Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేక్షకులు లేకుండానే పారాలింపిక్స్
- వెలుగుల జిలుగుల ఆరంభ వేడుకలు
నవతెలంగాణ-టోక్యో : పారా పండుగ మొదలైంది. కరోనా మహమ్మారి పడుగ నీడలోనే పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. జపాన్ జాతీయ స్టేడియంలో 2020 టోక్యో పారాలింపిక్స్ అధికారికంగా మొదలయ్యాయి. జపాన్ చక్రవర్తి నారుహిటో పారాలింపిక్స్‌ను ఆరంభించారు. సమ్మర్ ఒలింపిక్స్ తరహాలోనే పారాలింపిక్స్ సైతం ప్రేక్షకులు లేకుండానే, ఖాళీ స్టేడియంలోనే ముగిసింది. ఆరంభ వేడుకల్లో 167 దేశాలకు చెందిన అథ్లెట్ల బృందం పరేడ్ చేసింది. పారాలింపిక్స్‌లో నేటి నుంచి పోటీలు ఆరంభం కానున్నాయి. 'మాకు రెక్కలున్నాయి' సందేశంతో పారాలింపిక్స్ షరూ అవగా.. ఆరంభ వేడుకల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిశ్ భర్త హాజరయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్, అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు అండ్రూ పార్సన్స్ హాజరయ్యారు.
'ఈ రోజు ఆరంభ వేడుకలను నమ్మలేకపోతున్నాను. టోక్యో పారాలింపిక్స్‌పై ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంతో మంది కృషి ఫలితంగా ఈ రోజు పారాలింపిక్స్ సాకారం అవుతున్నాయి' అని అండ్రూ పార్సన్స్ అన్నాడు. ఆరంభ వేడుకల్లో 167 దేశాలకు చెందిన అథ్లెట్ల బృందాలు హాజరయ్యాయి. అందులో శరణార్థి అథ్లెట్ల బృందం సహా అప్ఘనిస్థాన్ జెండాలు ఉన్నాయి. అఫ్ఘనిస్థాన్ జాతీయ జెండాను వాలంటీర్ ఆరంభ వేడుకల పరేడ్‌లో ప్రదర్శించారు. టోక్యో పారాలింపిక్స్‌లో సుమారు 4400 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.
ఐసోలేషన్‌లో మరియప్పన్ : రియో పారాలింపిక్స్ పసిడి విజేత మరియప్పన్ తంగవేలు ఆరంభ వేడుకలకు దూరంగా ఉన్నాడు. మరియప్పన్ టోక్యోకు చేరుకున్న విమానంలో ఓ విదేశీ అథ్లెట్ కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చాడు. దీంతో తంగవేలు గత ఆరు రోజులుగా ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఆరు రోజుల్లో కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో మరియప్పన్‌కు నెగెటివ్ వచ్చినా.. ముందు జాగ్రత్తగా తంగవేలును ఆరంభ వేడుకులకు తీసుకు రావద్దని నిర్వాహకులు సూచించారు. దీంతో జాతీయ పతాకధారిగా తంగవేలు స్థానంలో జావెలియన్ త్రోయర్ టెక్ చంద్ ఆరంభ వేడుకల్లో భారత జాతీయ పతాకధారిగా వ్యవహరించాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు పోటీపడుతున్నారు.