Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీ ట్రోఫీ షెడ్యూల్లో మార్పులు
- బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ షెడ్యూల్ మారింది. నవంబర్ 16న ఆరంభం కావాల్సిన రంజీ సమరం రాష్ట్ర క్రికెట్ సంఘాల సూచనల మేరకు ముందుకు జరిపారు. దీంతో ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ సీజన్ టీ20 ఫార్మాట్‌తో ఆరంభం కానుంది. రంజీ ట్రోఫీ 2022 జనవరి 5 నుంచి ఆరంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 27న, విజరు హజారే ట్రోఫీ డిసెంబర్ 1న ఆరంభం కానున్నాయి.
నవతెలంగాణ-ముంబయి
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది రద్దు అయిన రంజీ ట్రోఫీ.. ఈ ఏడాదిలో ఆరంభం కావటం లేదు. పూర్తిస్థాయి దేశవాళీ క్రికెట్ సీజన్‌కు కట్టుబడుతూ బీసీసీఐ గతంలో షెడ్యూల్ విడుదల చేసింది. రంజీ ట్రోఫీ సన్నద్ధతకు మరింత సమయం అవసరమని రాష్ట్ర క్రికెట్ సంఘాలు కోరటంతో బీసీసీఐ ఆ మేరకు షెడ్యూల్లో మార్పులు చేసింది. భారత్, ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్టును వీక్షించేందుకు లండన్‌కు వెళ్లిన బోర్డు కార్యదర్శి జై షా.. స్వదేశానికి తిరుగు పయనమైన తరుణంలో దేశవాళీ క్రికెట్ సీజన్ నూతన షెడ్యూల్‌ను విడుదల చేశారు. నూతన షెడ్యూల్ ప్రకారం 2022 జనవరి 5న ఆరంభం కానున్న రంజీ ట్రోఫీ మార్చి 20, 2022న ఫైనల్‌తో ముగియనుంది. ' సురక్షిత వాతావరణంలో పూర్తి స్థాయి దేశవాళీ సీజన్ నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి బీసీసీఐ పని చేస్తుంది. అండర్-19 టోర్నీలతో ఈ ఏడాది దేశవాళీ సీజన్ షురూ కానుంది. కోవిడ్ ముప్పు సవాల్ విసురుతున్న సమయంలో అన్ని జాగ్రత్తలు, మార్గదర్శకాలు పాటిస్తూ సీజన్‌ను విజయవంతం చేయటంపై దృష్టి సారించాం. అందరితో సంప్రదింపుల అనంతరం షెడ్యూల్లోనూ మార్పులు చేశాం. ప్రతి టోర్నీమెంట్ సమగ్రతను కాపాడేందుకు బీసీసీఐ కట్టుబడి ఉంది. ఈ ఏడాది పూర్తి స్థాయి దేశవాళీ సీజన్‌ను నిర్వహిస్తున్నాం' అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు.
ఆటగాళ్లలో అసంతృప్తి : కోవిడ్ దెబ్బకు నిరుడు రంజీ ట్రోఫీ చోటుచేసుకోలేదు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ సీజన్‌కు సన్నద్ధం అయ్యేందుకు క్రికెటర్లకు కొంత సమయం అవసరం. అందుకే ముందుగా టీ20 టోర్నీ, వన్డే టోర్నీలు నిర్వహించి.. చివరగా రంజీ ట్రోఫీకి తెరలేపనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రంజీ ట్రోఫీ సహా ఇతర టోర్నీల ఫార్మాట్లను బీసీసీఐ మార్చివేసింది. దీంతో ఆటగాళ్లు అసంతృప్తికి లోనవుతున్నారు. నూతన ఫార్మాట్లో 38 జట్లను ఐదు ఎలైట్ (ప్రతి గ్రూప్‌లో ఆరు జట్లు), ఓ ప్లేట్ (ఎనిమిది జట్లు)గా విభజించారు. ఎలైట్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంటాయి. ప్లేట్ గ్రూప్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టు, ఎలైట్ గ్రూప్‌ల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లు మిగతా మూడు క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్‌ల కోసం ప్రీ క్వార్టర్స్‌లో పోటీపడాల్సి ఉంటుంది. కొత్త విధానంతో గ్రూప్ దశలో ప్రతి జట్టుకు ఐదు మ్యాచులు దక్కనున్నాయి. రంజీ ట్రోఫీ సహా విజరు హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ ఇదే ఫార్మాట్‌ను అనుసరించనున్నారు. ఈ విధానంతో గ్రూప్ దశలో ఆడే మ్యాచుల సంఖ్య తగ్గుతుంది. మ్యాచ్‌ల సంఖ్య తగ్గటంతో మ్యాచ్ ఫీజుల రూపంలో దేశవాళీ క్రికెటర్లకు రావాల్సిన విలువైన సొమ్ము దూరం కానుంది. అసలే దేశవాళీ సీజన్ లేక ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న క్రికెటర్లు.. ఇప్పుడు కొత్త ఫార్మాట్‌తో మ్యాచ్ ఫీజుల రూపంలో ఆశించిన మొత్తాన్ని అందుకునే అవకాశం కోల్పోతున్నారు. పాత ఫార్మాట్లో 38 జట్లను మూడు ఎలైట్ గ్రూప్‌లు, ఓ ప్లేట్ గ్రూప్‌గా విభజించారు. ఎలైట్ విభాగంలో గ్రూప్‌కు కనీసం ఎనిమిది జట్లు, ప్లేట్ విభాగంలోని గ్రూప్‌లో తొమ్మిది జట్లు ఉండేవి. దీంతో గ్రూప్ దశలో ఆడాల్సిన మ్యాచ్‌ల సంఖ్య పెరిగి, క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో ఆదాయం లభించేంది.
