Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్స్ నేరుగా జోక్యం చేసుకుంటుంది
- జెఎస్డబ్ల్యూ, ఓజీక్యూ అవసరం ఏముంది
- భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించే అథ్లెట్లను తయారు చేసేందుకు టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్) సహా ఇతర సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. ఒలింపిక్ గోల్డ్ క్వీస్ట్ సంస్థ జూనియర్ స్థాయి నుంచే ప్రతిభావంతులైన అథ్లెట్లకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. అథ్లెట్లకు అన్ని విధాలుగా అండగా నిలువటంలో జెఎస్డబ్ల్యూ మంచి పేరు గడించింది. చాంపియన్లను తయారు చేయటంలో టాప్స్, ఇతర సంస్థలు కష్టపడి పని చేస్తుంటే...తమకు గుర్తింపు రావటం లేదని, పూర్తిగా పక్కనపెడుతున్నారని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఓ ఆంగ్ల పత్రికకు బ్రిజ్ భూషణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు...
- వినేశ్ ఫోగట్ విషయంలో ఏం చేయబోతున్నారు?
క్రమశిక్షణ కమిటీకి ఈ అంశాన్ని బదిలీ చేశాం. వినేశ్, సోనమ్, దివ్యలను కమిటీ పిలిచి విచారిస్తుంది. తప్పు చేశాను అని ఓ మాట చెప్పటం సులువు. కానీ ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇతర రెజ్లర్లకు వైరస్ ప్రమాదం ఉందని భారత క్యాంప్‌కు దూరంగా ఉన్నానని లాయర్ ద్వారా తెలియజేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఒలింపిక్స్‌లో ఒలింపిక్ సంఘం రూపొందించిన జెర్సీలను ఎందుకు ధరించలేదు? వినేశ్ చేసిన పనికి నాకు ఏం జరిగిందో ఆమెకు తెలియాలి.
- ఆ విషయంలో మీకు ఏమైంది?
దీపక్ పూనియా కోచ్ ఓ అధికారిపై చేసుకున్న అనంతరం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారుల ముందు హాజరయ్యాను. ఒలింపిక్స్ నుంచి జట్టును సస్పెండ్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాను. ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరుగలేదని వివరించాను. ' ఓ రెజ్లర్ అధికారిక జెర్సీ ధరించటం లేదు. నీవు ఎలా ఫెడరేషన్‌ను నడుపుతున్నావు? అని ప్రశ్నించారు. వినేశ్ ఫోగట్ టోక్యోలో పతకం సాధించినా, వెనక్కి తీసుకునేవారు. ఇది చిన్న విషయం కాదు. కమిటీ ముందు ప్రాధేయపడాల్సి వచ్చింది.
- టోక్యో ఒలింపిక్ బృందంలో లింగ అసమానత ఉందని అనుకుంటున్నారా?
టోక్యో ఒలింపిక్స్ బృందంపై భారత ఒలింపిక్ సంఘం పరిమితులు విధించింది. ఎంత మంది కోచ్‌లు, ఎంత మంది ఫిజయోలు వెళ్లాలనే విషయంలో షరతులు ఉన్నాయి. (నలుగురు మహిళా రెజ్లర్లకు కలిపి ఒకే కోచ్ ఉండగా.. నలుగురు పురుష రెజ్లర్లకు ఏడుగురు కోచ్‌లు, సహాయక సిబ్బంది ఉన్నారు). వ్యక్తిగత కోచ్, ఫిజియో గురించి వినేశ్ ఫెడరేషన్‌కు ఎటువంటి ఈమెయిల్ పంపలేదు. టాప్స్‌కు మాత్రమే పంపింది. ఫెడరేషన్‌కు ఈమెయిల్ చేయకుంటే మాకు ఎలా తెలుస్తుంది.
- ఈ సమస్య ప్రణాళికకు సంబంధించినది కాదు. టాప్స్‌కు సమాచారం ఇవ్వటమా?
వినేశ్ నేరుగా ఎన్నడూ ఫెడరేషన్‌ను సంప్రదించలేదు. టాప్స్‌పై నాకున్న అభ్యంతరం ఇదే. టాప్స్ నేరుగా శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఏ అథ్లెట్ ఎక్కడ, ఎప్పుడు శిక్షణ తీసుకోవాలనే విషయాలను నిర్దేశిస్తుంది. అదే సమాచారం మాకు (ఫెడరేషన్)కు ఇస్తే, మా టీమ్ మొత్తాన్ని పంపేవాడిని. బజరంగ్, వినేశ్‌లు సీనియర్ రెజ్లర్లు. ఒలింపిక్స్‌కు టాప్ ర్యాంకింగ్‌తో వెళ్లారు. భవిష్యత్‌కు మంచిదనుకున్న ప్రణాళికను వారు టాప్స్‌కు చెప్పారు, మరి మాకు ఎవరు చెప్పాలి?!. రెజ్లింగ్‌లో టాప్స్ పథకం కచ్చితంగా ఉండాలి. కానీ ప్రణాళికల్లో ఫెడరేషన్, చీఫ్ కోచ్‌లను భాగం చేయాలి.
- ఓజీక్యూ, జెఎస్డబ్ల్యూ పాత్రను ఏ విధంగా చూస్తారు?
మాకు ఓజీక్యూ, జెఎస్డబ్ల్యూ అవసరం లేదు. వారు ముగ్గురు రెజ్లర్ల కెరీర్‌ను నాశనం చేశారు. అథ్లెట్లపై ఖర్చు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ల అవసరం ఎవరికి ఉంటుంది? జూనియర్ స్థాయి రెజ్లర్లకు వారి మద్దతు అవసరం. పతకాలు సాధించడానికి సిద్ధంగా ఉన్న అథ్లెట్లకు వాళ్ల సహాయం ఎందుకు? రెజ్లర్లపై ప్రభుత్వం రూ.85 కోట్లు వెచ్చించింది. ఈ సంస్థలు ఆ మేరకు ఖర్చు చేయలేవు. స్పేరింగ్ పార్ట్‌నర్స్‌గా ఎవరిని పంపిస్తున్నారనే విషయాన్ని మాకు తెలియజేయటం లేదు. ఇదే నా అతిపెద్ద సమస్య. రవి కుమార్ దహియా వంటి రెజ్లర్లకు ఫెడరేషన్ నెలకు రూ. 1 లక్ష అందిస్తోంది. ఇంకా ఎన్ని చోట్ల నుంచి సహాయం అవసరం? రెజ్లర్లకు ఏదైనా ఇచ్చేందుకు సమాఖ్య సిద్ధంగా ఉంది. ఏ అథ్లెట్ అయినా ఈ సంస్థలతో కలిసి పని చేస్తే భారత్‌కు ఆడకుండా నిషేధం విధిస్తాం.