Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచిన్‌కు ఆఫ్ స్పిన్ బలహీనత
- బ్రయాన్ లారాకు బౌలింగ్ కష్టం
- స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్
ప్రపంచ క్రికెట్ చూసిన భీకర మాయగాడు ముత్తయ్య మురళీధరన్. అన్ని దేశాలపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించిన ముత్తయ్య మురళీధరన్ కెరీర్లో ఎంతో మంది ఉత్తమ బ్యాట్స్‌మెన్‌కు బంతులేశాడు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరెందర్ సెహ్వాగ్ సహా ఇతర బ్యాట్స్మెన్లతో ఆడినప్పుడు తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మనసు విప్పి మాట్లాడాడు. ఆ విషయాలు ఇవిగో..
నవతెలంగాణ-ముంబయి
సెహ్వాగ్ శతకాలను లెక్క చేయడు : ప్రపంచ క్రికెట్లో కొంత మంది బ్యాట్స్‌మెన్ ఉంటారు. బౌలర్‌కు గౌరవం, మంచి బంతులపై సహనం, సులువైన బౌలర్ వచ్చే వరకు ఎదురుచూసే ఓపిక ఇవేవీ ఉండవు. వారిలో ముందు వరుసలో ఉంటాడు వీరెందర్ సెహ్వాగ్. నన్ను సెహ్వాగ్ బాధపెట్టినంతలా, మరో బ్యాట్స్‌మన్ చేయలేదు. శతకానికి నాలుగు, ఐదు పరుగుల దూరంలో ఉన్నప్పుడు అందరూ సింగిల్స్ కోసం చూస్తారు. సెహ్వాగ్‌కు అవేవీ పట్టవు. 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్‌తో శతకం పూర్తి చేశాడు. శతకం చేసినా, శతకం చేజారినా అతడు లెక్క చేయడు. సెహ్వాగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలేవీ చేసుకోవు. ఎందుకంటే అవేవీ అతడు గౌరవించడు. డీప్ లాంగ్‌ఆన్‌లో ఫీల్డర్లను మొహరించి బౌలింగ్ చేస్తాను. అప్పుడు అతడు సరిగా కొట్టకపోతే అవుటైతాననే భయం పొందుతాడు. అంతకు మించి వీరూపై వ్యూహం ఏదీ పని చేయదు. కొన్ని చెత్తగా వికెట్ కోల్పోయినా.. సెహ్వాగ్‌ను అవుట్ చేయటం అంత సులువు కాదు.
సచిన్‌కు ఆఫ్ స్పిన్ బలహీనత! : సచిన్ టెండూల్కర్ అంటే నాకు భయం లేదు. ఎందుకంటే అతడు నన్ను వీరెందర్ సెహ్వాగ్ తరహాలో దెబ్బకొట్టలేదు. సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడు. కానీ అతడికి ఆఫ్ స్పిన్ బలహీనత ఉందని నా భావన. అందుకే సచిన్ టెండూల్కర్ అదే తరహాలో పలుమార్లు అవుట్ చేశాను. సచిన్ నన్ను చీల్చి చెండాడలేదు కానీ అతడి వికెట్ కోసం చాలా చెమటోడ్చాల్సి వచ్చేది.
లారా తెలివైన ఆటగాడు : నేను ఎదుర్కొన్న బ్యాట్స్‌మన్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అత్యంత ప్రమాకారి. వెస్టిండీస్, శ్రీలంక టెస్టు సిరీస్‌లను మేము సొంతం చేసుకున్నా.. అతడు మాత్రం శతకాలు, ద్వి శతకాలు బాదుతూ ఉండేవాడు. ఎవరి బౌలింగ్‌లో పరుగులు రాబట్టుకోవాలనే విషయంపై లారాకు ఓ స్పష్టత ఉండేది. ఓ సెషన్లో నేను చమిందా వాస్ కలిపి 20 ఓవర్ల వరకు వేసేవాళ్లం. చమిందా వాస్ బౌలింగ్‌ను కాచుకునే లారా.. ఇతర బౌలర్లపై పరుగుల వేటకు దిగేవాడు. లారాను అవుట్ చేయటం ఎంతో కష్టమైన పనిగా ఉండేది. ఎందుకంటే అతడు నా బౌలింగ్‌ను చదివేశాడు. నేను ఎటువంటి బంతి వేయబోతున్నాననే విషయం ముందుగానే పసిగట్టేవాడు. నా వ్యూహం, నైపుణ్యంతో లారాను అవుట్ చేయటం అసాధ్యంగా ఉండేది. అందుకే లారా పొరపాటు చేసే వరకు ఎదురుచూసేవాళ్లం. లారాను అవుట్ చేసేందుకు ఓ టెస్టులో వేసిన ప్రణాళిక బెడిసికొట్టింది. అద్భుతమైన బంతులను వరుసగా బౌండరీలు బాదాడు. తర్వాత లారాను ఈ విషయాన్ని అడిగాను. 'గ్యారీ సోబర్స్ నాకు ఈ సలహా ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్‌ను ఆడేటప్పుడు.. స్ట్రయిట్ బాల్స్‌ను ఎదుర్కొనే స్టాన్స్లోనే ఉండాలని సూచించాడు. స్పిన్ అవకుంటే ఆ బంతిని ఎలా ఆడతామో, అలాగే స్టాన్స్ మార్పు చేసుకుని ఆడాలని చెప్పాడు' అని లారా నాతో అన్నాడు. లారా నా బౌలింగ్‌ను చదివేయటంతో అతడికి బౌలింగ్ సవాల్‌గా ఉండేది.
కోహ్లి, బాబర్ బెటర్! : ఆధునిక క్రికెట్లో జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సహా విరాట్ కోహ్లి, బాబర్ ఆజామ్‌లు అత్యుత్తంగా రాణిస్తున్నారు. సహజంగానే ఉపఖండపు బ్యాట్స్‌మెన్‌కు స్పిన్‌పై మంచి పట్టు ఉంటుంది. జో రూట్, స్టీవ్ స్మిత్‌లు మంచి ఆటగాళ్లే, కానీ స్పిన్‌పై స్వీప్ షాట్లు ఆడతారు. విరాట్ కోహ్లితో నేను ఆడాను. నెట్స్‌లో బౌలింగ్ చేశాను. వన్డేలు, టీ20ల్లో దూకుడుగా ఆడి వికెట్ ఇస్తాడేమో కానీ.. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లిని అవుట్ చేయటం కష్టం. అతడు బంతులను చదువుతాడు. స్పిన్‌ను నేరుగా ఆడతాడు. అడ్డంగా షాట్లు కొట్టడు. విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడానికి కష్టపడేవాడిని!. బాబర్ ఆజామ్ ఆటను చూశాను. అతడూ స్పిన్‌ను బాగా ఆడతాడు. ఆధునిక బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లి, బాబర్ ఆజామ్‌లకు బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చేది.