Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు
- 2-0 ఆధిక్యంపై కోహ్లిసేన గురి
- మధ్యాహ్నం 3.30 నుంచి సోనీనెట్వర్క్లో..
ఇంగ్లాండ్ గడ్డపై ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టి, టీమ్ ఇండియా హాట్ ఫేవరేట్‌గా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. పటౌడీ ట్రోఫీలో లీడ్‌ను మరింత పెంచుకునేందుకు లీడ్స్ సమరానికి రంగం సిద్ధం చేసుకుంది. చారిత్రక లార్డ్స్ టెస్టు విజయంతో కోహ్లిసేన జోరు మీదుండగా.. వరుస పరాజయాలతో రూట్‌సేన మానసికంగా కుంగిపోయింది. ఆతిథ్య జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా సిరీస్‌లో 2-0 ఆధిక్యం కోసం కోహ్లిసేన బరిలోకి దిగుతోంది. భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు పోరు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-లీడ్స్
లార్డ్స్ టెస్టు అనంతరం తొమ్మిది రోజుల విరామం. ఓటమి నుంచి బయటపడేందుకు ఇంగ్లాండ్‌కు మంచి విరామమే లభించగా.. తప్పిదాలు సమీక్షించుకుని మరింత మెరుగ్గా సిద్ధమయ్యేందుకు భారత్‌కూ ఈ విరామం ఉపయుక్తం. విరామం మంగళవారంతో ముగియగా.. నేడు లీడ్స్‌లో భారత్, ఇంగ్లాండ్‌లు ముచ్చటగా మూడో టెస్టు సమరానికి సై అంటున్నాయి. బ్యాటింగ్ లైనప్‌లో వైఫల్యాలు, బౌలింగ్ విభాగానికి గాయాల బెడదతో ఆతిథ్య ఇంగ్లాండ్ ఇంకా ఇబ్బందుల్లోనే కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యలు కనిపిస్తున్నా.. క్లిష్ట సమయంలో సమిష్టి ప్రదర్శనలు భారత్‌ను ఫేవరేట్‌గా నిలుపుతున్నాయి. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ విజయాల్లో దూసుకెళ్తోన్న కోహ్లిసేన.. అదే ఒరవడి ఇంగ్లాండ్‌లోనూ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. లీడ్స్‌లో సిరీస్‌ను సమం చేసేందుకు ఇంగ్లాండ్, ఆధిక్యం మరింత పెంచుకునేందుకు భారత్ బరిలోకి దిగుతున్నాయి.
మిడిల్ మెరవాలి : తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన భారత మిడిల్ ఆర్డర్లో లార్డ్స్‌లో ఫర్వాలేదు అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానె, చతేశ్వర్ పుజారాలు విలువైన పరుగులు జోడించారు. అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోతున్న కోహ్లి, రహానె, పుజారా బ్యాటింగ్ త్రయం లీడ్స్‌లో పరుగుల వేటకు నాయకత్వం వహించాల్సి ఉంది. పుజారా, రహానెలపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తున్నా.. తుది జట్టులో నిలిచేందుకు అవకాశం ఉంది. నిలకడగా పరుగులు రాబట్టకుండా ఎన్నో టెస్టుల్లో తుది జట్టులో నిలువలేరు. ఈ విషయం వారికి బాగా తెలుసు. టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా రానున్నాడు. పృథ్వీ షా అందుబాటులో ఉన్నప్పటికీ లీడ్స్‌లో అతడు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు రోహిత్ శర్మ నిలకడ భారత్‌కు కలిసొస్తుంది. విధ్వంసక వీరుడు రిషబ్ పంత్ ఇంగ్లాండ్ పంజా విసరాల్సి ఉంది. ఇంగ్లీష్ బౌలర్లపై ఓ ఊచకోత ఇన్నింగ్స్ బాకీ పడిన పంత్.. లీడ్స్‌లో ఏం చేస్తాడో చూడాలి.
బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా మరోసారి అశ్విన్‌ను వెనక్కి నెట్టనున్నాడు. లీడ్స్ టెస్టులోనూ అశ్విన్ బెంచ్‌కు పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన పేస్ దళం జశ్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లు లీడ్స్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌కు సవాల్ విసరనుంది. నలుగురు పేసర్లు ఒత్తిడి తగ్గకుండా బ్యాట్స్‌మెన్‌ను ఇరకాటంలో పడేయటం టెస్టు క్రికెట్లో చూసేందుకు వీనుల విందుగా కనిపిస్తోంది. బుమ్రా, షమి, సిరాజ్, శర్మ పేస్, బౌన్స్, స్వింగ్ ప్రదర్శన లీడ్స్‌లో మరో ఎత్తుకు చేరనుందేమో చూడాలి.
ఒత్తిడిలో ఇంగ్లాండ్ : ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. కెప్టెన్ జో రూట్ బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారిస్తున్నా. అతడికి సహకరించే బ్యాట్స్‌మన్ కరువయ్యాడు. వరుస వైఫల్యాలతో బ్యాటింగ్ లైనప్‌లో రూట్ కుర్చీలాటకు తెరలేపాడు. ఒక్కో బ్యాట్స్‌మన్‌కు ఒక్కో టెస్టులో అవకాశం కల్పిస్తున్నాడు. తాజాగా లీడ్స్ టెస్టుకు డెవిడ్ మలాన్‌ను పిలిపించారు. అతడూ విఫలమైతే.. ఎవరిని రప్పిస్తారో చూడాలి. జానీ బెయిర్‌స్టో, జోశ్ బట్లర్లు ఏమాత్రం రాణించటం లేదు. భారత పేసర్లు ఈ ఇద్దరు వికెట్ కీపింగ్ బ్యాట్స్మన్లను అలవోకగా పెవిలియన్‌కు పంపిస్తున్నారు. ఓపెనర్లు బర్న్స్, సిబ్లేలు దారుణంగా ఆడుతున్నారు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఇద్దరూ సున్నా పరుగులకే వికెట్ కోల్పోవటం ఆ జట్టును దారుణంగా దెబ్బతీసింది. బౌలింగ్ విభాగంలో జేమ్స్ అండర్సన్‌కు సరైన జోడీ పేసర్ కరువయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్, మార్క్‌వుడ్‌లు గాయంతో దూరమయ్యారు. సంచలన పేసర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేడు. దీంతో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో ఇంగ్లాండ్ శిబిరానికి కోరలు లేకుండా పోయాయి.
చరిత్ర భారత్‌వైపే! : లీడ్స్ మైదానంలో భారత్‌కు మంచి రికార్డుంది. భారత్, ఇంగ్లాండ్‌లు ఇక్కడ ఆరు టెస్టుల్లో తలపడ్డాయి. ఓ టెస్టు డ్రాగా ముగియగా.. ఇంగ్లాండ్ మూడు, భారత్ రెండు టెస్టుల్లో విజయాలు సాధించాయి. 1979 టెస్టును డ్రా చేసుకున్న భారత్.. 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో, 2002 గంగూలీ సారథ్యంలో విజయాలు సాధించింది. 1979 నుంచి భారత్‌కు ఈ మైదానంలో ఓటమి లేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్‌ను ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ లీడ్స్‌లో ఓడించటం అసాధ్యంగానే కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : లీడ్స్ టెస్టుకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. తొలి నాలుగు రోజులు ఇక్కడ వర్ష సూచనలు లేవు. చివరి రోజు చిరు జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు 18-22 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. లీడ్స్ సహజంగానే పేసర్లకు సహకరిస్తుంది. చివరి రెండు రోజుల్లో స్పిన్‌కు అనుకూలించే వీలుంది. ఇక్కడ ఐదు రోజులు బ్యాటింగ్‌కు సైతం అనుకూలంగానే ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ : రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డెవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జోశ్ బట్లర్ (వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, ఒలీ రాబిన్సన్, శామ్ కరణ్, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్.