Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖేల్‌రత్న పేరు మార్పుపై ప్రధాని కార్యాలయం
న్యూఢిల్లీ : ప్రధాని కార్యాలయం (పీఎంవో) గత కొన్నేండ్లుగా సమాచార హక్కు చట్టం 2005ను క్రమం తప్పకుండా తుంగలో తొక్కుతూనే ఉంది. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరుతున్న ప్రశ్నలకు పీఎంవో నుంచి వస్తున్న సమాధానలు చట్టవిరుద్ధమే కాదు అసత్య పూరితంగానూ ఉంటున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని ప్రధాని కార్యాలయం అపహాస్యం చేసిన మరో సంఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న పురస్కారం పేరు మార్పు చేస్తూ ఇటీవల ప్రధాని నరెంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు కోసం ప్రధాని కార్యాలయానికి ఎన్ని వినతులు వచ్చాయి, వాటి ప్రతులు అందజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా.. సమాచారం ఇచ్చేందుకు పీఎంఓ నిరాకరించింది.
హాకీ దిగ్గజం, భారత స్పోర్ట్స్ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతున్నారు. ఆ రోజున జాతీయ క్రీడా పురస్కారాలు ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య పురస్కారాలు అందజేస్తున్నారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్‌ను పక్కనపెట్టి.. ఖేల్‌రత్న పురస్కారం పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోడీ. ' ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు చేయాలని ప్రజల నుంచి ఎన్నో వినతులు అందుకున్నాను. తమ అభిప్రాయాలను వెల్లడించిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజాభిష్టానికి విలువిస్తూ ఖేల్ రత్న పురస్కారాన్ని ఇక నుంచి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్పు చేస్తున్నాను' అని మోడీ ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీకి క్రీడలతో నేరుగా ఎటువంటి సంబంధం లేనందున ఖేల్‌రత్న పురస్కార పేరు మార్చేందుకు 2019 ఫిబ్రవరిలో క్రీడా మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. భారతీయ ఖేల్‌రత్న అవార్డుగా పేరు మార్పు చేసేందుకు కమిటీలో ప్రతిపాదనలు వచ్చినా.. రాజీవ్‌గాంధీ ఖేల్రత్నగానే ఉంచేందుకు కమిటీ ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకుంది. ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ స్టేడియాన్ని ఇటీవల ప్రధాని నరెంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్పు చేశారు. ఖేల్‌రత్న పురస్కారం పేరు మార్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. దేశంలో క్రీడా మైదానాలకు దిగ్గజ క్రీడాకారుల పేర్లనే పెట్టాలనే డిమాండ్ ఊపందుకున్న తరుణంలో.. ఏ వినతుల స్వీకరణ ద్వారా ప్రధాని మోడీ ఖేల్‌రత్న పురస్కారం మార్చుతూ నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించేందుకు ప్రధాని కార్యాలయం నిరాకరించటం గమనార్హం.