Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎదురులేని భారత పేస్ దళం
- బుమ్రా, షమి, ఇషాంత్, సిరాజ్ అద్భుతం
2018 ఇంగ్లాండ్ పర్యటన. తొలి రెండు టెస్టులు ముగిసే సమయానికి భారత్ 0-2తో వెనుకంజలో పడిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో శతకాలు బాదినా.. టీమ్ ఇండియాకు ఊరట లభించలేదు.
2021 ఇంగ్లాండ్ పర్యటన. నాటింగ్‌హామ్, లార్డ్స్ టెస్టులు ముగిశాయి. ఆతిథ్య జట్టును మట్టికరిపించి భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టెస్టు ఐదో రోజు వరుణుడు అడ్డుపడకుంటే ఫలితం 2-0గా ఉండేదే!. కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో లేడు, పరుగుల వేటలో తడబడుతున్నాడు. అయినా పటౌడీ ట్రోఫీ వేటలో భారత్ దూసుకెళ్తోంది. మూడేండ్లలో టీమ్ ఇండియాలో కనిపిస్తోన్న మార్పు.. ఎదురులేని పేస్ దళం.
నవతెలంగాణ క్రీడావిభాగం
దక్షిణాఫ్రికా, భారత్ కేప్‌టౌన్ టెస్టు (2018). ఆతిథ్య సఫారీ జట్టు నలుగురు పేస్ బౌలర్లను బరిలో నిలిపింది. డేల్ స్టెయిన్, వెర్నర్ ఫిలాండర్, కగిసో రబాడ, మెర్నీ మోర్కెల్ తుది జట్టులో ఉన్నారు. సీమ్, స్వింగ్, పేస్, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను వేటాడే ప్రమాదకర పేస్ కళయిక. బంతి బంతికీ బ్యాట్స్‌మెన్‌ను ఇరకాటంలో పెడుతూ కేప్‌టౌన్‌లో ఆ నలుగురు చేసిన అరాచకం మరిచిపోలేం. ఆ టెస్టులో దక్షిణాఫ్రికా నలుగురు పేసర్లను దించగా.. వెంటనే ఫోకస్ భారత జట్టు తర్వాతి పర్యటన ఆస్ట్రేలియాపై పడింది. పాట్ కమిన్స్, జోశ్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్స్క్, జేమ్స్ పాటిన్సన్లతో కూడిన ఆసీస్ పేస్ విభాగంపై పడింది. న్యూలాండ్స్‌లో భారత్ తొలిసారి జశ్‌ప్రీత్ బుమ్రాకు బంతి అందించింది. టెస్టుల్లో బుమ్రా అరంగేట్రంపై క్రికెట్ పండితుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ మున్ముందు ఏం జరుగుతుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు!. సఫారీతో సిరీస్‌లో మూడో, చివరి టెస్టులో భారత్ సైతం నలుగురు పేసర్లను బరిలోకి దింపింది. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లు పచ్చికతో కూడిన జొహనెస్‌బర్గ్ పిచ్‌పై బంతి అందుకున్నారు. భారత పేస్ దళానికి సఫారీ బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేసింది. ఆ టెస్టులో భారత్ ఊరట విజయం అందుకుంది, కానీ సిరీస్ అప్పటికే సఫారీ వశమైంది. ఆ టెస్టు విజయం భారత్‌కు దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ విజయాన్ని అందివ్వలేకపోయింది. కానీ విదేశీ గడ్డపై చారిత్రక సిరీస్‌లు విజయాలు సాధించగలమనే దీమాను కలిగించింది!.
