Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డ్రా విడుదల
న్యూయార్క్: టాప్‌సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ తొలిరౌండ్లో క్వాలిఫయర్‌తో తలపడనున్నాడు. గురువారం రాత్రి విడుదల చేసిన చేసిన డ్రాలో రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జకోవిచ్ ఆరంభ పోరులో సునాయాస ప్రత్యర్ధి ఎదురయ్యాడు. ఇక మూడోరౌండ్లో 2014 ఫైనలిస్ట్ నిషికోరీ, క్వార్టర్ఫైనల్లో 6వ సీడ్ బెర్రెట్టినితో తలపడాల్సి ఉంటుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో 4వ సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ ఫైనలిస్ట్ జ్వెరేవ్ ఎదురుపడొచ్చు. మహిళల సింగిల్స్‌లో జపాన్ భామ నవోమీ ఒసాకా యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్ విజయం అనంతరం అర్ధాంతరంగా వైదొలిగిన ఒసాకా.. చెక్ రిపబ్లిక్కు చెందిన అన్‌సీడెడ్ 23ఏళ్ల మారీ బుస్కోవాతో తలపడనుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో అమెరికా యువ సంచలనం కోకా గాఫ్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత కెర్బర్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యుఎస్ ఓపెన్‌లో ఒసాకాకు 3వ ర్యాంక్ దక్కింది. ఆగస్టు 30(సోమవారం) నుంచి యుఎస్ ఓపెన్ ప్రారంభం కానుండగా.. కరోనా నేపథ్యంలో ప్రేక్షకుల్లేకుండా గ్రాండ్‌స్లామ్ పోటీలు జరగనున్నాయి.
ప్రజ్ఞేశ్ ఓటమి..
రెండోరౌండ్‌కు చేరి ఆశలు రేపిన భారత ఏకైక ఆశాకిరణం ప్రజ్ఞేశ్ గుణ్ణేశ్వరన్ పరాజయాన్ని చవిచూశాడు. గురువారం రాత్రి జరిగిన పోటీలో గుణ్ణేశ్వరన్ 3-6, 4-6 తేడాతో అమెరికాకు చెందిన యుబంక్ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈసారి యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌కు భారత ఆటగాళ్ళెవ్వరూ అర్హత సాధించలేకపోయారు.