Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 78 పరుగులకే కుప్పకూలిన కోహ్లిసేన
లీడ్స్: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడోటెస్టులో భారతజట్టు పేకమేడలా కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్లు ఆండర్సన్, ఓవర్టన్, రాబిన్సన్, కరన్‌ల దెబ్బకు టీమిండియా 78 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇంగ్లండ్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ డకౌట్ కావడంతో భారతజట్టు వికెట్ల పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన ఏమాత్రం పోరాట పటిమ చూపలేకపోయింది. టాప్‌క్లాస్ ఆటగాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. రోహిత్ శర్మ(19), రహానే(18) చేసిన పరుగులే అత్యధికం. మిగతా బ్యాట్స్‌మన్ ఎవరూ రెండంకెల స్కోర్ సాధించలేకపోయారు. పుజారా(1), కోహ్లీ(7), పంత్(2), జడేజా(4), ఇషాంత్ శర్మ(8) ఘోరంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ కాగా, ఆరుగురు ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఓ దశలో కోహ్లి సేన జట్టుస్కోర్ 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి కొంత పటిష్టంగా కనిపించినా.. అదే స్కోర్వద్ద వరుసగా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి వికెట్‌కు ఇషాంత్, సిరాజ్ కలిసి 11 పరుగులు జత చేయడంతో టీమిండియా ఆమాత్రమైనా స్కోర్ చేయగల్గింది. ఆండర్సన్, ఓవర్టన్ చెరో మూడు వికెట్లు తీయగా, రాబిన్సన్, శామ్ కరన్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.
టాప్ లేపిన ఆండర్సన్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్‌ను ఇంగ్లండ్ సీనియర్ పేసర్ ఆండర్సన్ దెబ్బతీశాడు. కేఎల్ రాహుల్ వికెట్‌ను తొలి ఓవర్లోనే తీసిన ఆండర్సన్.. ఆ తర్వాత పుజారా, కెప్టెన్ కోహ్లిలను తక్కువ స్కోర్‌కే పెవీలియన్‌కు చేర్చాడు. తొలుతే మూడు వికెట్లను పడగొట్టి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. భారత్ తొలుత కోల్పోయిన ఐదు వికెట్ల క్యాచ్‌లను ఇంగ్లండ్ వికెట్ కీపర్ బట్లర్ అందుకోవడం విశేషం.
స్కోర్‌బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి)రాబిన్సన్ (బి)ఓవర్టన్ 19, రాహుల్ (సి)బట్లర్ (బి)ఆండర్సన్ 0, పుజారా (సి)బట్లర్ (బి)ఆండర్సన్ 1, కోహ్లి (సి)బట్లర్ (బి)ఆండర్సన్ 7, రహానే (సి)బట్లర్ (బి)రాబిన్సన్ 18, పంత్ (సి)బట్లర్ (బి)రాబిన్సన్ 2, జడేజా (ఎల్బి) కరన్ 4, షమీ (సి)బర్న్స్ (బి)ఓవర్టన్ 0, ఇషాంత్ (నాటౌట్) 8, బుమ్రా (ఎల్బి)కరన్ 0, సిరాజ్ (సి)రూట్ (బి)ఓవర్టన్ 3, అదనం 16. (40.4 ఓవర్లలో ఆలౌట్) 78 పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/4, 3/21, 4/56, 5/58, 6/67, 7/67, 8/67, 9/67, 10/78
బౌలింగ్: ఆండర్సన్ 8-5-6-3, రాబిన్సన్ 10-3-16-2, కరన్ 10-2-27-2, మొయిన్ 2-0-4-0, ఓవర్టన్ 10.4-5-14-3.