Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచే టోక్యో పారాలింపిక్స్
- రికార్డు మెడల్స్‌పై భారత్ గురి
సమ్మర్ ఒలింపిక్స్‌కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన టోక్యో నగరం.. ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. కరోనా అవాంతరాలు, ఇతర అడ్డంకుల నడుమ పారాలింపిక్స్‌కు ముస్తాబైంది. 2020 పారాలింపిక్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. జీవితంలో ఎన్నో అడ్డంకులు, సవాళ్లు, వైకల్యాన్ని జయించిన పారా అథ్లెట్లు ఇక పారా విశ్వ క్రీడల్లో ఒత్తిడిని జయించి పతకాలు సొంతం చేసుకునేందుకు రెఢ అవుతున్నారు.
నవతెలంగాణ-టోక్యో
టోక్యో పారాలింపిక్స్‌కు జపాన్ రాజధాని నగరం ముస్తాబైంది. ఆగస్టు 24-సెప్టెంబర్ 5, 2021న జరుగనున్న పారాలింపిక్స్‌కు కోవిడ్-19 మహమ్మారి ముప్పు పొంచి ఉన్నప్పటికీ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని నిర్వాహకులు ముందుకు వెళ్తున్నారు. పారాలింపిక్స్ నిర్వహణ కోసం టోక్యో నగరంలో కోవిడ్-19 అత్యయిక స్థితిని పొడిగిస్తూ ప్రభ్తుత్వం నిర్ణయం తీసుకుంది. పారాలింపిక్స్‌లో సుమారు 200 దేశాలకు చెందిన 4000 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఒలింపిక్స్ ఈవెంట్స్‌తో పారాలింపిక్స్ ఈవెంట్స్ పోలి ఉంటాయి. బొకియా, గోల్‌బాల్ మాత్రమే పారాలింపిక్స్‌లో ప్రత్యేకంగా ఉంటాయి. భారత కాలమానం ప్రకారం నేడు సాయంత్రం 4.30 గంటలకు టోక్యో పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు ఆరంభం కానున్నాయి. ఆరంభ వేడుకల పరేడ్‌లో భారత పతాకధారిగా మరియప్పన్ తంగవేలు ఉండనున్నాడు. తంగవేలు సహా ఆరుగురు పారా అథ్లెట్లు ఆరంభ వేడుకలకు హాజరు కానున్నారు.
ఉత్సాహంగా మనోళ్లు : 2016 పారాలింపిక్స్‌లో యువ పారాఅథ్లెట్ మరియప్పన్ తంగవేలు హైజంప్‌లో పసిడి నెగ్గగానే.. స్వదేశంలో అతడికి స్టార్డమ్ వచ్చేసింది. తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్ల నజరానాతో నగదు ప్రోత్సాహకాల వెల్లువకు తెరతీసింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న, పౌర పురస్కారం పద్మ శ్రీ సహా అర్జున అవార్డులు వరించాయి. రియో పారా మెడలిస్ట్లు దేవేంద్ర జఝారియ, దీప మాలిక్, వరుణ్ సింగ్‌లకు స్వదేశంలో అదే గౌరవం దక్కింది. జీవితంలో ఎన్నో వైపరిత్యాలను జయించిన పారా వీరులు.. 2020 పారాలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు. విశ్వ క్రీడా వేదికపై మెడల్ ప్రదర్శనతో జీవితం మారిపోయే సువర్ణావకాశం ముందుండటంతో పారా అథ్లెట్లు ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నారు. తొలిసారి భారత్ 54 మంది పారా అథ్లెట్లను పంపిస్తోంది. మరియప్పన్ తంగవేలు, దేవంద్రలు పసిడి పతకాన్ని నిలుపుకునేందుకు బరిలోకి దిగుతుండగా.. పారాలింపిక్స్‌లో తమ ప్రతాపం చూపేందుకు ఇతర అథ్లెట్లు సిద్ధపడుతున్నారు. పారా షట్లర్ ప్రమోద్ భగత్ తన విభాగంలో వరల్డ్ నం.1. 33 ఏండ్ల ప్రమోద్ తన విభాగంలో పసిడి ఫేవరేట్‌గా ఆడుతున్నాడు. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా బంగారు పతకాలు సాధించిన ప్రమోద్.. టోక్యోలో మరో పసిడి దిశగా స్మాష్ కొట్టనున్నాడు. షుటింగ్ విభాగంలోనూ భారత్ పతకాలు ఆశిస్తోంది. అవని, రూబినాలు గన్‌తో పతకం కొట్టేందుకు రెఢ అవుతున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 పారా అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, పవర్‌లిఫ్టింగ్, పారాకానోయింగ్, పవర్‌లిఫ్టింగ్, షుటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోల్లో భారత పారా అథ్లెట్లు మెడల్ రేసులో ఉన్నారు.
