Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ అథ్లెట్ అంశంలో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ : ఇతర దేశాలకు చెందిన ఏ అథ్లెట్ అయినా మన క్రీడాకారులను పొగిడితే 'క్రీడా స్ఫూర్తి' మనోళ్ల గొప్పతనమని అంటున్నాం. అదే విదేశీ అథ్లెట్లను ప్రత్యేకించి పాకిస్థాన్ క్రీడాకారులకు గురించి సానుకూలంగా మాట్లాడినా.. వారితో స్నేహభావంతో మెలిగినా అది మనకు క్రీడా స్ఫూర్తిగా కనిపించటం లేదు. ఇదే విషయాన్ని ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఘాటుగా చెప్పాడు. పాకిస్థాన్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌తో జరిగిన సంఘటనను ఇటీవల నీరజ్ చోప్రా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. దీన్ని సోషల్ మీడియా అతివాదులు వివాదంగా మార్చే ప్రయత్నం చేశారు. దీంతో నీరజ్ చోప్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా తొలి త్రో విసరడానికి ముందు తన జావెలిన్‌ను పాక్ అథ్లెట్ నదీమ్ నుంచి తిరిగి తీసుకున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ' మీ అభిప్రాయాలు, మీ ఎజెండాకు నన్ను వాడుకోవద్దని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. కలిసికట్టుగా, ఐక్యంగా ఉండటమే క్రీడలు మాకు నేర్పాయి. ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై కొందరి స్పందన బాధాకరం. ఒలింపిక్స్‌లో నా తొలి త్రోకు ముందు జావెలిన్‌ను నదీమ్ నుంచి తీసుకున్నట్టు చెప్పాను. ఐఓసీ నిబంధనల ప్రకారం జావెలిన్‌ను అథ్లెట్లు అందరూ వాడుకొవచ్చు. అర్షద్ నా జావెలియన్ తీసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. దీన్ని వివాదంగా చేయవద్దు. జావెలిన్ త్రోలో అథ్లెట్లు అందరం క్రీడాస్ఫూర్తితో తలపడతాం' అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.