Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో పారాలింపిక్స్‌కు భారత్ రికార్డు బృందాన్ని పంపించినా.. టేబుల్ టెన్నిస్ నుంచి పతకం ఆశించలేదు. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భవీనాబెన్ పటేల్‌పై భారత శిబిరంలోనూ ఎటువంటి అంచనాలు లేవు. పతకం సాధిస్తాననే నమ్మకంతోనే టోక్యోకు చేరుకున్న భవీనాబెన్ పటేల్ ఏకంగా బంగారంపైనే గురిపెట్టింది. వరల్డ్ నం.2, వరల్డ్ నం.3 అథ్లెట్లను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్న భవీనాబెన్ నేడు పసిడి పోరులో వరల్డ్ నం.1, చైనా అథ్లెట్‌తో తలపడనుంది.
- పసిడి పోరుకు భవీనాబెన్ పటేల్
- టేబుల్ టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర
- 2020 టోక్యో పారాలింపిక్స్
నవతెలంగాణ-టోక్యో
భవీనాబెన్ బంగారంపై గురిపెట్టింది. టేబుల్ టెన్నిస్‌లో కనీసం రజతం ఖాయం చేసుకుని టోక్యో పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ నయా చరిత్ర సృష్టించింది. వరుస మ్యాచుల్లో తనకంటే మెరుగైన ర్యాంకింగ్ క్రీడాకారిణీలపై విజయాలు నమోదు చేసిన భవీనాబెన పటేల్..టేబుల్ టెన్నిస్‌లో చారిత్రక స్వర్ణం దిశగా సాగుతోంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా పారా అథ్లెట్, వరల్డ్ నం.3 జాంగ్ మియావోపై భవీనాబెన్ పటేల్ సంచలన విజయం సాధించింది. ఐదు గేముల పాటు ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్ సమరంలో భవీనాబెన్ పటేల్ 7-11, 11-7, 11-4, 9-11, 11-8తో చారిత్రక విజయం సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనా స్టార్, వరల్డ్ నం.1 యింగ్‌తో తలపడనుంది.
భవీనా భేష్ : టోక్యో పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ అద్భుతం కొనసాగుతోంది. అంచనాలు లేకుండా టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 విభాగంలో బరిలో నిలిచిన భవీనాబెన్ పటేల్.. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లోనే పరాజయం చవిచూసింది. ఆ తర్వాత పుంజుకున్న భవీనా పటేల్ గ్రూప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి నేడు ఫైనల్స్ వరకు చేరుకుంది. నాకౌట్ దశలో భవీనాబెన్ పటేల్ సాధించిన విజయాలు సాధారణం కాదు. 2016 రియో పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ సెర్బియా అథ్లెట్‌ను ఓడించిన భవీనాబెన్ పటేల్.. భారత్‌కు తొలి పతకం ఖాయం చేసింది. సెమీఫైనల్లో వరల్డ్ నం.2, రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ చైనా అథ్లెట్‌ను మట్టికరిపించింది. ప్రపంచ శ్రేణి నైపుణ్యం, తెలివైన కదలికలతో భవీనాబెన్ అద్భుతమే చేసింది.
వరల్డ్ నం.2తో సమరంలో భవీనాబెన్ అంత సులువుగా విజయం సాధించలేదు. తొలి గేమ్‌లోనే చైనా అథ్లెట్ 11-7తో భవీనాబెన్‌కు ఝలక్ ఇచ్చింది. రెండో గేమ్‌లో పుంజుకున్న భవీనాబెన్ పటేల్ 11-7తో రేసులోకి వచ్చింది. మూడో గేమ్‌లో డ్రాగన్ అథ్లెట్‌పై భవీనా తిరుగులేని పైచేయి సాధించింది. 11-4తో ఏకపక్షంగా గేమ్‌ను గెల్చుకుంది. నాలుగో గేమ్‌ను 9-11తో కోల్పోయినా.. నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో భవీనాబెన్ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. 11-8తో పైచేయి సాధించి ఫైనల్లోకి దూసు కెళ్లింది. పసిడి పోరుకు చేరుకునే అవకాశం ముంగిట, ఎనలేని ఒత్తిడిని జయించిన భవీనాబెన్ కూల్‌గా చైనా అథ్లెట్‌ను కొట్టేసింది.
నిరాశపరిచారు : భారత పారా అథ్లెట్లు ఇతర ఈవెంట్లలో నిరాశపరిచారు. ఆర్చరీలో ఇద్దరు అథ్లెట్లూ నిష్క్రమించారు. అమెరికా ఆర్చర్ చేతిలో 142-139తో శ్యామ్ సుందర్ స్వామి ఓటమి చెందాడు. హాంగ్‌కాంగ్ ఆర్చర్ చేతిలో రాకేష్ కుమార్ 144-131తో పరాజయం పాలయ్యాడు. దీంతో ఆర్చరీలో పతక అవకాశం చేజారింది. జావెలిన్ త్రోలో రంజీత్ భాటి తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఆరు ప్రయత్నాల్లోనూ ప్రామాణిక మార్క్ అందుకోలేకపోయాడు. జావెలిన్ ఎఫ్57 విభాగంలో పతక ఈవెంట్‌కు చేరకుండానే నిష్క్రమించాడు.