అంచనాలకు అందని అద్భుతం : సఫారీ పర్యటన ముగిసిన మూడున్నర సంవత్సరాలు గడుస్తోంది. అప్పటి నుంచి భారత్ విదేశీ గడ్డపై వరుస విజయాలు సాధిస్తూనే ఉంది. ఆస్ట్రేలియాలో ఏకంగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై ఆతిథ్య జట్టుకు కొరకరాని కొయ్యగా తయారైంది. భారత భీకర పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. చారిత్రక బ్రిస్బేన్ టెస్టులో నలుగురు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోయినా.. టీమ్ ఇండియా విజయం సాధించింది. 2018 ఆరంభం నుంచి.. బుమ్రా, షమి, ఇషాంత్‌లు ప్రతి 22 పరుగులకు ఓ వికెట్ పడగొడుతున్నారు. ఈ త్రయానికి హైదరాబాదీ మియాభారు మహ్మద్ సిరాజ్ తోడవటంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేయటం గగనమైంది. నలుగురు పేసర్లు అత్యద్భుతంగా బంతులేస్తుండగా.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సులువుగా పరుగులు సాధించే అవకాశం లేకుండా పోయింది. నలుగురు బౌలర్లు ప్రత్యర్థిపై ఒత్తిడిని మరింత పెంచడం చూసేందుకు భారత అభిమానులకు పండుగగానే ఉంటోంది. ఈ పేస్ దళానికి స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలు కలవటంతో ప్రపంచంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని చిత్తు చేయగల బౌలింగ్ విభాగం భారత్ సొంతమైంది.
ఏండ్ల శ్రమ ఫలితమే : భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్, జోశ్ హేజిల్‌వుడ్ సృష్టించిన ఒత్తిడిని మిచెల్ స్టార్క్ రాగానే బ్యాట్స్‌మెన్ పరుగుల వరదతో తొలగించుకున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ జేమ్స్ అండర్సన్ చేతిలో బంతి ఉన్నంతవరకే భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కనిపిస్తోంది. రెండో సీమర్‌కు బంతి అందగానే పరుగులు వచ్చేస్తున్నాయి. ఈ ఆనందం భారత బౌలర్లపై ప్రత్యర్థులకు లభించటం లేదు. షమి, బుమ్రా, ఇషాంత్, సిరాజ్‌లు ఎక్కడా ఒత్తిడిని తగ్గించటం లేదు. ముందు ఓవర్‌కు ఉన్న ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. పేస్ బౌలింగ్‌లో ఈ నాణ్యత, బలమైన బెంచ్ బలం రాత్రికి రాత్రి రాలేదు. జట్టు మేనేజ్మెంట్, క్రికెట్ బోర్డు ఏండ్లుగా విలువైన సమయాన్ని, డబ్బు, నిపుణులైన శిక్షకులతో ప్రామాణికి వ్యవస్థను ఏర్పాటు చేసింది. అవకాశం లభిస్తే, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేసేందుకు సిద్ధంగా ఉండే పేసర్లను బోర్డు తయారు చేసింది. భారత్-ఏ జట్టు విదేశీ పర్యటనలు సైతం పేస్ దళం పురోగతికి కలిసొచ్చాయి. ప్రస్తుత భారత పేస్ దళం బలమైనది, నైపుణ్యమైనది మాత్రమే కాదు అత్యంత వేగవంతమైనది.
గణాంకాలు ఇలా.. : 2018, 2021 ఇంగ్లాండ్ పర్యటనల్లో గణాంకాల పరంగా కనిపిస్తున్న ప్రధాన వ్యత్యాసాలు ఇవి. 2018లో ధావన్, మురళీ విజరు ఓపెనింగ్ చేయగా.. చివరి రెండు టెస్టుల్లో ధావన్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. అప్పుడు ఓపెనింగ్ సగటు 23.70. తాజా సిరీస్‌లో ఓపెనర్లు రోహిత్, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు. 68.75 సగటుతో సింహభాగం పరుగులు పిండుకుంటున్నారు. 2018 సిరీస్‌లో విరాట్ కోహ్లి 59.30 సగటుతో పరుగులు పిండుకున్నాడు. ఓపెనర్ల వైఫల్యంతో కోహ్లిపైనే భారం పడింది. తాజా సిరీస్‌లో కోహ్లి ఫామ్‌లో లేడు. 20.66 బ్యాటింగ్ సగటు. అయినా, ఓపెనర్ల మెరుపులతో కోహ్లి వైఫల్యం కనిపించటం లేదు. చివరగా 2018 పర్యటనలో టెయిలెండర్లు (8-11 బ్యాట్స్‌మెన్) 11.00 సగటుతో స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. తాజా పర్యటనలో టెయిలెండర్లు 23.14 సగటుతో పరుగులు సాధించారు.