మన పారా హీరోలు : పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు 12 పతకాలు వచ్చాయి. అందులో నాలుగు పసిడి, నాలుగు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 6-8 పతకాలు ఆశిస్తోంది. 2020 పారాలింపిక్స్ నేపథ్యంలో మన పారా హీరోలు ఎవరో చూద్దాం. భారత్‌కు విశ్వ క్రీడల్లో తొలి పసిడి వచ్చింది పారాలింపిక్స్‌లోనే. 1972 హిడెల్బర్గ్లో మురళీకాంత్ పటేకర్ స్విమ్మింగ్‌లో పసిడి సాధించాడు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్ 3 విభాగంలో 37.331 సెకండ్లతో బంగారు పతకం గెలిచాడు. 1965 ఇండో పాక్ వార్ హీరో పటేకర్ నిజానికి బాక్సర్. బుల్లెట్ గాయంతో చేతిని కోల్పోయిన అనంతరం సిమ్మింగ్కు మారిపోయాడు. దేవేంద్ర జఝారియ రెండు పసిడి పతకాలు గెలిచాడు. 2004 ఏథేన్స్ క్రీడల్లో ఎఫ్44/46 విభాగంలో 62.15 మీటర్ల దూరంతో జావెలిన్ త్రో చాంపియన్‌గా నిలిచాడు. 2008, 2012 పారాలింపిక్స్‌లో పోటీపడని దేవేంద్ర 2016 రియోలో ప్రపంచ రికార్డుతో పసిడి కొట్టాడు. 63.97 మీటర్లతో బంగారు బల్లెమును సంధించాడు. తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలు రియోలో సంచలనం సృష్టించాడు. ఎఫ్42 హైజంప్‌లో 1.89 మీటర్ల ఎత్తు జంప్ చేసి పసిడి సాధించాడు. 2004 తర్వాత భారత్‌కు పసిడి సాధించిన తొలి పారాలింపియన్‌గా తంగవేలు నిలిచాడు. రజత పతక సాధించిన వారిలో భీమ్రావ్ కేశార్కర్, జోగిందర్ సింగ్ బేడీ, గిరీశ్ గౌడ, దీప మాలిక్ ఉన్నారు. 1984 పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఎల్6 విభాగంలో 34.55 మీటర్లతో భీమ్రావ్ రజతం సాధించాడు. 1984లోనే జోగిందరÊ సింగ్ బేడీ మెన్స్ షాట్‌పుట్ ఎల్6 విభాగంలో 10.08 మీటర్లతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఈ పతకం జోగిందర్‌కు మూడో మెడల్ కావటం విశేషం. హై జంపర్ గిరీశ్ గౌడ 2012 లండన్ పారాలింపిక్స్ హై జంప్ ఎఫ్42లో తృటిలో పసిడి కోల్పోయాడు. 1,74 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఏకైన మహిళా అథ్లెట్ దీప మాలిక్. షాట్‌పుట్ ఎఫ్53 విభాగంలో 4.61 మీటర్ల త్రోతో దీప మాలిక్ రియోలో రజతం అందుకుంది. కాంస్య పతక విజేతల విషయానికొస్తే.. జోగిందర్ సింగ్ బేడీ (2), రాజిందర్ సింగ్ రాహేలు, వరుణ్ సింగ్ భాటిలు ఉన్నారు. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ జావెలిన్ త్రోలో 34.18 మీటర్ల త్రోతో కాంస్యం సాధించాడు. ఇదే విభాగంలో కేశార్కర్ స్విలర్ సాధించాడు. డిస్కస్ త్రో ఎల్6 విభాగంలో 28.16 మీటర్ల త్రోతో బేడీ మరో కాంస్య పతకం దక్కించుకున్నాడు. 2004 ఏథేన్స్ క్రీడల్లో పవర్‌లిఫ్టింగ్‌లో రాజిందర్ పతకం సాధించాడు. 56 కేజీల విభాగంలో 157.5 కేజీల బరువెత్తి కాంస్యం ముద్దాడాడు. 2016 రియోలో మరియప్పన్ స్వర్ణం సాధించిన విభాగంలో వరుణ్ సింగ్ 1.86 మీటర్లతో కాంస్య పతకం అందుకున్నాడు.