Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టెస్టులో భారత్ ఓటమి
- రాబిన్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన
- పటౌడీ సిరీస్ 1-1తో సమం
తొలి ఇన్నింగ్స్ భారీ లోటును నెమ్మదిగా పూడ్చుకుంటూ వచ్చిన పుజారా, కోహ్లి ద్వయం కొత్త ఆశలు కల్పించటంతో మూడో రోజు ఆట ముగియగా.. నాలుగో రోజు పోరాటం ఆశించిన అభిమానులకు భంగపాటు తప్పలేదు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సహా రాణిస్తారనే అంచనాలున్న ఆటగాళ్లు సైతం తేలిపోయారు. నాలుగో రోజు ఆట ఉదయం సెషన్లోనే మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌కు అప్పగించారు. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మూడో టెస్టులో ఘన విజయం సాధించింది. పటౌడీ ట్రోఫీని 1-1తో సమం చేసింది .
నవతెలంగాణ-లీడ్స్
లార్డ్స్‌లో అద్వితీయ విజయం సాధించిన జట్టు లీడ్స్‌లో అధ్వాన ప్రదర్శన చేయగా.. లార్డ్స్‌లో తేలిపోయిన జట్టు లీడ్స్‌లో దుమ్మురేపింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ మూడో టెస్టులో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే కుప్పకూలిన టీమ్ ఇండియా మరో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. చతేశ్వర్ పుజారా (91, 189 బంతుల్లో 15 ఫోర్లు), విరాట్ కోహ్లి (55, 125 బంతుల్లో 8 ఫోర్లు) జోడీ నిష్క్రమణతో ఇంగ్లాండ్ విజయం లాంఛనమైంది. అజింక్య రహానె (10), రిషబ్ పంత్ (1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ (5/65) ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత పోరాటానికి తెరదించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను చావుదెబ్బ కొట్టిన ఒలీ రాబిన్సన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. లీడ్స్ టెస్టు ఇంగ్లాండ్ వశమవగా ఐదు టెస్టుల పటౌడీ ట్రోఫీ 1-1తో సమమైంది. సిరీస్‌లో మరో రెండు టెస్టులు (ఓవల్, ట్రెంట్‌బ్రిడ్జ్) ఆడాల్సి ఉంది.
రాబిన్సన్ పంజా : ఓవర్‌నైట్ స్కోరు 215/2తో నాలుగో రోజు ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఒలీ రాబిన్సన్ షాకిచ్చాడు. 91 పరుగులతో శతకానికి చేరువలో ఉన్న చతేశ్వర్ పుజారాను ఓవర్‌నైట్ స్కోరుకే అవుట్ చేసిన రాబిన్సన్.. భారత ప్రతిఘటనకు ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. 45 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ ఆరంభించిన కోహ్లి మరో పది పరుగులు జోడించి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్న కోహ్లిని సైతం రాబిన్సన్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆదుకుంటాడని ఆశించిన అజంక్య రహానె (10, 25 బంతుల్లో 2 ఫోర్లు)ను అండర్సన్ అవుట్ చేయగా.. ప్రమాదకర రిషబ్ పంత్ (1) రాబిన్సన్కు వికెట్ కోల్పోయాడు. ఈ ఇద్దరి నిష్క్రమణతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విజయం లాంఛనం చేసుకుంది. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా (30, 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు జోడించి ఓటమి అంతరాన్ని కుదించాడు. లార్డ్స్ హీరోలు మహ్మద్ షమి (6), జశ్‌ప్రీత్ బుమ్రా (1 నాటౌట్), మహ్మద్ సిరాజ్ (0) సహా ఇషాంత్ శర్మ (2)లు ఇంగ్లాండ్ బౌలర్ల పని తేలిక చేశారు!. రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలోనే భారత్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన కోహ్లిసేన ఓటమి ముందే ఖాయమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ సంచలనంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 78/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 432/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (ఎల్బీ) రాబిన్సన్ 59, కెఎల్ రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్ 8, చతేశ్వర్ పుజారా (ఎల్బీ) రాబిన్సన్ 91, విరాట్ కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 55, అజింక్య రహానె (సి) బట్లర్ (బి) అండర్సన్ 10, రిషబ్ పంత్ (సి) ఓవర్టన్ (బి) రాబిన్సన్ 1, రవీంద్ర జడేజా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 30, మహ్మద్ షమి (బి) మోయిన్ అలీ 6, ఇషాంత్ శర్మ (సి) బట్లర్ (బి) రాబన్సన్ 2, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 1, మహ్మద్ సిరాజ్ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్ 0, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (99.3 ఓవర్లలో ఆలౌట్) 278.
వికెట్ల పతనం : 1-34, 2-116, 3-215, 4-237, 5-239, 6-239, 7-254, 8-257, 9-278, 10-278.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 26-11-63-1, ఒలీ రాబిన్సన్ 26-6-65-5, క్రెయిగ్ ఓవర్టన్ 18.3-6-47-3, శామ్ కరన్ 9-1-40-0, మోయిన్ అలీ 14-1-40-1, జో రూట్ 6-1-15-0.