ఆర్థికంగా లబ్ది పొందనున్నాయి.
రూల్స్ ఎలా ఉన్నాయి? : ఒలింపిక్ చార్టర్ ప్రకారం ఏదేని క్రీడ విశ్వ క్రీడల్లో భాగం కావాలంటే కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. 2018 చార్టర్ ప్రకారం కనీసం నాలుగు ఖండాల్లో కలిపి సుమారు 75 దేశాల్లో ఆ క్రీడను ఆడాలి. మహిళల విభాగంలో 40 దేశాలు ఆడితే సరిపోతుంది. లింగ సమానత్వంపై ప్రభావం, యూత్ అప్పీల్, వారసత్వ విలువ ప్రకారం క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడల్లో భాగం చేసేందుకు అవకాశం ఉంటుంది. క్రికెట్లో మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో రెండే విభాగాలు ఉంటాయి. దీంతో క్రికెట్‌కు రెండు పసిడి పతకాలు కేటాయిస్తే సరిపోతుంది. ఒలింపిక్స్‌లో 310 మెడల్ ఈవెంట్లు, 10,500 మంది అథ్లెట్లకు పరిమితి ఉంది. టోక్యోలో ఈ గణాంకాలు మించిపోయాయి. 338 మెడల్ ఈవెంట్లు, 11656 అథ్లెట్లు పాల్గొన్నారు. ఇదే సమయంలో ఐసీసీ క్రికెట్‌ను కొత్త దేశాలకు విస్తరించేందుకు నడుం బిగించింది. 2027 వన్డే వరల్డ్‌కప్ నుంచి ప్రాతినిథ్య దేశాల సంఖ్యను 14కు పెంచనుంది. 2024 టీ20 ప్రపంచకప్ నుంచి పోటీపడే దేశాల సంఖ్యను 16 నుంచి 20కి పెంచనుంది. రానున్న బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌ను ఒలింపిక్ ట్రయల్‌గా ఐసీసీ పరిగణిస్తోంది. ఇక్కడ సక్సెస్ సాధిస్తే.. తర్వాతి అడుగు లాస్ ఏంజిల్స్‌లోనే వేయాలని ప్రణాళిక రచిస్తోంది.
1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ఇప్పటికీ ఎంతో మార్పు చోటుచేసుకుంది. క్రికెట్ సాంకేతికంగా ఉన్నతి స్థితికి చేరుకుంది. పరిమిత దేశాలు మాత్రమే ఆడుతున్న క్రికెట్లో ఒలింపిక్ పతకం విడ్డూరమే అనిపించవచ్చు. పది దేశాలు సైతం పోటీపడని విభాగంలో ఒలింపిక్ చాంపియన్స్ సమంజసంగా అనిపించదు. అలాగని, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చకపోవటం అర్థవంతం కాదు. ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ ఆడితేనే 200కు పైగా దేశాలు ఆటను వీక్షిస్తాయి. క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభిస్తుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైతే.. పసిడి కోసం క్రికెటర్లు సరికొత్త పోరాటానికి తెరలేపుతారు అనటంలో సందేహం లేదు.