Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమర్శకులకు రహానె సమధానం
హేడింగ్లే (లీడ్స్) : టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలపై విలువైన బాధ్యతలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు ఎన్నో టెస్టులను భారత్ వశం చేశారు. అయినా, భారత్ విఫలమైన ప్రతిసారీ ఈ ఇద్దరి వైపు విమర్శకులు దూకుడుగా వెళ్లటం పరిపాటిగా మారింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో విఫలమైన పుజారా, రహానెలు లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. మూడో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన రహానె పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ' జనాలు నా గురించి మాట్లాడుకోవటం సంతోషం. ముఖ్యమైన వ్యక్తుల గురించే జనాలు ఎక్కువగా చర్చించుకుంటారు. నా వరకు విమర్శలను పట్టించుకోను. ఒత్తిడిని ఎలా జయించాలనే విషయం నాకు, పుజారాకు తెలుసు. మా నియంత్రణలో లేని విషయాల గురించి ఆందోళన చెందను. లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కీలక భాగస్వామ్యం నమోదు చేయటం సంతృప్తినిచ్చింది. జట్టు గెలుపుకు అవసరమైన 61 పరుగుల ఇన్నింగ్స్ ఎంతో ముఖ్యమైనది. జట్టు ప్రదర్శనే అంతిమంగా ప్రధానం. లార్డ్స్ విజయం సంతోషాన్ని ఇచ్చింది. కానీ జట్టు లార్డ్స్ నుంచి లీడ్స్‌కు వచ్చింది. ఇప్పుడు ఇక నుంచి కొత్త ఆరంభం' అని రహానె అన్నాడు.
మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ బౌలింగ్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్ సేవలు కోల్పోయిన ఇంగ్లాండ్.. తాజాగా మార్క్వుడ్నూ కోల్పోయింది. గాయంతో మూడో టెస్టుకు మార్క్‌వుడ్ దూరమయ్యాడు. దీంతో ఆతిథ్య జట్టు వెటరన్ సీమర్ జేమ్స్ అండర్సన్పైనే ప్రధానంగా ఆధారపడనుంది. లార్డ్స్ విజయోత్సాహంలో ఉన్న కోహ్లిసేన.. హీడింగ్లేలో హుషారుగా సాధన చేస్తుంది. ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ సెషన్లో కఠోరంగా సాధన చేస్తున్నారు.