అండర్-19లో ఓ ఏడాది అదనం : దేశవాళీ సీజన్ కోవిడ్ ధాటికి ప్రభావితం కావటంతో జూనియర్ క్రికెట్ విభాగంలో బీసీసీఐ పలు వెసులుబాట్లు కల్పించనుంది. నిబంధనల ప్రకారం అండర్-19 స్థాయిలో ఓ క్రికెటర్ గరిష్టంగా నాలుగు సీజన్లు మాత్రమే పోటీపడేందుకు అర్హుడు. గతేడాది సీజన్ కోల్పోయిన ఆటగాళ్ల కోసం బీసీసీఐ నిబంధనలను సవరించింది. దీంతో వచ్చే ఏడాది కరీబియన్ దీవుల్లో జరుగనున్న అండర్-19 ప్రపంచకప్‌లో చోటు ఆశిస్తున్న వర్థమాన జూనియర్ క్రికెటర్లకు ఊరట లభించనుంది. అండర్-16 విభాగంలో విజరు మర్చంట్ ట్రోఫీ షెడ్యూల్ చేయటంతో ఈ టోర్నీపై నెలకొన అనిశ్చితికి తెరపడింది. 18 ఏండ్ల లోపు వారికి వ్యాక్సిన్ లేకపోవటంతో విజరు మర్చంట్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
జట్టులో 30 మందికే చోటు : బయో సెక్యూర్ బబుల్‌లో జరుగుతున్న దేశవాళీ సీజన్‌కు బీసీసీఐ పలు నూతన నిబంధనలు విధించింది. రంజీ ట్రోఫీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో ఉండాల్సిన సభ్యుల సంఖ్యపై పరిమితి విధించింది. రాష్ట్ర జట్టులో కనీసం 20 మంది క్రికెటర్లు ఉండాలి. సహాయక సిబ్బంది సంఖ్య 10 మందికి మించకూడదు. ఫిజియోథెరపిస్ట్‌కు అదనంగా జనరల్ ఫిజిషియన్‌ను నియమించాలి. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఫీజులు పెంచుతారా? : 2020-21 రంజీ ట్రోఫీ సీజన్ రద్దుగా ముగిసింది. దేశవాళీ క్రికెట్ సీజన్ మ్యాచ్ ఫీజులపైనే ఆధారపడిన వర్ధమాన క్రికెటర్లను ఆర్థికంగా ఆదుకునేందుకు నష్ట పరిహారం చెల్లిస్తామని బీసీసీఐ ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదు. దేశవాళీ క్రికెట్ సీజన్ పర్యవేక్షణ, క్రికెటర్లకు నష్ట పరిహారం చెల్లింపు సహా ఇతర అంశాలపై ఏర్పాటైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత సీజన్‌కు నష్ట పరిహారం చెల్లింపు విధానం సహా ఈ సీజన్లో మ్యాచ్‌ల సంఖ్య తగ్గటంతో మ్యాచ్ ఫీజులను పెంచే విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలి. వర్కింగ్ కమిటీ ఇప్పటివరకు ఎన్నిసార్లు సమావేశమైంది, ఏ అంశాలపై చర్చించిందనే విషయాలు బీసీసీఐ వెల్లడించలేదు.