Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి స్వర్ణం ఆస్ట్రేలియాదే!
- టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశ
- టోక్యో పారాలింపిక్స్
టోక్యో: 16వ పారాలింపిక్స్‌లో తొలిరోజు తొలి స్వర్ణ పతకాన్ని ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది. బుధవారం నుంచి ప్రారంభమైన పోటీల్లో భాగంగా సైక్లింగ్ విభాగంలో పిజే గ్రెకో బంగారు పతకాన్ని సాధించింది. మహిళల సి1-3 3వేల మీటర్ల వ్యక్తిగత సైక్లింగ్ పర్స్యూట్‌లో గ్రెకో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోటీలో చైనాకు చెందిన వాంగ్‌ను ఆఖరి క్షణాల్లో 1.777సెకన్లలో వెనక్కి నెట్టి గ్రెకో సి-4 క్లాస్‌లో తొలిస్థానంలో నిలవడం గమనార్హం.
సారా స్టోరేకు 15వ పారాలింపిక్ స్వర్ణం
బ్రిటన్‌కు చెందిన పారాలింపిక్ అథ్లెట్ సారా స్టోరే చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్ కెరీర్లో 15వ స్వర్ణ పతకాన్ని ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఇజు వెలోడ్రోమ్‌లో బుధవారం జరిగిన సైక్లింగ్ ఈవెంట్లో సారా బంగారు పతకాన్ని సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో బ్రిటన్‌కు ఇదే తొలి స్వర్ణం. వ్యక్తిగత సైక్లింగ్ ఈవెంట్లో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇక బ్రిటన్‌కే చెందిన మైక్ కెన్నీ 16 పసిడి పతకాలను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1992లో బార్సిలోనా పారాలింపిక్స్‌లో స్మిమ్మర్గా ఆమె కెరీర్ ప్రారంభించిన సారా 2005 నుంచి సైక్లింగ్ ఈవెంట్లోనూ బరిలోకి దిగుతోంది.
భారత్‌కు నిరాశ..
పారాలింపిక్స్‌లో తొలిరోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. బుధవారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భావినాబెన్ పటేల్, సోనాల్‌బెన్ మనుభాయి పటేల్ పరాజయాల్ని చవిచూశారు. మహిళల క్లాస్-3 తొలిరౌండ్ పోటీలో సోనాల్‌బెన్ మొదటి మూడు గేముల్లో ఆధిపత్యం చెలాయించింది. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో చైనా క్రీడాకారిణి లీ క్వాన్ చేతిలో ఓడింది. లీ ప్రపంచ నాలుగో ర్యాంకరే కాకుండా రియోలో రజత పతక విజేత. ఇక మహిళల క్లాస్-4 విభాగం తొలి పోరులో భావినాబెన్‌కు సైతం చైనా అమ్మాయి చేతిలోనే ఓటమి ఎదురైంది. ప్రపంచ నంబర్ వన్, జౌయింగ్ చేతిలో 3-11, 9-11, 2-11 తేడాతో ఓటమి పాలైంది. క్లాస్-3తో పోలిస్తే క్లాస్-4 విభాగంలో వైకల్యం శాతం ఎక్కువ.