Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా మూడో టెస్టులో విశ్వరూపం
- 300 ప్లస్ ఆధిక్యంలో ఇంగ్లాండ్
- భారత్‌తో మూడో టెస్టు రెండో రోజు
జో రూట్ (121) భీకర ఫామ్ కొనసాగించాడు. పటౌడీ సిరీస్‌లో హ్యాట్రిక్ సెంచరీతో చెలరేగాడు. నాటింగ్‌హామ్‌లో 109, లార్డ్స్‌లో 180 ఇన్నింగ్స్‌తో మెరిసిన ఇంగ్లాండ్ కెప్టెన్.. సొంతగడ్డ లీడ్స్‌లో దూకుడుగా శతక్కొట్టాడు. రూట్ జోరుకు మలాన్ (70), బర్న్స్ (61), హమీద్ (68) మెరుపులు తోడవటంతో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించింది.
నవతెలంగాణ-లీడ్స్
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (121, 165 బంతుల్లో 14 ఫోర్లు) సొంత మైదానంలో శతకంతో చెలరేగాడు. 124 బంతుల్లోనే సెంచరీ బాదిన రూట్.. సిరీస్‌లో వరుసగా మూడో శతకం నమోదు చేశాడు. డెవిడ్ మలాన్ (70, 128 బంతుల్లో 11 ఫోర్లు), హసీబ్ హమీద్ (68, 195 బంతుల్లో 12 ఫోర్లు), రోరీ బర్న్స్ (61, 153 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. రెండో రోజు ఆట చివరి సెషన్లో 124 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 404/7తో, 326 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. శామ్ కరన్, ఓవర్టన్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమి మూడు, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు.
రూట్ హ్యాట్రిక్ శతకం! : పటౌడీ సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ప్రతాపం కొనసాగుతోంది. వరుసగా మూడో టెస్టులో రూట్ శతకంతో చెలరేగాడు. నాటింగ్‌హామ్, లార్డ్స్‌తో పోల్చితే లీడ్స్‌లో దూకుడుగా పరుగులు పిండుకున్నాడు. ఏడు ఫోర్లతో 57 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రూట్.. డజను బౌండరీల సాయంతో 124 బంతుల్లోనే శతక మార్క్ చేరుకున్నాడు. ఓ క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా అలిస్టర్ కుక్‌ను వెనక్కి నెట్టాడు. రూట్ మెరుపులతో ఇంగ్లాండ్ 300కి పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (61, 153 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), హసీబ్ హమీద్ (68, 195 బంతుల్లో 12 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఓవర్ నైట్ స్కోరు 120/0కు మరో 15 పరుగులు జోడించిన అనంతరం బర్న్స్‌ను షమి సాగనంపాడు. దీంతో సుదీర్ఘ ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఓపెనర్ హమీద్‌ను జడేజా అవుట్ చేయటంతో ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ దశలో జత కలిసిన జో రూట్, డెవిడ్ మలాన్ (70, 128 బంతుల్లో 11 ఫోర్లు) మూడో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. రూట్ సహజశైలికి భిన్నంగా వేగంగా పరుగులు పిండుకోగా.. మలాన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. భారత బౌలర్లకు పిచ్ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. ఇది ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పని తేలిక చేసింది. మలాన్ 99 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ సెంచరీ నమోదు చేశాడు. మహ్మద్ సిరాజ్ ఓవర్లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. జానీ బెయిర్‌స్టో (29) నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో హల్చేసినా.. ఎంతోసేపు వికెట్ నిలుపుకోలేదు. జానీ బెయిర్‌స్టో, జోశ్ బట్లర్ (7)లను షమి వెనక్కి పంపించాడు. శతక హీరో రూట్‌ను బుమ్రా సాగనంపాడు. చివరి సెషన్లో వరుస వికెట్లతో ఇంగ్లాండ్ జోరు కాస్త నెమ్మదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల ఆధిక్యంపై కన్నేసిన ఇంగ్లాండ్‌ను వరుస వికెట్లతో బౌలర్లు నిలువరించారు!.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకే కుప్పకూలింది. దీంతో లీడ్స్ టెస్టులో కోహ్లిసేన ఓటమి గండం ఎదుర్కొంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ ఆధిక్యం పూడ్చుకోవటంతో పాటు ఇంగ్లాండ్‌కు దీటైన లక్ష్యాన్ని సైతం నిర్దేశించాల్సి ఉంటుంది. లేదంటే, రూట్ సొంత మైదానంలో భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం తప్పదేమో!.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 78/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : రోరీ బర్న్స్ (బి) మహ్మద్ షమి 61, హసీబ్ హమీద్ (బి) రవీంద్ర జడేజా 68, డెవిడ్ మలాన్ (సి) రిషబ్ పంత్ (బి) మహ్మద్ సిరాజ్ 70, జో రూట్ (బి) జశ్‌ప్రీత్ బుమ్రా 121, జానీ బెయిర్‌స్టో (సి) విరాట్ కోహ్లి (బి) మహ్మద్ షమి 29, జోశ్ బట్లర్ (సి) ఇషాంత్ శర్మ (బి) మహ్మద్ షమి 7, మోయిన్ అలీ (సి)(సబ్) అక్షర్ పటేల్ (బి) రవీంద్ర జడేజా 8, శామ్ కరన్ నాటౌట్ 10, క్రెయిగ్ ఓవర్టన్ నాటౌట్ 10, మొత్తం(124 ఓవర్లలో 7 వికెట్లకు) 404.
వికెట్ల పతనం : 1-135, 2-159, 3-298, 4-350, 5-360, 6-383, 7-383.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 20-0-80-0, జశ్‌ప్రీత్ బుమ్రా 27-10-58-1, మహ్మద్ షమి 26-7-87-3, మహ్మద్ సిరాజ్ 20-2-81-1, రవీంద్ర జడేజా 30-7-84-2.